తెలంగాణలో బిసిలు కోల్పోయిందేమిటి, కోరుతున్నదేమిటి?
2019లో కెసిఆర్ సర్కార్ లోకల్ బాడీస్ బీసీ రిజర్వేషన్లలో 11శాతం కోత విధించింది. తర్వాత కాంగ్రెస్ 42 శాతానికి పెంపు అనింది. బిసిలు కనీసం పోయిందయినా తెచ్చుకోగలరా?
By : The Federal
Update: 2024-07-14 01:19 GMT
-డాక్టర్ తిరునాహరి శేషు
దేశంలో 50 శాతం కంటే ఎక్కువ జనాభా గల వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగాలలో జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ రిజర్వేషన్లు అమలు అవుతున్నప్పటికీ చట్టసభలలో కూడా రిజర్వేషన్లు కావాలనే వెనుకబడిన తరగతుల డిమాండ్ దశాబ్దాలుగా నెర వేరని కలగానే మిగిలిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వెనుకబడిన వర్గాలు చట్టసభలలో రిజర్వేషన్లు పొందలేకపోయినారు.
కానీ రాష్ట్రాలలోని స్థానిక సంస్థలలో ఆయా ప్రభుత్వాల వెసులుబాటుని బట్టి రిజర్వేషన్లు కల్పించబడినాయి. మహిళలకి చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు దశాబ్దాల నిరీక్షణ తర్వాత పార్లమెంటు ఆమోదం పొందిన నేపథ్యంలో చట్టసభలలో రిజర్వేషన్లు కావాలనే వెనుకబడిన తరగతుల డిమాండ్ పై కూడా దేశవ్యాప్తంగా చర్చ మళ్ళీ మొదలైంది కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఉన్న 34శాతం రిజర్వేషన్లు తగ్గిన నేపథ్యంలో వివాదం మళ్లీ మొదలైంది. వెనుకబడిన తరగతులకి చట్టసభలలో రిజర్వేషన్లు రాకపోగా స్థానిక సంస్థలలో బీసీలకి ఉన్న రిజర్వేషన్లు తగ్గిపోవడంతో వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్ల కోసమే కాదు రిజర్వేషన్లను కాపాడుకోవడానికి కూడా పోరాడాల్సి రావటం శోచనీయం.
రిజర్వేషన్లు తగ్గటం వలన నష్టం
1994 నుండి స్థానిక సంస్థల ఎన్నికలలో 243 ఆర్టికల్ ప్రకారంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. కానీ 2019లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ముఖ్యంగా గ్రామపంచాయతీ, జడ్ పి టీ సి, ఎంపిటిసి ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లను 34శాతం నుండి 22.79 శాతానికి తగ్గించి ఎన్నికలు నిర్వహించారు అంటే బిసిలు 11శాతం రిజర్వేషన్లు కోల్పోవటం వలన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీసీల స్థానిక నాయకత్వంపై దెబ్బ పడిందనే చెప్పాలి. ఈ 11శాతం రిజర్వేషన్లు తగ్గింపు వలన తెలంగాణలోని 12,769 గ్రామపంచాయతీలలో 1404 గ్రామపంచాయతీలను 538 జడ్ పి టీ సి లలో 58 జడ్ పి టీ సి లను 5817 ఎంపీటీసీలలో 640 ఎంపిటిసి లను బీసీలు కోల్పోయినారు.
రిజర్వేషన్ల అమలులో చిక్కుముడులు
2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం బిసి రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి తగ్గించి ఎన్నికలు జరిపితే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇది సాధ్యమా? స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లు ఎందుకు తగ్గాయి అనేది ఒక సందేహమైతే బీసీ రిజర్వేషన్ల అమలులో అనేక చిక్కుముడులు ఉన్నాయి వాటిని విప్పకుండా స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను రక్షించటం కూడా సాధ్యం కాదు.
2019లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ సి ఎస్టీలకు స్థానిక సంస్థలలో ఇచ్చే రిజర్వేషన్లని 16 శాతం నుండి 27.21 శాతానికి పెంచటం వలన సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు కాబట్టి బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుండి 22.79 శాతానికి తగ్గించారు. అంటే రాజ్యాంగం ప్రకారంగా ఎస్ సి,ఎస్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచడం వలన మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా రిజర్వేషన్ల పరిధి 50 శాతానికి మించకూడదనే నిబంధన వలన భవిష్యత్తులో కూడా బిసి ల రిజర్వేషన్లకు రక్షణ లేదనే విషయాన్ని గమనించాలి.
సుప్రీంకోర్టు సూచనల మేరకు స్థానిక సంస్థలలో ట్రిపుల్ టెస్ట్ ద్వారా కూడా బీసీ వర్గాల రిజర్వేషన్లను కాపాడటం సాధ్యం కాకపోవచ్చు . బీసీల వెనకబాటుకి సంబంధించి ప్రత్యేక బీసీ కమిషన్ ద్వారా లెక్కలు తీయాలి ఆ లెక్కల ఆధారంగా కోటాను నిర్ణయించాలి కోటాను నిర్ణయించే సందర్భంలో ఎస్ సి ఎస్టీ ల జనాభా ప్రకారంగా వాళ్లకు రిజర్వేషన్లు కేటాయిస్తూ 50 శాతం పరిధి దాటకుండా కోటా నిర్ణయించాలని ట్రిపుల్ టెస్ట్ చెబుతుంది.
బీహార్ పరిణామాలు
బీహారీ జాతి ఆదారిత గణన తరువాత బీహార్ ప్రభుత్వం విద్యా ఉద్యోగాలలో ఎస్ సి, ఎస్టీ, ఓబీసీ, మరియు ఎంబీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లను 46 శాతం నుండి 65 శాతానికి పెంచినది కానీ రిజర్వేషన్ల పరిధి 50 శాతానికి మించిపోయిందని పాట్నా హైకోర్టు రిజర్వేషన్ల పెంపుకి వ్యతిరేకంగా తీర్పునిస్తూ రిజర్వేషన్ల పెంపును కొట్టివేసింది. అయితే బీహార్ ప్రభుత్వం పాట్నా హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ 60 శాతం రిజర్వేషన్ల పెంపుని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ల పెంపును కాపాడాలని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. బీహార్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే విద్యా ఉద్యోగాలలోనైనా స్థానిక సంస్థలలో నైనా రిజర్వేషన్ల పరిధి 50 శాతానికి మించితే అది న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటుందనే విషయాన్ని గమనించాలి.
పరిష్కారాలు ఏమిటి
2019 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో ఎస్ సి మరియు ఎస్టీలకు చెందిన జనాభా పెద్దగా లేకపోవడం వలన బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయగలిగినారు కానీ ఎస్ సి,ఎస్టీ జనాభా అధికంగా ఉన్న గ్రామపంచాయతీలలోనూ, మండల పంచాయతీల్లోనూ జిల్లా పరిషత్ లోనూ బీసీ లకు గతంలో కేటాయించిన 34 శాతం రిజర్వేషన్లను అమలు చేయలేకపోయారు.
రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారంగా ఎస్ సి ఎస్టీలకు వారి జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు కేటాయించాలి కాబట్టి బీసీలకు ఇచ్చే రేజర్వేషన్లను కాపాడటానికి రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి తమిళనాడు (69 శాతం రిజర్వేషన్లు) తరహాలో రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్ లో చేర్చాలి లేదా తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించినట్లుగానే 500 ఎస్ సి జనాభా ఉన్న ప్రాంతాలను పంచాయతీలుగా గుర్తించి వాటిని రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకురావడం ద్వారా బీసీలకు ఇచ్చే రేజర్వేషన్ లను కొంత మేరకు కాపాడటానికి అవకాశాలు ఉన్నాయి.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా హిస్సే దారి న్యాయ లో భాగంగా దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రిజర్వేషన్లపై ఉన్న 50శాతం పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఈ హామీల ద్వారా రిజర్వేషన్ల విషయంలో బీసీల ప్రయోజనాలను కొంతమేరకు కాపాడటానికి అవకాశం ఉంది. రాజ్యాంగపరమైన చట్టపరమైన చిక్కుముళ్ళు ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థలలో బీసీలకి గతంలో ఉన్న 34 శాతం రిజర్వేషన్లను ఎలా కాపాడగలుగుతారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇవ్వగలుగుతారో వేచి చూడాల్సిందే. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి సుప్రీంకోర్టు ఏ విధంగా రక్షణగా నిలబడిందో రిజర్వేషన్లు పెంచిన బీహార్ ప్రభుత్వానికి పెంచడానికి సిద్ధపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సామాజిక న్యాయం కోసం సుప్రీంకోర్టు రక్షణగా నిలబడుతుందని ఆశిద్దాం.
(డాక్టర్ తిరునాహరి శేషు,బి సి జాక్ రాష్ట్ర చైర్మన్, వరంగల్, తెలంగాణ)