హైదరాబాద్ అజహర్ మక్సూసి ‘దో రోటీ’ క్యాంపెయిన్‌కు పదేళ్లు

డబ్బు దానంగా ఇవ్వొద్దు, ఇంటి నుంచి రోజూ మీతోె రెండు రొట్టెలు తీసుకెళ్లండి, పేదల ఆకలి తీర్చేందుకు...;

Update: 2025-05-30 09:20 GMT
డబీర్ పురా వంతెన కింద అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అజహర్ మక్సూసి

హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని డబీర్ పురా ప్రాంతానికి చెందిన సయ్యద్ అజహర్ మక్సూసి నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి నుస్రత్ షా ఆలం టీబీతో మరణించాడు. తండ్రి లేక పోవడంతో అన్నం పెట్టే వారు లేక బాల్యం నుంచి ఆకలిదప్పులతోనే అర్ధాకలి తీర్చుకుంటూ అజహర్ పెరిగారు.నేను నా కుటుంబం ఆకలితోనే నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయని, ఇప్పటికీ ఆ రోజులు నాకు గుర్తుకు వస్తుంటాయని చెబుతుంటారు అజహర్. భవనాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ పనులు నేర్చుకున్న అజహర్ కు కూలి పనులతో ఉపాధి లభించింది.




 మలుపుతిప్పిన ఘటన

అజహర్ మక్సూస్ కూలీ పనికి వెళ్లి డబీర్ పురా రైల్వేస్టేషన్ నుంచి తిరిగి వస్తుండగా లక్ష్మీ అనే ఓ వృద్ధురాలు ఆకలితో మూలుగుతూ కనిపించింది. అంతే ఆకలి బాధ ఎలా ఉంటుందో బాల్యం నుంచి అనుభవించిన అజహర్ వెంటనే సమీపంలోని హోటల్ కు వెళ్లి భోజనం తీసుకువచ్చి లక్ష్మీ ఆకలి తీర్చాడు. అంతే ఈ ఘటన అజహర్ లో తాను బాల్యంలో పడిన ఆకలి కష్టాలు ఎవరికి రావద్దంటూ తలంచాడు. ఇంటికి వచ్చి భార్యతో చర్చించి ఉన్నదాంట్లోనే ప్రతీరోజూ కొంత అన్నం, కూరలను తీసుకొని ఫుట్ పాత్ లపై నివాసముంటున్న వారి ఆకలి తీర్చడం మొదలు పెట్టారు.అన్నార్తుల ఆకలి తీర్చడానికి అజహర్ దో రోటీ క్యాంపేన్ ఆరంభించారు.అజహర్ మక్సూసితో ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి మాట్లాడారు.అన్నదానం, దో రోటి క్యాంపేన్ లపై అహజర్ మక్సూసి మాటల్లోనే తెలుసుకుందాం.



 డబీర్ పురా బ్రిడ్జి కింద ప్రతీరోజూ అన్నదానం

‘‘ఆకలికి మతం లేదు, వయసు లేదు, జాతి లేదని నేను నమ్ముతాను. భారతదేశంలో ప్రతీ రోజూ 30 లక్షలమంది ఆకలితోనే అలమటిస్తున్నారు.ఆకలితోనే అలమటిస్తున్న వారి సంఖ్యలో భారతదేశం వరల్డ్ హంగర్ ఇండెక్స్ ప్రకారం 107వ స్థానంలో ఉంది. అందుకే నేను బాల్యం ఆకలితో అలమటించిన రోజులు అనుక్షణం నాకు గుర్తుకు వస్తుంటాయి. అందుకే నా సంపాదనలో కొత్త మొత్తాన్ని వెచ్చించి ప్రతీరోజూ డబీర్ పురా బ్రిడ్జి కింద యాచకులు, చెత్త ఏరుకునే వారు, గూడు, దిక్కూ మొక్కూ లేని వారు, కూలీలు, నిరుపేదలకు ప్రతీరోజూ మధ్యాహ్నం ఒంటి గంటకు ఉచితంగా అన్నం, దాల్చా వడ్డిస్తుంటాను. నా లాగా ఎవరూ ఆకలితో అలమటించకూడదని నేను అన్నదాన కార్యక్రమాన్ని పదేళ్లుగా చేస్తున్నాను.’’



 అమితాబ్ షోతో గుర్తింపు

ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టి వారి ఆకలిదప్పులు తీరుస్తున్న నాకు 2015వ సంవత్సరంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆజ్ కీ రాత్ హై జిందగీ టీవీ షో కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ షో తర్వాత నేను చేస్తున్న సేవా కార్యక్రమానికి గుర్తింపు లభించింది. ఆ తర్వాత మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పిలిచి నేను చేస్తున్న సేవలను అభినందించారు. జాతీయ టీవీలలో నా సేవల గురించి స్టోరీలు రావడంతో నేను చేస్తున్న అన్నదానం కార్యక్రమానికి విరాళాలిస్తామని కొందరు దాతలు ముందుకు వచ్చారు.



 సనీ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రారంభం

నేను చేస్తున్న సేవలకు ఎవరి నుంచి విరాళాలు ఇవ్వమని అడగనని, కొందరు మానవతావాదులు సహాయం అందిస్తే వాటితోనే నా అన్నదానం కార్యక్రమాలను కొనసాగిస్తున్నాను.తన సంపాదనలో కొంత భాగంతో పాటు దాతల నుంచి విరాళాలు వస్తుండటంతో నేను సనీ వెల్ఫేర్ ఫౌండేషన్ ను ప్రారంభించాను. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వ్యాన్తు కొని ఫ్రీ ఫుడ్ వ్యాన్ అని రాయించి మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రి , బర్కత్ పురాలోని వీఎస్ టీ వద్ద ఫ్రీ ఫుడ్ వ్యాన్ ద్వారా అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాను. డబీర్ పురా బ్రిడ్జి కిందనే ముగ్గురు వంటవాళ్లను నియమించి వారితో భోజనం వండించి నగరంలో మూడు ప్రాంతాల్లో 400 మందికి అన్నదానం చేస్తున్నాను. ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చడంలోనే నాకు సంతృప్తి ఉంది. పేదల కోసం మనం ఏదైనా మంచి పనిచేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడని నేను నమ్ముతాను, గత పదేళ్లుగా నేను చేస్తున్న అన్నదానం కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు. కోవిడ్ ప్రబలినపుడు కూడా నేను అన్నదానం కొనసాగించాను.



 దో రోటి క్యాంపేన్

పేదలు, అన్నార్తుల ఆకలి తీర్చడానికి దో రోటి క్యాంపేన్ ను ప్రారంభించాను. ఎవరికి వారు ఇంట్లో నుంచి ఆఫీసులకు, దుకాణాలు వెళ్లేందుకు వచ్చేటపుడు తాము తిని రెండు రొట్టెలు కవరులో పెట్టుకొని బయటకు వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అడుక్కుంటున్న వారికి, లేదా ఫుట్ పాత్ లపై నివాసముంటున్న నిరుపేదలకు, గూడు, దిక్కూమొక్కూ లేని వారికి దానంగా ఇవ్వమని కోరుతూ ప్రచారం చేపట్టాను. పేదలకు రెండు రొట్టెలు ఇచ్చి ఆకలి తీర్చండి కానీ, వారికి డబ్బులు దానం ఇవ్వకండి అని కోరుతున్నాను. డబ్బులిస్తే ఆ డబ్బును వృథా చేస్తారు, కానీ రెండు రొట్టెలు ఇస్తే వారు దాంతో కడుపు నింపుకుంటారు అనేది నా నినాదం. దో రోటీ ప్రచారంలో మీరందరూ పాల్గొనవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. దయచేసి అవసరంలో ఉన్న ఎవరికైనా రెండు రోటీలు ఇవ్వండి. రోటీలు పంపిణీ చేసేటప్పుడు మీ పిల్లలను కూడా పాల్గొనేలా చేయండి. పిల్లలతో రొట్టెలు అందజేయనివ్వండి. దీనివల్ల పిల్లలు పెద్దయ్యాక, వారు దీన్ని గుర్తుంచుకుంటారు, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.



 దాతల విరాళాలతో...

గత పదేళ్లుగా ప్రతీరోజూ దేశవ్యాప్తంగా 1500 మందికి భోజనం పెడుతున్నాను.ప్లాస్టిక్ ప్యారిస్ పనిచేస్తూనే నా వంతు విరాళంతో మొదలు పెట్టిన అన్నదానం కార్యక్రమం దాతల ఫండింగ్ తో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని 2011నుంచి విస్తరించాను. సోషల్ మీడియా ద్వారా లభించిన ప్రచారంతో చాలామంది దాతలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు అన్నం, దాల్చా వడ్డిస్తున్నాను. కర్ణాటక, ఒడిశా,అసోం, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఉచిత అన్నదానం కార్యక్రమం కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని బెంగళూరు, రాయచూర్, తాండూర్ ప్రాంతాలకు విస్తరించాను.



ఆకలికి మతం ఉండదు...

ఆకలికి జాతి, మతం ఉండదు, రోడ్డుపై యాచకులు, చెత్త ఏరుకునే వారు, రెక్కాడినా డొక్కాడని నిరుపేదల కడుపు నింపడానికి దేశంలోని యువత సహకరిస్తున్నారు. నేను ఆకలి దప్పులతోనే పెరిగాను కాబట్టి నాకు ఆకలి బాధ నాకు తెలుసు.అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ప్రణాళికలు అంటూ ఏమీ రూపొందించలేదు, దేవుడి దయ వల్ల ఈ కార్యక్రమం నడుస్తుంది, నా అస్త్రం దేశంలో ఆకలిని తీర్చేందుకు మన ఇంటి నుంచే ప్రారంభించాలి. ఆహార వృథాను తగ్గించాలి . ఫంక్షన్లలో ఆహార వృథాను అరికట్టాలి. రాత్రి పూట ఆకలితో నిద్రపోయే వారుంటారు వారి ఆకలిని తీర్చాలి’’ అనేదే నా జీవిత లక్ష్యం అంటారు అజహర్.



 ఎన్నెన్నో అవార్డులు

నిరుపేదలు, యాచకులు, కూలీలు, అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అజహర్ మక్సూసికి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డుల లభించాయి.హైదరాబాద్ నగరంలో అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అజహర్ కు యూకే ప్రభుత్వం కామన్ వెల్త్ పాయింట్ ఆఫ్ లైట్ అవార్డును ప్రదానం చేసింది.దుబాయ్ లో హార్ట్ ఆఫ్ గోల్డ్ అవార్డుతో సత్కరించారు. పేదల ఆకలి తీరుస్తున్న అజహర్ మక్సూసి రియల్ లైఫ్ హీరో అంటూ చిన్నజీయర్ స్వామి అవార్డు అందించారు.‘‘నాకు అవార్డుల కంటే ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీరుస్తున్నపుడు వారి కళ్లలో కనిపించే మెరుపే నాకు సంతృప్తిని ఇస్తోంది. నా జీవితాంతం అన్నార్తుల ఆకలి తీరుస్తూనే ఉంటాను.’’ అని ముగించారు అజహర్ మక్సూసి.


Tags:    

Similar News