హైదరాబాద్ మెట్రో మహా స్పీడ్‌.. ఏయిర్‌పోర్ట్‌కి రయ్‌ రయ్‌..

హైదరాబాద్‌ నగర వాసులకు శుభవార్త. మెట్రో రైలు విస్తరణ ఊపందుకుంది. ఎక్కడున్నా విమానాశ్రయానికి రయ్‌ రయ్‌న వెళ్లొచ్చు. అదే కాదు మరెన్నో ప్రాంతాలకు కూడా..

Update: 2024-01-23 04:00 GMT
మెట్రో రైలు ప్రాజెక్ట్‌

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. వివరాలను సీఎంకు అందించారు. విస్తరణలో భాగంగా జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు పొడిగించనున్నారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్‌ 2 కింద ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్లు... ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు ఒకటిన్నర కిలోమీటర్లు మెట్రో రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు.

నాగోల్‌ టు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌...

కారిడార్‌ 4 కింద నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు 29 కిలోమీటర్లు.. మైలార్‌దేవ్‌పల్లి నుంచి ప్రతిపాదించిన హైకోర్టు వరకు 4 కిలోమీటర్లు.. అలాగే కారిడార్‌ 5 కింద రాయదుర్గం నుంచి అమెరికన్‌ కాన్సులేట్‌ వరకు 8 కిలోమీటర్లు మెట్రోను రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు. కారిడార్ 6 కింద మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు 14 కిలోమీటర్లు.. కారిడార్‌ 7 కింద ఎల్బీనగర్‌ నుంచి హయత్‌ నగర్‌ వరకు 8 కిలోమీటర్ల మెట్రో రూట్‌ మ్యాప్‌ను అధికారులు ఖరారు చేశారు. 

47 రోజుల్లోనే అమల్లోకి ప్రణాళిక..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన 47 రోజుల్లోనే మెట్రో రెండో దశ ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. మెట్రో మొదటి దశలో రూ.14,132 కోట్లతో 72 కిలోమీటర్ల పనులను ప్రతిపాదించగా.. 69.2 కిలోమీటర్లను పూర్తిచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన పనులను 2017లో పూర్తి చేశారు. ఎల్‌బీనగర్‌- మియాపూర్‌, జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్లలోని 57 స్టేషన్ల గుండా ప్రతిరోజూ 1028 సర్వీసులను నడిపిస్తున్నారు. ఈ మేరకు రోజుకు సగటున 4.80 లక్షల నుంచి 5.10 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. అయితే నగరంలో జనాభా రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో మెట్రో విస్తరణపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రెండో దశ కింద రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (31 కిలోమీటర్లు), బీహెచ్‌ ఈఎల్‌-లక్డీకపూల్‌ మధ్య (26 కిలోమీటర్లు), నాగోలు- ఎల్‌బీనగర్‌ మధ్య (5 కిలోమీటర్లు) పను లు ప్రతిపాదించారు. ఇందులో రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పనులను ప్రభుత్వమే సొంతంగా చేపడతామని ప్రకటించి రూ.6,250 కోట్లను మంజూరు చేసింది. పనులకు సంబంధించి 2022 డిసెంబర్‌ 9న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టర్‌ ఎంపికలో జాప్యం జరగడం, ఈలోగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయి ప్రభుత్వం మారడంతో పనులకు బ్రేక్‌ పడింది.

ప్రజా రవాణాకు పెద్దపీట..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రెండో దశ పనుల్లో కొంతభాగం రియల్టర్లు, రాజకీయ నాయకులకే ప్రయోజనం చేకూరేలా ఉన్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇలా కాకుండా.. ప్రజా రవాణాకు ఆమోదయోగ్యమైన మార్గంలో మెట్రోను విస్తరిస్తామని నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గత డిసెంబరు 7న పదబీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 13న మెట్రో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎయిర్‌పోర్టు మార్గాన్ని రాయదుర్గం నుంచి కాకుండా పాతబస్తీ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా మళ్లించే విధంగా ఆలోచించాలని సూచించారు. ఈ నెల 2న మరోసారి మెట్రో విస్తరణపై చర్చించారు. పాతబస్తీ నుంచి ఎల్‌బీనగర్‌ మీదుగా సవరించిన ఎయిర్‌పోర్టు అలైన్‌మెంట్‌ కోసం ట్రాఫిక్‌ అధ్యయనాలు, డీపీఆర్‌లను త్వరగా పూర్తి చేయాలని, లక్ష్మీగూడ-జల్‌పల్లి-మామిడిపల్లి స్ర్టెచ్‌లో మెట్రోలో కొంత భాగాన్ని వేసే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. సీఎం సూచించిన మార్గాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు రూట్‌మ్యా్‌పను ఇటీవల అందించగా.. ప్రభుత్వం దానికే ఆమోదముద్ర వేసింది. ఏడు మార్గాల్లో 70 కిలోమీటర్ల పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

నగరం నలుమూలలకూ మెట్రో..

నగరంలో మొదటి దశలో ఇప్పటికే 69.2 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే వీటికి అనుసంధానంగా రెండో దశలో ప్రతిపాదించిన పనులను పూర్తి చేయడం ద్వారా నగరం నలుమూలలా మెట్రో రవాణా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నాగోలు-ఎల్‌బీనగర్‌ రూట్‌ను కలపడం ద్వారా అటు రాయదుర్గం నుంచి, మియాపూర్‌ నుంచి రాకపోకలు సులువుగా ఉంటాయి. అలాగే ఎల్‌బీనగర్‌-వనస్థలిపురం-హయత్‌నగర్‌ వరకు, పాతబస్తీ నుంచి వయా చాంద్రాయణగుట్ట మీదుగా రైలును తీసుకెళ్లడంతో పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. కొత్తగా మైలార్‌దేవ్‌పల్లి నుంచి ప్రతిపాదిత హైకోర్టు వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించడంతో మెట్రో శివారు వరకు చేరుతోంది. ఇదిలా ఉండగా, కొత్త మెట్రో డీపీఆర్‌ల తయారీ శరవేగంగా జరుగుతోందని, మరో మూడు నెలల్లో డీపీఆర్‌లు సిద్ధం చేస్తామన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి. 

Tags:    

Similar News