హైదరాబాద్ 'జూ' కు కొత్త అతిథులు వస్తున్నారు...

హైదరాబాద్ నెహ్రూ జూ పార్కుకు జంతువుల మార్పిడి పథకంలో భాగంగా దేశ, విదేశాల నుంచి కొత్త జంతువులు రానున్నాయి. చిన్నారులకు కొత్త వన్యప్రాణులు కనువిందు చేయనున్నాయి.;

Update: 2025-05-03 02:07 GMT
నెహ్రూ జూపార్కులో కొత్త ఆకర్షణగా తెల్లపులి

హైదరాబాద్ నగరంలోని జూపార్కుకు (Hyderabad Zoo) దేశంలోని వివిధ జూపార్కుల నుంచి వన్యప్రాణులను ఎనిమల్ ఎక్సేంజ్ ప్రోగ్రాం కింద తీసుకువస్తున్నారు. రోహతక్, కాన్పూర్, గోపాలపూర్,విశాఖపట్టణం, రాయపూర్ తదితర పార్కుల నుంచి 56 వన్యప్రాణులను మార్పిడి పథకం కింద తీసుకువచ్చి క్వారంటైన్ చేశారు. క్వారంటైన్ సమయం ముగిశాక ఇతర రాష్ట్రాలనుంచి తెప్పించిన అరుదైన వన్యప్రాణులను సందర్శకుల కోసం ఎన్ క్లోజర్లలోకి మార్చనున్నారు.హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూపార్కులో దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల జంతువులు (New Animals) కనువిందు చేయనున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన జంతువులకు అనువుగా ఉండేలా ప్రత్యేక ఎన్ క్లోజర్లను నిర్మించి వాటిని క్వారంటైన్ చేసి పరిశీలించాక సందర్శకుల కోసం ఉంచుతామని జూ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.




 జంతుమార్పిడి పథకం ఇలా...

జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా మన జూపార్కు నుంచి కొన్ని జంతువులకు ఇతర జూపార్కులకు పంపించి వాటి స్థానంలో కొత్త జంతువులను రప్పించాలని నిర్ణయించారు. సెంట్రల్ జూ అథారిటీ ఆమోదంతో పలు జూపార్కుల నుంచి కొత్త వన్యప్రాణులను హైదరాబాద్ జూపార్కుకు రప్పిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జూపార్కుకు పది మూషిక జింకలను హైదరాబాద్ నుంచి పంపించి, వాటి స్థానంలో ఆసియాటిక్ సింహం, బార్కింగ్ జింకలు, బ్లాక్ బగ్, సిల్వర్ పిజంట్ లను రప్పించనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జూ పార్కుకు తెల్ల పులి, సాంబార్ జింక, బెంగాల్ టైగర్ లను పంపించి వాటికి బదులుగా చిరుతపులులు, చింకారా, అరుదైన జింకలను తీసుకురానున్నారు.



 అరుదైన జంతువులు రానున్నాయి...

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోపాల్ పూర్ నేచర్ పార్కు నుంచి సాంబార్ జింకలు, హిమాలయన్ గొర్రెలను రప్పిస్తున్నారు. డార్జిలింగ్ లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కుకు తెల్ల పులి, గోల్డెన్ నక్కలను పంపించి, వాటి స్థానంలో బెంగాల్ టైగర్, అయిదు రకాల కొత్త జంతువులను తెప్పిస్తున్నారు. భువనేశ్వర్ లోని నందన్ కానన్ జూలాజికల్ పార్కు నుంచి మొసళ్లు, మూషిక జింకలను తెప్పించాలని నిర్ణయించారు.ఛత్తీస్ ఘడ్ లోని నయా రాంపూర్ లోని నందనవన్ జూ సఫారీ నుంచి బెంగాల్ టైగర్, బార్కింగ్ డీర్ లను రప్పించాలని ఒప్పందం కుదిరింది.



 సందర్శకులకు కనువిందు చేయనున్న కొత్త జంతువులు

హర్యానా రాష్ట్రంలోని పంజోరి జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ నుంచి మూడు రకాల జంతువులను, విశాఖపట్టణంలోని ఇందిరాగాంధీ జూపార్కు నుంచి వైల్డ్ కుక్క, నల్ల హంసలను తెప్పించాలని నిర్ణయించారు. 84 రకాల జంతువులను ఇతర జూపార్కులకు జంతువుల మార్పిడి కింద పంపించి, ఆయా జూలాజికల్ పార్కుల నుంచి 127 రకాల కొత్త జంతువులను నెహ్రూ జూపార్కుకు రప్పించాలని ప్రతిపాదించారు. ఇతర జూపార్కుల నుంచి వచ్చిన జంతువులను జూపార్కులో క్వారంటైన్ చేసి కొన్ని రోజుల పాటు పశువైద్యుల పర్యవేక్షణలో ఉంచి తర్వాత వాటిని ప్రత్యేక ఎన్ క్లోజర్లలోకి తరలించనున్నారు. 127 కొత్త జంతువులు జూపార్కులో సందర్శకులకు సందడి చేయనున్నాయి.



 16 దేశాల నుంచి కొత్త జంతువుల రాక

16విదేశాల నుంచి వివిధ రకాల కొత్త జంతువులను హైదరాబాద్ జూ పార్కు తీసుకురావాలని నిర్ణయించారు.(India and Abroad) విదేశీ వన్యప్రాణుల నివాసానికి అనువుగా నెహ్రూ జూపార్కులో ఏర్పాట్లు చేశారు.కంగారూల నివాసానికి వీలుగా గడ్డి పెంచి వాటికి అనువైన వాతావరణాన్ని కల్పించారు. ఆస్ట్రేలియా దేశం నుంచి రెండు కంగారూలను హైదరాబాద్ జూపార్కుకు తీసుకురానున్నారు. చెక్ రిపబ్లిక్ దేశం నుంచి తెల్ల సింహాన్ని, థాయిలాండ్ నుంచి జీబ్రాలను, ఆఫ్రికా దేశం నుంచి చింపాంజీలను రప్పించనున్నట్లు జూపార్కు క్యూరేటర్ వసంత ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

టైగర్ గ్లాస్ ఎన్ క్లోజర్
నెహ్రూ జూలాజికల్ పార్కులో టైగర్ గ్లాస్ ఎన్ క్లోజర్, టన్నెల్ అక్వేరియం నిర్మించనున్నట్లు జూ డైరెక్టర్ డాక్టర్ సునీల్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దేశ, విదేశాల పక్షుల మధ్య విహరించేందుకు వీలుగా ఏవియరీ కేంద్రం నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. వివిధ రకాల సముద్రపు చేపలతో టన్నెల్ అక్వేరియం నిర్మిస్తామన్నారు.



 జూపార్కు చిన్నారులతో కళకళ

ఈ వేసవికాలంలో నెహ్రూ జూపార్కు చిన్నారులతో కళకళలాడుతుంది.జూపార్కులకు ఆదరణ పెరగుతుండటంతో ముచ్చెర్ల కేంద్రంగా మరో జూ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. సీఎం జూపార్కులను అభివృద్ధి చేయాలని ఆదేశించడంతో ప్రైవేటు భాగస్వామ్యంతో పలు జంతువులను తీసుకువచ్చి సందర్శకులను ఆకట్టుకోవాలని నిర్ణయించారు.తెలంగాణలో విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో చిన్నారులు జూపార్కుల సందర్శనకు తరలివస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ మినీ జూపార్కులు విద్యార్థులతో సందడిగా మారాయి. పచ్చని చెట్ల మధ్య వివిధ రకాల వన్యప్రాణులను చూసేందుకు పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారని జూపార్కు పీఆర్ఓ షేక్ హనీఫ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



 వరంగల్ లో కాకతీయ జూలాజికల్ పార్కు

వరంగల్ నగరంలో కాకతీయ జూలాజికల్ పార్కును సందర్శకులతో కిటకిటలాడుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకొని కాకతీయ జూపార్కుకు ఇటీవల పులిని తీసుకువచ్చారు. ఈ పార్కులో 134 వన్యప్రాణులు,89 సరీసృపాలు, 196 రకాల పక్షులున్నాయి.కొండల మధ్య 37.01 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ జూ పార్కు వన్యప్రాణుల ప్రేమికులను ఆకట్టుకుంటోంది. హన్మకొండ, కాజీపేట, వరంగల్ నగర పరిధిలోిన హంటర్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన జూపార్కులో పులి, చిరుతపులి, అటవీ పిల్లులు, జింకలు, నీలుగాయిలు, కృష్ణ జింకలు ఉన్నాయి.



 జంతువుల పునరుత్పత్తి

కాకతీయ జూపార్కులో జంతువుల పునరుత్పత్తితో వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు కొమ్ముల జింక అయిన చౌసింఘాను తాడ్వాయి అడవుల నుంచి జూపార్కుకు తీసుకువచ్చారు. ఈ అరుదైన చౌసింఘా జింకల సంతానోత్పత్తి చేసి వీటిని పరిరక్షిస్తున్నారు. జంతువుల మార్పిడి కార్యక్రమం కింద హైదరాబాద్ నెహ్రూ జూపార్కు, విశాఖపట్టణంలోని ఇందిరాగాందీ జూపార్కు, తిరుపతిలోని వెంకటేశ్వర జూపార్కుల నుంచి నాలుగు కొమ్ముల జింకల జతలను తీసుకువచ్చి సంతానోత్పత్తి చేస్తున్నారు. హైదరాబాద్ జూపార్కు నుంచి ఉష్ట్ర పక్షి జతను వరంగల్ కు తీసుకువచ్చి ఇక్కడ సంతానోత్పత్తి చేస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర జూపార్కు నుంచి తెల్ల నెమలి, బూడిద అడవి కోడి, కాకాటియల్స్, లవ్ బర్డ్స్ ను తీసుకువచ్చారు. మొసళ్లు, నక్షత్ర తాబేళ్లు, జింకలు, ఎర్ర అడవి కోడి జాతులను కాకతీయ జూపార్కులో పెంచుతున్నారు. హైదరాబాద్ నుంచి ఒక జత నక్కలను వరంగల్ తీసుకువచ్చి జూలో సంతానోత్పత్తి చేస్తున్నారు. వరంగల్ జూపార్కు నుంచి అడవి పిల్లులను హైదరాబాద్ జూపార్కుకు తరలించారు.



 పిల్లలమర్రి మినీ జూ, జింకల పార్కు

మహబూబ్ నగర్ జిల్లా పిల్లలమర్రి మినీ జూ, జింకల పార్కు పిల్లల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చని చెట్లతో కూడిన అభయారణ్యంలో వన్యప్రాణులను చూసేందుకు పిల్లల నుంచి పెద్దల దాకా తరలివస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద మర్రి చెట్టును చూసేందుకు వస్తున్న పర్యాటకులు ఛెంగుఛెంగున దూకే జింకలను చూసి ఆనందపరవశులవుతున్నారు.800 సంవత్సరాల వయసు గల ఈ పిల్లలమర్రి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఈ మినీ జూ పార్కులో వివిధ రకాల పక్షులు, సరీసృపాలు, జింకలు, నెమళ్లు, కోతులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. పచ్చదనంతో కూడిన ఈ పార్కు పిక్నిక్ స్పాట్ గా మారింది. విహార యాత్రలు, పిక్నిక్ స్పాట్ గా మారిన పిల్లలమర్రిలో సందర్శకులకు సౌకర్యాలు కల్పించారు.


Tags:    

Similar News