‘ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తా’
బీజేపీ అధిష్టానం తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీ చెప్తే ఎమ్మెల్యే పదవిని కూడా వదులు కుంటా.;
బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ తన భవిష్యత్ కార్యాచారణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చెప్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. అంతేకాకుండా తాను ఏ పార్టీలో చేరబోనని ప్రకటించారు. జూన్ 30న ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజాసింగ్ ఏ పార్టీలో చేరతారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చాలా మంది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారంపై రాజాసింగ్ స్పందించారు. ఎంఐఎం పార్టీతో దోస్తానా చేసే కాంగ్రెస్ పార్టీలో తాను చేరే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ సందర్భంగానే తాను ఏ పార్టీలో చేరబోనని ప్రకటించారు. బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని, పార్టీ కోరాలే కానీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని వెల్లడించారు. గోషామహల్‌లో ఉపఎన్నిక వస్తే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఆదివారం ఉదయం ఆయన లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగానే తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు.
‘‘అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఒక మంత్రితో మాట్లాడాను. మోడల్ గోశాల కట్టడానికి నా సహకారం కావాలని ఆయన కోరారు. పార్టీ ఏదైనా అందరి లక్ష్యం ఒక్కటే. ప్రజలకు మంచి చేయడం. సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని వైభవంగా తీర్చిదిద్దుతామని గత ప్రభుత్వాలు రాజకీయాలు చేశఆయి. కాంగ్రెస్ ప్రభుత్వమైనా రాజకీయం చేయకుండా అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలని కోరుతున్నారు. బోనాలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాగి ఆడే బోనాలని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బోనాల సంస్కృతిని నాశనం చేయడానికి ఎంతో కాలంగా కుట్రలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవాలి’’ అని అన్నారు.
‘‘నేను ఏ పార్టీలోకి వెళ్లను. బీజేపీ అధిష్టానం తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీ చెప్తే ఎమ్మెల్యే పదవిని కూడా వదులు కుంటా. గోషామహల్ అంటే బీజేపీ అడ్డా. ఇక్కడ ఉపఎన్నిక వస్తే నాకు అభ్యంతరం లేదు. ఎవరు పోటీ చేసిన నాకెలాంటి బాధ లేదు’’ అని రాజాసింగ్ చెప్పారు.