సింగరేణి బొగ్గుకు ఇంత డిమాండా ?

దేశంలోని చాలా రాష్ట్రాలకు సింగరేణి బొగ్గు విలువ ఇపుడు బాగా తెలిసొస్తున్నట్లుంది. తమకు అర్జంటుగా బొగ్గును సరఫరా చేయాలంటు పదేపదే సింగరేణిపై బాగా ఒత్తిడి తెస్తున్నాయి.

Update: 2024-07-28 08:50 GMT
Singareni coal

దేశంలోని చాలా రాష్ట్రాలకు సింగరేణి బొగ్గు విలువ ఇపుడు బాగా తెలిసొస్తున్నట్లుంది. తమకు అర్జంటుగా బొగ్గును సరఫరా చేయాలంటు పదేపదే సింగరేణిపై బాగా ఒత్తిడి తెస్తున్నాయి. తాము ఒత్తిడి పెట్టడమే కాకుండా కేంద్రప్రభుత్వం ద్వారా కూడా సింగరేణి యాజమాన్యంపై ప్రెషర్ తెస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే థర్మల్ విద్యుత్ ఉత్పత్తకి ప్రధానంగా అవసరమైన బొగ్గు చాలా రాష్ట్రాల్లో సరిపడా లేకపోవటమే.

ఇంతకీ విషయం ఏమిటంటే దేశంలోని చాలా రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల వివిధ ప్రాంతాల్లోని బొగ్గుగనుల్లో తవ్వకాలు బాగా తగ్గిపోయాయి. దాంతో విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తిలో చాలా రాష్ట్రాలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. జలవిద్యుత్, పవన విద్యుత్ శాతం చాలా తక్కువనే చెప్పాలి. అందుకనే ఎప్పటికి థర్మల్ విద్యుత్ కు దేశంలో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రధానంగా కావాల్సింది బొగ్గు. సింగరేణి నుండి బొగ్గు ప్రతిరోజు తెలంగాణాతో పాటు ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు ఎగుమవుతోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు తగ్గిపోయాయి. ఓపెన్ క్యాస్ట్ గనుల్లో తవ్వకాలు తగ్గిపోయి అండర్ గ్రౌండ్ గనుల్లో మాత్రమే తవ్వకాలు కంటిన్యు అవుతున్నాయి.

థర్మల్ విద్యుత్ ఉత్పత్తిచేసే ఉత్పత్తి సంస్ధలన్నీ కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గును నిల్వచేసుకోవాలి. ప్రతి థర్మల్ కేంద్రంలోను కనీసం రోజుకు లక్షటన్నుల బొగ్గు అవసరమవుతుందని అంచనా. ఈలెక్కన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం స్ధాయిని బట్టి బొగ్గును నిల్వచేసుకోవాల్సిన అవసరం మారుతుంటుంది. కెపాసిటి ఎంతైనా దాని కెపాసిటి ప్రకారం ప్రతి విద్యుత్ కేంద్రం 15 రోజులకు సరిపడా బొగ్గు అయితే నిల్వ చేసుకోవాల్సిందే. దేశం మొత్తంమీద ఇపుడు చిన్నా, పెద్దా అన్నీకలిపి 166 థర్మల్ విద్యుత్ ఉత్పత్తికేంద్రాలున్నాయి. వీటికి సగటున ప్రతిరోజు 1.30 లక్షల టన్నుల బొగ్గు అవసరం. భారీ వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు తగ్గిపోవటం ఒక సమస్య అయితే వర్షాల కారణంగా కొన్ని రూట్లలో రైళ్ళను రద్దవటం మరో కారణం. పై రెండు కారణాలతో దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గు దొరకటంలేదు. అందుకనే ప్రతి విద్యుత్ కేంద్రం కూడా తమ అవసరాల్లో కనీసం 4 శాతం బొగ్గును ప్రతిరోజు విదేశాల నుండి కొనాలని కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

తెలంగాణాలోని అన్నీ థర్మల్ కేంద్రాల్లో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలుండాలంటే తక్కువలో తక్కువ 11,76,700 టన్నుల బొగ్గు నిల్వుండాలి. అయితే ఇపుడు నిల్వున్న బొగ్గు 8 లక్షల టన్నులు మాత్రమే. థర్మల్ విద్యుత్ కేంద్రాలు తెలంగాణాలోనే ఉన్నాయి, బొగ్గు సరఫరా చేసే సింగరేణి కూడా తెలంగాణాలోనే ఉంది. అయినా ఎందుకింత బొగ్గు కొరత ? ఎందుకంటే భారీ వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు సరిగా జరగటంలేదు. అందుకనే ఉత్పత్తి తగ్గిపోయింది. తెలంగాణాలో ఉన్న విద్యుత్ కేంద్రాలకే సరిగా బొగ్గు సరఫరా చేయలేకపోతున్న సింగరేణి ఇక బయటరాష్ట్రాలకు ఏమి సరఫరా చేయగలుగుతుంది ? ఇదే సమయంలో సింగరేణి పరధిలో ఉన్న గనుల్లో బొగ్గు నిల్వలు తరిగిపోతున్నాయి. కొత్త బొగ్గు గనులు సింగరేణి నుండి నరేంద్రమోడి ప్రభుత్వం లాగేసుకున్నది.

ఒకపుడు గనుల్లో తరిగిపోతున్న నిల్వలను గమనించుకుంటు, డిమాండుకు అనుగుణంగా కొత్త గనుల్లో సింగరేణి బొగ్గు తవ్వకాలు మొదలుపెట్టేది. కాని ఇపుడు తవ్వకాలు జరుగుతున్న గనులు తప్ప కొత్త గనులు సింగరేణి చేతిలో ఏమీలేవు. ఇపుడున్న గనుల నుండి బొగ్గు నిల్వలు మరో 10 ఏళ్ళు వస్తే చాలా ఎక్కువ. గనులు లేక, ఉన్న గనుల్లో నుండి బొగ్గు తవ్వకాలు తగ్గిపోవటంతో చాలా రాష్ట్రాలకు సింగరేణి బొగ్గును సరఫరా చేయలేకపోతోంది. విజయవాడ, రాయలసీమ థర్మల్ కేంద్రంలో బొగ్గు నిల్వలు 16.20 లక్షల టన్నులుండాల్సింది ఇపుడు సుమారు 2 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది.

జైపూర్లోని సింగరేణి సొంత థర్మల్ ప్లాంటులోనే ప్రతిరోజు 3.30 లక్షల టన్నుల బొగ్గు నిల్వుండాలి. అయితే ఇపుడున్న నిల్వలు 1.6 లక్షల టన్నులు మాత్రమే. వివిధ రాష్ట్రాల నుండి 2.5 లక్షల టన్నుల బొగ్గు కావాలని సింగరేణికి ప్రతిరోజు డిమాండ్ ఉంటుంది. డిమాండుకు తగ్గట్లే సింగరేణి కూడా ఉత్పత్తిచేసి సరఫరా చేస్తోంది. అయితే కొద్దిరోజులుగా బొగ్గు తవ్వకాలను తగ్గించటం, భారీ వర్షాల కారణంగా ఇపుడు రోజుకు లక్ష టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయటమే ఎక్కువగా ఉంది. అందుకనే డిమాండును దృష్టిలో పెట్టుకుని పై రాష్ట్రాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సింగరేణిపై బొగ్గు కోసం ఒత్తిడి పెంచేస్తున్నాయి. మరి వీటి డిమాండును సింగరేణి ఎలా తట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News