అందరి దృష్టి ఫిరాయింపు ఎంఎల్ఏలపైనేనా ?
విప్ జారీచేయటం అంటే పార్టీ తరపున పోటీచేస్తున్న ఇద్దరు అభ్యర్ధులకు కచ్చితంగా పార్టీ ఎంఎల్ఏలందరు ఓట్లు వేయాల్సిందే.;
ఇపుడు అందరి దృష్టి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల మీదే నిలిచింది. కారణం ఏమిటంటే ఈనెలలో ఎంఎల్ఏల కోటాలో ఐదు ఎంఎల్సీ సీట్లు భర్తీ అవబోతుండటమే. మామూలుగా అయితే మిత్రపక్షాల సహకారంతో కాంగ్రెస్ నాలుగుసీట్లను ఈజీగా తన ఖాతాలో వేసుకుంటుంది. మిగిలిన ఒక్కసీటు బీఆర్ఎస్(BRS) ఖాతాలో పడుతుంది. ఒకవేళ కాంగ్రెస్(Congress) గెలుచుకునే 4 సీట్లలో ఒకటి తమకు ఇచ్చితీరాలని ఏఐఎంఐఎం(AIMIM) పట్టుబడితే హస్తంపార్టీ ఖాతాలో పడబోయే సీట్లలో ఒకటి తగ్గి మూడుకు పరిమితమవుతుంది. లేకపోతే నేరుగా కాంగ్రెస్ నాలుగింటినీ గెలుస్తుంది. బీఆర్ఎస్ విషయంలో ఎలాంటి సమస్యలు లేవుకాబట్టి ఒక్కసీటును గెలుచుకుంటుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటిలెక్క ప్రకారం ఒక ఎంఎల్సీ సీటుకు 20 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. అసెంబ్లీ లెక్కల ప్రకారం కాంగ్రెస్+సీపీఐ కలిసి 66 మంది ఎంఎల్ఏలున్నారు. బీఆర్ఎస్ కు 38 మంది ఎంఎల్ఏలున్నారు. బీజేపీ(BJP)కి 8, ఎంఐఎంకి ఏడుగురు ఎంఎల్ఏల బలముంది. పై లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్ కు ఉన్న 65 మంది ఎంఎల్ఏల బలం ఆధారంగా మూడు ఎంఎల్సీల పదవులు వస్తాయి. బీఆర్ఎస్ కు ఉన్న 38 మంది ఎంఎల్ఏల ప్రకారం ఒక్కసీటు ఖాయం. బీఆర్ఎస్ 20 మంది ఎంఎల్ఏల ఓట్లు పోను ఇంకా 18 మంది ఎంఎల్ఏల ఓట్లు అదనంగా ఉంటాయి. అలాగే కాంగ్రెస్ లో 60 మంది ఎంఎల్ఏలు ఓట్లు వేయగా ఇంకా ఐదుఓట్లు మిగులుంటాయి. అలాగే సీపీఐ ఒక్క ఓటును కూడా కలిపితే మిగులు ఓట్లు 6 అవుతాయి. ఇక ఎంఐఎం ఏడుగురు ఎంఎల్ఏల ఓట్లను కూడా కలుపుకుంటే 13 ఓట్లవుతాయి.
ఇక్కడే ఒక పాయింట్ కీలకంగా మారింది. అదేమిటంటే బీఆర్ఎస్ లోని 38 మంది ఎంఎల్ఏల్లో పదిమంది కాంగ్రెస్ లోకి ఫిరాయించారు(BRS defected MLAs). అంటే కాంగ్రెస్ 5+సీపీఐ 1+ఎంఐఎం 7+బీఆర్ఎస్ ఫిరాయింపు 10 మంది ఎంఎల్ఏలు కలిపితే 23 మంది ఎంఎల్ఏల ఓట్లుంటాయి. అయితే రిటైర్ అవుతున్నది ఐదుగురే కాబట్టి ఇంతమంది ఎంఎల్ఏల ఓట్లున్నా ఉపయోగంలేదు. లెక్కప్రకారం కాంగ్రెస్+మిత్రపక్షాలు ఈజీగా నాలుగు సీట్లను గెలుచుకుంటాయి. ఇదే లెక్కను బీఆర్ఎస్ కూడా ఫాలో అయితే ఎన్నిక అవసరంలేకుండానే మొత్తం ఐదుగురు ఎంఎల్సీల ఎన్నిక ఏకగ్రీవమైపోతుంది. ఒకవేళ కాంగ్రెస్ కు ఎందుకు నాలుగు సీట్లను తేలికగా ఇచ్చేయాలని బీఆర్ఎస్ అనుకుంటే అప్పుడు కారుపార్టీ తరపున ఇద్దరితో నామినేషన్లు వేయిస్తుంది. బీఆర్ఎస్ నుండి ఇద్దరు నామినేషన్లు వేస్తే అప్పుడు ఎన్నిక అనివార్యమవుతుంది.
ఇక్కడే బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలు ఏమిచేస్తారన్నది కీలకంగా మారింది. బీఆర్ఎస్ ఇద్దరితో నామినేషన్లు వేయించిన తర్వాత ఎన్నిక అనివార్యమైతే అప్పుడు 38 మంది ఎంఎల్ఏలకు విప్ జారీచేస్తుంది. విప్ జారీచేయటం అంటే పార్టీ తరపున పోటీచేస్తున్న ఇద్దరు అభ్యర్ధులకు కచ్చితంగా పార్టీ ఎంఎల్ఏలందరు ఓట్లు వేయాల్సిందే. ఒకవేళ ఎవరైనా విప్ ను థిక్కరించి క్రాస్ ఓటింగ్ చేస్తే అప్పుడు సదరు ఎంఎల్ఏలు లేదా ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాస్తుంది. స్పీకర్ స్పందించకపోతే కోర్టులో పిటీషన్ వేస్తుంది. ఆల్రెడీ ఫిరాయింపులపై అనర్హత వేటువేయాలని బీఆర్ఎస్ వేసిన పిటీషన్లు సుప్రింకోర్టు విచారణలో ఉన్నాయి. అనర్హత వేటు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఫిరాయింపులపై అనర్హత వేటుపడదని రేవంత్ అండ్ కో థీమాతో ఉన్నారు.
ఈ నేపధ్యంలోనే పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలు ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. లెక్కలప్రకారం చూస్తే బీఆర్ఎస్ తరపున ఒక్క ఎంఎల్సీ మాత్రమే గెలవగలరు. కాని కాంగ్రెస్ ఎంఎల్ఏలు కొందరు తమతో టచ్ లో ఉన్నారని కేటీఆర్, హరీష్ ఒకటే ఊదరగొడుతున్నారు. ఇదే నిజమైతే ఆ ఎంఎల్ఏలను లాక్కునే ఉద్దేశ్యంతో+ఫిరాయింపు 10 మంది ఎంఎల్ఏలను ఇబ్బంది పెట్టాలని అనుకుంటే మాత్రమే బీఆర్ఎస్ ఇద్దరితో నామినేషన్లు వేయించి విప్ జారీచేస్తుంది. బీఆర్ఎస్ ఏప్లానుతో ఇద్దరితో నామినేషన్లు వేయించినా ఫిరాయింపు ఎంఎల్ఏలు ఏమి ఆలోచిస్తున్నారన్నదే ఇక్కడ కీలకం. ఈ పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లేదా ఎంఐఎం అభ్యర్ధులకు ఓట్లేస్తారా లేకపోతే అసలు ఓటింగుకే గైర్హాజరవుతారా అన్నది సస్పెన్స్ గా ఉంది.
ఇక్కడే మరో లెక్కకూడా ఉంది. అదేమిటంటే ఎవరైనా ఎంఎల్ఏలు ఓటింగుకు గైర్హాజరైతే అప్పుడు ఓట్ల లెక్క మారిపోతుంది. ఇప్పటిలెక్క ప్రకారం ప్రతి ఎంఎల్సీ ఎన్నికకు 20 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. ఎంఎల్ఏలు గైర్హాజరైతే ఎంతమంది గైరుహాజరయ్యారనేది దాన్నిప్రకారం అవసరమైన ఓట్లు తగ్గిపోతుంది. బీజేపీ 7గురు ఎంఎల్ఏలు ఏమిచేస్తారన్నది కూడా ఆసక్తిగా మారుతోంది. ఎందుకంటే బీజేపీ ఎంఎల్ఏలు ఎవరికీ ఓట్లేయరు. అలాంటపుడు ఓటింగుకు వెళ్ళటం ఎందుకు గైర్హాజరైతే సరిపోతుంది కదాని అనుకుంటే అప్పుడు ఎంఎల్సీలకు ఓట్లేయాల్సిన ఎంఎల్ఏల సంఖ్య 20 నుండి బాగా తగ్గిపోతుంది. ఒక ఎంఎల్సీకి ఎంతమంది ఎంఎల్ఏలు ఓట్లు అవసరం అన్న విషయం పోలింగ్ అయిపోయిన తర్వాత కాని కచ్చితంగా తెలీదు. ఎందుకంటే ఎంతమంది ఎంఎల్ఏలు ఓటింగుకు గైర్హాజరవుతారన్న విషయాన్ని ఇపుడే ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఓటింగ్ జరిగిన తర్వాత వ్యాలీడ్ ఓట్లను బట్టి ఎంఎల్సీలకు అవసరమైన ఓట్లను అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటిస్తుంది.
అసెంబ్లీ సెక్రటేరియట్ ఏమిచేస్తుందటంతే పోలింగుకు ముందు ఎంఎల్ఏల జాబితాను అన్నీ పార్టీలకు అందిస్తుంది. అలాగే ఓటింగ్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఎంఎల్ఏలు ఓట్లేశారు, ఎంతమంది గైర్హాజరయ్యారన్న వివరాలను ప్రకటిస్తుంది. వ్యాలీడ్ ఓట్లు, ఇన్ వ్యాలీడ్ ఓట్లను కూడా ప్రకటిస్తుంది. అప్పుడు మొత్తం వ్యాలీడ్ ఎంఎల్ఏల ఓట్లలో నుండి గైర్హాజరైన ఎంఎల్ఏల సంఖ్యను తీసేసి ఒక్కో ఎంఎల్సీ సీటుకు ఎంతమంది ఎంఎల్ఏల ఓట్లు అవసరమన్న విషయాన్ని ఫైనల్ గా లెక్కకట్టి ప్రకటిస్తుంది. తర్వాతే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీలకు పడిన ఓట్లను లెక్కపెడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలు కూడా ఓటింగుకు హాజరుకాకపోతే ఎంఎల్సీలకు అవసరమైన ఎంఎల్ఏల ఓట్లు బాగా తగ్గిపోతాయి. ఎంఎల్ఏ కోటాలో భర్తీ అవ్వాల్సిన ఎంఎల్సీ సీట్ల ఎన్నిక సమీకరణలు అయోమయంగా ఉంటాయి కాబట్టి మామూలు జనాలకు ఒకపట్టాన అర్ధంకావు. అందుకనే తొందరలో జరగబోయే ఎంఎల్ఏల కోటా ఎంఎల్సీల ఎన్నికలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలు ఏమిచేయబోతున్నారన్న విషయం బాగా ఆసక్తిగా మారింది.