తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల రగడ.. ఆ పార్టీ డిఫెన్స్‌లో పడ్డట్టేనా..?

సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడిపోయారు. తమ రాజకీయ ఉనికి ప్రమాదంలో పడిపోతుందని స్పందించే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం.

Update: 2024-04-30 12:52 GMT

(ఫెడరల్ తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల రగడ మొదలయ్యింది. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిపోయింది. తాజాగా తెలంగాణలో రిజర్వేషన్ల అంశం ఒక్కసారిగా రాజకీయాలను హీటెక్కించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లింల రిజర్వేషన్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్‌ వార్ కంటిన్యూ అవుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ వ్యాఖ్యానించారు.

నిజానికి మొదటి నుంచి బీజేపీ వ్యవహారం ఆ దిశగానే కొనసాగుతోంది. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ మార్పు అంశాలపై పరోక్షంగా పలుమార్లు బీజేపీ తన మనస్సులోని మాటను బహిర్గతం చేసింది. ఇటీవల తెలంగాణ పర్యటనలోనూ కేంద్ర హోమంత్రి అమిత్ షా ముస్లిమ్ రిజర్వేషన్ల రద్దు చేస్తామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడిపోయారు. దీంతో తమ రాజకీయ ఉనికి ప్రమాదంలో పడిపోతుందని బీజేపీ నేతలు స్పందించే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. బీజేపీకి చెందిన గల్లీ లీడర్ల దగ్గరి నుంచి మొదలుకుంటే.. ఢిల్లీ లీడర్ల వరకు రిజర్వేషన్లు రద్దు చేయట్లేదంటూ నెత్తి నోరు కొట్టుకునే ప్రయత్నం చేస్తుండడం కొసమెరుపు.

వాస్తవానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యవహార శైలికి తోడు సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యాలతో ప్రజల్లో ఆలోచన రేకెత్తినట్టయ్యింది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు రిజర్వేషన్లు రద్దు చేస్తామనే సంకేతాలు విన్పిస్తున్నా.. తెలంగాణలోని బీజేపీ నేతలు మాత్రం ఇప్పటివరకు మౌనం వహిస్తూ వచ్చారు. కనీసం ఏ ఒక్క లీడర్ రిజర్వేషన్లను రద్దు చేయడం లేదనే ప్రకటనలు చేయలేదు. కానీ సీఎం రేవంత్ వ్యాఖ్యల తర్వాత గల్లీ నుంచి మొదలుకుని ఢిల్లీ లీడర్ల వరకు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టు అయ్యింది. దీంతో తమ ఉనికిని కాపాడుకునేందుకు బీజేపీ లీడర్లు పడుతున్న ఆరాటం అంతాఇంతా కాదు. మరోవైపు తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదని, అవసరం ఉన్నంత వరకు రిజర్వేషన్లను కొనసాగించాలంటూ ఆదివారం ఆయన మాట్లాడడం కొసమెరుపు.

ఢిల్లీ పోలీసుల నోటీసులతో మారిన సీన్..

అమిత్ షా ఫేక్ వీడియో కేసులకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ గాంధీభవన్‌లోని మరో ముగ్గురు నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటివరకు ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళాతారనే ప్రచారం తారాస్థాయికి చేరింది. దీంతో కొంతమేర కాంగ్రెస్ వర్గాల్లోనూ అలజడి లేకపోలేదు. క్షేత్రస్థాయిలోనూ కాంగ్రెస్ క్యాడర్ ఈ అంశాన్ని ఫేస్ చేసేందుకు కొంత ఇబ్బంది పడిందనే చెప్పాలి. అయితే ఢిల్లీ పోలీసుల సమన్లతో కాంగ్రెస్ వర్గాలు హ్యాపీగా ఫీలవుతున్నారనే చెప్పాలి. ఢిల్లీ పోలీసుల సమన్లతో బీజేపీలోకి చేరతాడనే వార్తలకు చెక్ పడినట్టయ్యింది. మరోవైపు రేవంత్ సర్కారు 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యింది. ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలు గ్యారంటీల అమలుపైనే రేవంత్ సర్కార్‌ను టార్గెట్ చేశాయి. 6 గ్యారంటీల్లో కొన్నింటినీ మాత్రమే అమలు చేసి మిగతా పథకాలు చేయలేదనే ప్రచారానికి ఇటీవల కాలంలో చాలా పెద్ద హైప్ క్రియేట్ అయ్యింది. ప్రజల్లోనూ గ్యారంటీల అమలు విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాంగ్రెస్‌కు సామాన్య ప్రజల నుంచి ఓటింగ్‌పై ప్రభావం పడే పరిస్థితి కన్పించింది.

కానీ రిజర్వేషన్ల గొడవ తెరపైకి రావడంతో గ్యారంటీల అమలు సంగతి మరుగునపడే పరిస్థితి కన్పిస్తోంది. దీనికితోడు బీఆర్ఎస్ అధినేత కాలికి బలపం కట్టుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కృష్ణాజలాలు, రైతాంగ సమస్యలు, రైతు ఆత్మహత్యలు, ధాన్యం కొనుగోళ్లు తదితర సమస్యలన్నీ రిజర్వేషన్ల గొడవతో పక్కదారి పట్టాయని చెప్పాలి. ఇదిలావుంటే.. సీఎం రేవంత్ రెడ్డి సహా మరికొంతమందికి ఢిల్లీ పోలీసులు సమన్లు పంపించడం.. మొబైల్స్‌తో సహా మే 1న హాజరుకావాలని ఆదేశించడం.. తదితర అంశాలను పరిశీలిస్తే.. ఇప్పట్లో ఈ రిజర్వేషన్ల రగడ సద్దుమణిగేలా లేదు. మరోవైపు ఢిల్లీ పోలీసుల సమన్లపై టీపీసీసీ ఏలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే.

ఇబ్బందికర పరిస్థితుల్లో బీజేపీ కూటమి

ఢిల్లీ మొదలు గల్లీ దాకా రిజర్వేషన్స్‌ ముచ్చట రాజకీయ దుమారం రేపుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం.. ఇప్పుడు పెద్దఎత్తున రాజకీయ రచ్చకు కారణమవుతోంది. బీసీలకు తగ్గించి.. మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందంటూ ఇటీవల ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ మొదలు.. తాజాగా అమిత్‌ షా వరకు బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమవుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌ తెలుగు రాష్ట్రాలను ప్రయోగశాలగా చేసుకుందన్న బీజేపీ నేతల వ్యవహారం మరింతగా అగ్గిరాజేసింది. వరుసగా బీజేపీ కీలకనేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఏపీలో ఎన్డీఏ కూటమికి సైతం ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. తాజాగా, ఎపీ ఎన్నికల ప్రచారసభలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సైతం ఇలాంటి కామెంట్సే చేశారు. ముస్లింల బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

దీంతో, తాము ఆల్‌టైమ్‌ సెక్యులర్‌ అని చెప్పుకొంటున్న వైసీపీ.. ఈ అంశంలో కూటమిని టార్గెట్‌ చేస్తోంది. ఈ అంశంలో.. మోదీ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెడుతోన్న కాంగ్రెస్‌.. బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని చెబుతోంది. మోదీది పదేండ్ల మోసం వందేళ్ల విధ్వంసం అంటూ.. బీజేపీ నయవంచన పేరిట హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్‌ విడుదల చేసింది. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, అదే బీజేపీ విధానమని, దానికోసమే 400 సీట్లు కావాలని అంటోందనీ సీఎం రేవంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లు ఉండాలా, రద్దు కావాలా అనే దానికి ఈ ఎన్నికలు రెఫరెండమని కాంగ్రెస్ చెబుతోంది. తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే మైనార్టీ రిజర్వేషన్ల అంశం.. ఎన్నికల ఎజెండాగా మారుతున్నట్టు స్పష్టమవుతోంది. మరి, రిజర్వేషన్‌ చుట్టూ తిరుగుతున్న ఈ పొలిటికల్‌ ఫైట్‌లో ఎవరి పైచేయి సాధిస్తారో చూడాలి.

బీజేపీ పక్కా స్కెచ్‌తో ముందుకు..

వాస్తవానికి మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పక్కా వ్యుహాంతో ముందుకు వెళుతోంది. ఈ పదేండ్ల కాలంలో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం, సీఏఏ, ఒకే దేశం.. ఒకే ఎన్నికలు, రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్లు రద్దు తదితర అంశాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే ఇందులో కొన్నింటినీ ఇప్పటికే కంప్లీట్ చేయగా, మరికొన్నింటిని అమలు చేసేందుకు లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలిచేందుకు బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. అలా అయితేనే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం బీజేపీకి దక్కుతుంది. అందుకోసం ఓటర్లు అలర్ట్‌గా ఉండాలని కాంగ్రెస్ చెబుతోంది. ఇదిలావుంటే.. ఎన్నికల వేళ అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చించాల్సిన చోట ఎందుకీ అంశాలపై చర్చ సాగుతోంది ? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది ? ఇప్పుడు దీనిపైనే అంతటా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఇటీవలే విమర్శలు గుప్పించారు ప్రధాని మోడీ, అమిత్ షా సహా మరికొందరు కమలం నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశ సంపదను ముస్లింలకు దోచి పెడుతుందంటూ బీజేపీ నేతలు ఆరోపించారు.

అయితే రిజర్వేషన్ల అంశంపై తమ పార్టీ కొంత డిఫెన్స్‌లో పడినట్టే ఉందని బీజేపీ నేత సల్వాది రవికుమార్ ఫెడరల్ న్యూస్‌తో చెప్పారు. రిజర్వేషన్ల అంశంతో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను సైడ్ చేశారనే చెప్పొచ్చు. మరోవైపు అధికారంలోకి వచ్చాక కులగణన చేసి ఆయా సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు హస్తం పార్టీ ప్రయత్నం చేస్తామని చెబుతుంటే.. బీజేపీ ఎందుకు ఉలిక్కిపడుతోంది. అంతేకాదు.. 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించి వందేళ్లవుతుందని. ఆ సందర్భంగా మైనార్టీ రిజర్వేషన్లు రద్దుచేసి దేశం మొత్తాన్ని హిందూయిజం వైపు నడిపించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపణలు లేకపోలేదు. ఇక, మరికొందరు జాతీయ నేతలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ మైనారిటీలకు ఉన్న రిజర్వేషన్లు తొలగిస్తామంటూ చెప్పుకొస్తు న్నారు. నేషనల్ లీడర్లే కాదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలదీ ఇదే మాట. దీంతో.. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.

Tags:    

Similar News