‘కుల గణనకు బీజేపీ అనుకూలమా కాదా’.. ఎంపీకి పొన్నం ప్రభాకర్ సూటి ప్రశ్న
కుల గణనపై తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పార్టీ నుంచి ఒక్కో నినాదం వినిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు.
కుల గణనపై తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పార్టీ నుంచి ఒక్కో నినాదం వినిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. కుల గణన చేయడానికి బీజేపీ మద్దతు ఇస్తుందా? వ్యతిరేకిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. తన ఈ ప్రశ్నకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సమాధానం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో కుల గణన చేపట్టడంపై లక్ష్మణ్ తన అభిప్రాయం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారా? తీసుకురారా? అని కూడా నిలదీశారు. శనివారం నుంచి తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే ప్రారంభమైంది. ఈ సందర్బంగానే ఆయన కుల గణనపై వెలువడుతున్న భిన్నాభిప్రాయాలపై స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను తోసిపుచ్చారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కాంగ్రెస్ కుల గణన జరుపుతోందని బీజేపీ అంటుందని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ఈ సర్వేను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మీరు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కుల గణన ద్వారా తెలంగాణ ప్రజలకు ఎనలేని మేలు జరగనుందని, ప్రతి వర్గం వారికి ప్రభుత్వం అండగా నిలవడానికి ఈ సర్వే ఎంతగానో దోహదపడుతుందని వివరించారు మంత్రి.
ఆ ఘనత బీజేపీదే: పొన్నం
‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలా వద్దా? ఎన్నికలకు పూర్తిగా మతం రంగు పూసిన ఘనత బీజేపీదే. ఒకప్పుడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అంటే గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఆ గౌరవాన్ని ఆయనే పోగొట్టుకున్నారు. బలహీన వర్గాలను అవమానించేలా ఆయన మాట్లాడటమే అందుకు కారణం. ఎస్సీ, బీసీ, ఎస్పీ, మైనారిటీలకు బీజేపీ వ్యతిరేకం. బీజేపీ చేపట్టే ప్రతి చర్య కూడా వారికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇందుకు ఇప్పుడు కులగణనను బీజేపీ వ్యతిరేకిస్తుండటమే పెద్ద ఉదాహరణ’’ అని చెప్పారు.
ఈ పదేళ్లలో మోదీ ఏమైనా చేశారా?
‘‘బీజేపీ పూర్తిగా బలహీన వర్గాల వ్యతిరేకి. ఈ విషయాన్నే చరిత్ర గోషిస్తుంది. బీజేపీ విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. బలహీన వర్గాల పట్ల బీజేపీ వ్యతిరేక ధోరణికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వీపీ సింగ్ రిజర్వేషన్లు తెస్తే కమండలం పేరుతో పదవి నుంచి తప్పించారు. బలహీన వర్గాలకు చెందిన మోదీ.. ఈ పదేళ్ల పదవీ కాలంలో బలహీన వర్గా అభ్యున్నతి కోసం ఏ ఒక్క పనైనా చేశారా? తెలంగాణలో తాము గెలిస్తే బీసీ నేతను సీఎం సీటులో కూర్చోపెడతామని బీజేపీ వాగ్దానం చేసింది. తీరా చూస్తే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కూడా బీసీ నేతను తొలగించింది. ఇదేనా బలహీన వర్గాల నేతలకు బీజేపీ చేస్తున్న న్యాయం’’ అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్.
అందరి అంగీకారంతోనే కుల గణన
‘‘కుల గణను ఏదో గాల్లో దీపంలా చేయడం లేదు. సివిల్ సొసైటీలో అందరి అభిప్రాయాలు సేకరించే కుల గణన చేపట్టాలని నిర్ణయించుకున్నాం. దీనిని అడ్డుకోవాలని బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ సర్వే కోసం ప్రజలను ప్రభుత్వం ఏ ఒక్క డాక్యుమెంటు అడగడం లేదు. వాళ్లు మౌఖింగా చెప్తే సరిపోతుంది. అంతేకాకుండా అధికారులకు ప్రజల ఇచ్చే ప్రతి అక్షర సమాచారం కూడా గోప్యంగా, భద్రంగా ఉంటుంది. ఈ ససర్వేను బీఆర్ఎస్ చేపట్టలేకపోయింది. దానిని మేము చేసి చేపుతున్నాం. వీలైతే ప్రతి ఒక్కరూ సహకరించండి. లేకుంటే ఇంట్లో కూర్చోండి. అంతేకానీ అడ్డుపడొద్దు’’ అని వివరించారు.