మహిళా ఓట్ల కోసం రేవంత్ తిప్పలు పడుతున్నారా?
సీఎంకు స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ పెరిగిపోతోంది. మహిళా ఓటర్లే టార్గెట్‌గా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.;
సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ పెరిగిపోతున్నట్లు ఉంది. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొన్ని రోజులుగా ఆయన మహిళా సాధికారత, మహిళ కోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, చేస్తున్న పనులు, వారిని కోటీశ్వరులం చేస్తామని హామీని పదేపదే పునరుద్ఘాటించడం ఇందుకు అతిపెద్ద నిదర్శనమని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇందులో మిగిలిన మంత్రులు కూడా పాలు పంచుకుంటున్నారు. మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలని తమ ప్రభుత్వం ఫిక్స్ అయిందని ఇటీవల భట్టి విక్రమార్క కూడా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న మాట వాస్తవమని, దానిని అధిగమించి విజయం సాధించాలంటే మహిళా ఓట్లు చాలా ముఖ్యమని కాంగ్రెస్ గ్రహించిందని విశ్లేషకులు అంటున్నారు.
అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి.. పదేపదే నారీశక్తి పాట పాడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈరోజు కూడా వ్యవసాయ వర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి.. వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కూడా ఆయన మొక్కల పెంపకం, దాని ప్రాధాన్యత గురించి కాకుండా.. మహిళలకు తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం గురించే మాట్లాడటం కీలకంగా మారింది. ఈ సభలో మొక్కలు, వాటి ప్రాధాన్యత గురించి తూతూ మంత్రంగా నాలుగు ముక్కలు మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మిగిలిన ప్రసంగం అంతా కూడా మహిళల గురించే ఉంది.
రేవంత్ ఏమన్నారంటే..!
‘‘వనమే మనం… మనమే వనం అని పెద్దలు చెప్పారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధాని పిలుపునిచ్చారు. అమ్మలు కూడా పిల్లల పేరుతో మొక్కను నాటండి. ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటండి. మీ పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుంది. మహిళలను ప్రోత్సహిస్తూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించాం. ఆర్టీసీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు.. ఆర్టీసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశాం. హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండేచోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పట్టణ ప్రాంతాల్లో మహిళలు కూడాను మహిళా సంఘాల్లో చేరండి. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు రుణాలు అందించాం. అన్ని రంగాల్లో ఆడబిడ్డలను ముందు భాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతోంది. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమెల్యే సీట్లు ఇచ్చేబాధ్యత నేను తీసుకుంటా’’ అని హామీ ఇచ్చారు.
పెరుగుతున్న ఎన్నికల టెన్షన్..
కాంగ్రెస్‌తో పాటు మిగిలిన పార్టీల్లో కూడా స్థానిక సంస్థల టెన్షన్ భారీగానే పెరుగుతోంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రతి పార్టీ వ్యూహాలను రచిస్తోంది. కాగా ఈ విషయంలో కాంగ్రెస్ మాత్రం ఒకడుగు ముందే ఉందని చెప్పాలి. వాళ్లు వ్యూహాలు రచించడమే కాకుండా.. వాటిని ఆచరణలో కూడా పెట్టేస్తున్నారు. అందుకు మహిళా ఓటర్లను ఆకర్షించడానికి రేవంత్ సహా మిగిలిన కాంగ్రెస్ నేతలు పడుతున్న ప్రయాసలే నిలువెత్తు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారితో పాటుగానే రైతులు, విద్యార్థులను కూడా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ నేతలు తమ సర్కార్ తెచ్చిన పథకాలు వివరిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రజల కష్టాలపై గళమెత్తుతున్నాయి. రేవంత్ సర్కార్‌ను పలు అంశాల్లో ఎండగడుతున్నాయి.
రేవంత్ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మహిళ సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే.. ఇప్పుడు మహిళ సంక్షేమ పాట పాడుతున్నారని బీఆర్ఎస్, బీజేపీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.