ఈరోజు క్యాబినెట్ సమావేశం ఎందుకింత కీలకం ?
స్ధానికసంస్ధల ఎన్నికల(Local body Elections) నిర్వహణతో పాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై(BC Rservations) చర్చ ఉంటుంది కాబట్టే.;
తెలంగాణలో అన్నీ పార్టీల దృష్టి ఈరోజు జరగబోయే క్యాబినెట్ సమావేశంపైనే ఉంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. నిజానికి ఈసమావేశం మొన్న 25వ తేదీన జరగాల్సుంది. అయితే ఆరోజున రేవంత్ తో పాటు మరికొందరు మంత్రులు ఢిల్లీలో ఉండిపోయారు. అందుకనే అప్పటి సమావేశం ఈరోజుకు వాయిదాపడింది. ఈరోజు మధ్యాహ్నం జరగబోయే సమావేశం ఎందుకు ఇంత కీలకమైంది ? ఎందుకంటే స్ధానికసంస్ధల ఎన్నికల(Local body Elections) నిర్వహణతో పాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై(BC Rservations) చర్చ ఉంటుంది కాబట్టే.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వం ఆర్డినెన్స్ రెడీచేసిన విషయం తెలిసిందే. సంతకం కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపింది. గవర్నర్ సంతకం అయితేకాని ఆర్డినెన్స్ అమల్లోకి రాదు. అయితే ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం పెట్టకుండా కేంద్ర హోంశాఖ పరిశీలనకోసం పంపించారు. ఆర్డినెన్సును పరిశీలించి, న్యాయ, రాజ్యాంగనిపుణులతో చర్చించి ఏమిచేయాలనే విషయమై తగిన సలహా ఇవ్వాలని గవర్నర్ కేంద్రహోంశాఖను అడిగారు. దాంతో ఆర్డినెన్స్ వ్యవహారం ఇప్పట్లో తేలేదికాదని అర్ధమైపోయింది. ఈవిషయాన్ని పక్కనపెట్టేస్తే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాల రిజర్వేషన్లను జూలై 25వ తేదీకల్లా ఖరారు చేసి ప్రకటించాలని గతంలోనే హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. రిజర్వేషన్లను ఖరారు చేయాలంటే ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం కావాల్సిందే. రిజర్వేషన్లు ఖరారు కాకుండా స్ధానికఎన్నికల నిర్వహణకు రాష్ట్రఎన్నికలకమీషన్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు లేదు.
ఆర్డినెన్సుపై గవర్నర్ సంతకం, రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్, ఎన్నికల నిర్వహణ అన్నది ఒక గొలుసుకట్టు లాంటిది. ఇందులో ఏది పక్కకు జరిగినా మొత్తం ప్రక్రియ దెబ్బతినేస్తుంది. ఇందులో మొదటగా హైకోర్టు ఆదేశించినట్లుగా రాష్ట్రప్రభుత్వం ఈనెల 25వ తేదీన రిజర్వేషన్లను ఖరారు చేయలేకపోయింది. ఈవిషయమై హైకోర్టు సీరియస్ అయితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. అందుకనే ఈవిషయాలన్నింటిపైనా క్యాబినెట్ సమావేశం చర్చించబోతోంది.
ఎన్నికల నిర్వహణకు రేవంత్(Revanth) ముందు ఉన్నది రెండుమార్గాలు మాత్రమే. అవేమిటంటే మొదటిది గడచిన ఎన్నికల్లో అమలుచేసిన రిజర్వేషన్ల ప్రకారమే ఇపుడు ఎన్నికలు నిర్వహించటం. అంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కాకుండా 22శాతంతోనే ఎన్నికలు నిర్వహించటం. దీనివల్ల ఎన్నికలు జరుగుతాయి కాని బీసీలకు రేవంత్ ఇచ్చిన 42శాతం రిజర్వేషన్ల హామీని తప్పినట్లవుతుంది. ఇక రెండో మార్గం ఏమిటంటే ఎన్నికల వాయిదాను కోరుతో హైకోర్టులో ప్రభుత్వం పిటీషన్ దాఖలుచేయటం. ఎన్నికలవాయిదాను ఎందుకు కోరుతున్నామన్న విషయాన్ని హైకోర్టుకు ప్రభుత్వం లాజికల్ గా వివరణ ఇచ్చుకోవాల్సుంటుంది. ప్రభుత్వం చెప్పిన కారణంతో హైకోర్టు సానుకూలంగా స్పందిస్తే సరి లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.
రిజర్వేషన్లకు బీజేపీ దూరం : బండి
బీసీలకు 42శాతం రిజర్వేషన్లను బీజేపీ సమర్ధించే ప్రసక్తేలేదని కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తేల్చి చెప్పేశారు. బీసీల్లో ముస్లింలను కలిపేసి 42 శాతం రిజర్వేషన్లంటే బీజేపీ మద్దతు ఇవ్వదని బండి స్పష్టంగా చెప్పారు. ముస్లింలను వేరుచేసి అచ్చంగా బీసీలకు మాత్రమే 42శాతం రిజర్వేషన్లు అమలుచేస్తానంటేనే బీజేపీ మద్దతు ఇస్తుందని అన్నారు. తాము చెప్పినట్లుగా రాష్ట్రప్రభుత్వం మళ్ళీ బిల్లును పెట్టి, క్యాబినెట్, అసెంబ్లీ తీర్మానాలుచేస్తే అప్పుడు కేంద్రప్రభుత్వాన్ని తాము ఒప్పిస్తామని బండి చెప్పారు. బండి చెప్పింది చూస్తే ఆపని జరిగేట్లులేదు. ఎందుకంటే 42శాతం రిజర్వేషన్ల నుండి ముస్లింలను తొలగిస్తే వాళ్ళు అంగీకరించరు. సో, ఈ విషయాలపై చర్చలు జరగుతాయి కాబట్టే అన్నీపార్టీలచూపు మధ్యాహ్నం జరగబోయే క్యాబినెట్ సమావేశంపైన ఉంది.