క్రిక్కిరిసిపోతున్న హైదరాబాద్

అగ్ర నగరాలను పట్టిపడీస్తున్న అతిపెద్ద సమస్య అధికజనాభానే. ఎందుకంటే రాజధాని నగరాలన్నీ భారీ జనాభాతో క్రిక్కిరిసిపోతున్నాయి.;

Update: 2025-02-18 08:39 GMT

అగ్ర నగరాలను పట్టిపడీస్తున్న అతిపెద్ద సమస్య అధికజనాభానే. ఎందుకంటే రాజధాని నగరాలన్నీ భారీ జనాభాతో క్రిక్కిరిసిపోతున్నాయి. వీటికి మన హైదరాబాద్ కూడా మినహాయింపుకాదు. అభివృద్ధివైపు నగరం వేసే ప్రతి అడుగు వేలమందిని రాష్ట్ర నలుమూలల నుంచి రాజధానికి వచ్చేలా చేస్తుంది. ఉద్యోగ, విద్య అవకాశాల కోసం హైదరాబాద్‌కు వస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో హైదరాబాద్‌లో జనసాంద్రత చూసుకుంటే రాష్ట్రంలో మరే జిల్లాలో లేనంత క్రిక్కిరిసిపోతున్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో జనసాంద్రత స్క్వేర్ కిలోమీటర్‌కు తొమ్మిది రెట్లు అధికంగా ఉంది. దీనిని బట్టి చూస్తే భాగ్యనగరం ఎంత క్రిక్కిరిసిపోతోందో అర్థమవుతోంది. ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల వాళ్లు హైదరాబాద్‌కు తరలి వస్తుండటమే కాకుండా తెలంగాణ నలుమూలల నుండి కూడా ప్రతిరోజు వలసలు వస్తున్నాయి. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో ప్రజలు హైదరాబాద్‌కు రకరకాల కారణాలతో వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా అక్షరాస్యత కూడా అధికంగానే ఉంది. కానీ తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా అక్షరాస్యత విషయంలో పురుషులకంటే మహిళలు కాస్తంత వెనకబడి ఉన్నారు.

హైదరాబాద్ జనసాంద్రత ఇలా..

2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే తెలంగాణలో మొత్తం 3.50 కోట్ల మంది జనాభా ఉన్నారు. వారిలో ములుగు జిల్లాలో అత్యల్ప జనాభా 2,94,671 మంది ఉన్నారు. కాగా 39,43,323 మందితో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. జనసాంద్రత చూసుకుంటే స్క్వేర్ కిలోమీటరుకు ములుగు‌లో 71మంది జనాభా ఉంటే హైదరాబాద్‌లో 18,161 మంది జనాభా ఉన్నారు. హైదరాబాద్‌లో ఆరేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు 4,69,126 మంది ఉన్నారు. మొత్తం ఇళ్లు 8,49,051 ఉన్నాయి. అయితే రెండో అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లాగా మేడ్చల్-మల్కాజ్‌గిరి ఉన్నాయి. ఈ జిల్లాలో స్క్వేర్ కిలోమీటర్‌కు 2,321 మంది జనాభా ఉన్నారు. వీటి ప్రకారం జనసాంద్రత విషయంలో టాప్ 2 స్థానాలు చూసుకంటే వాటి మధ్య వ్యత్యాసం దాదాపు తొమ్మిది రెట్లు ఉంది. రెండో స్థానంలో ఉన్న మేడ్చల్-మల్కాజ్‌గిరిలో జనసాంద్రత 2వేల పైచిలుకు ఉంటే.. హైదరాబాద్ జనసాంద్రత 18వేల పైచిలుకు ఉంది. దీనిని బట్టి చూసుకుంటేనే హైదరాబాద్ ఎంతలా క్రిక్కిరిసిందనేది అర్థం చేసుకోవచ్చు.

భారీగా పెరుగుతున్న జనాభా

అయితే 2011 జనాభా లెక్కలను 2025 జనాభాతో పోల్చుకుంటే హైదరాబాద్‌ జనాబా భారీగా పెరిగింది. 2023-2024 మధ్యే హైదరాబాద్ జనాభా 2.48శాతం పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ పెరుగుదల ఈ ఏడాది మరింత అధికం అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణన ప్రకారం రాష్ట్ర జనాభా 3,54,77,554గా ఉంది. రాష్ట్రంలో 1,12,15,134 కుటుంబాలు ఉన్నాయి. కాగా ఇందులో దాదాపు 40శాతానికి పైగా జనాభా హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సర్వేలో తేలింది. జనాభాలో వస్తున్న ఈ భారీపెరుగుదల రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందన్న వాదన కూడా పెరుగుతోంది.

భాగ్యనగరికి తప్పని తిప్పలు

వేగంగా అభివృద్ధి చెందుతున్న అన్నీనగరాల తరహాలోనే హైదరాబాద్‌ కూడా పౌరసమస్యలను భారీగా ఎదుర్కొంటోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహనిర్మాణం, తాగునీరు, విద్యుత్, రావాణా సౌకర్యాలు, రోడ్ల అభివృద్ధి అన్నది ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారుతోంది. దీనిని అధిగమించడానికి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా పెద్దగా ఉపయోగం కనబడటంలేదు. పెరుగుతున్న జనాభాకు అవసరమైన స్ధాయిలో మౌళికసౌకర్యాల కల్పన జరగడంలేదని మేధావులు చెప్తున్నారు. వీటితో పాటుగా పెరుగుతున్న జనాభా ప్రభావం విద్య, వైద్యం, గాలి నాణ్యత, కాలుష్యం, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణం వంటి వాటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జనాభా భారీగా పెరుగుతున్న నేపధ్యంలో భూమికి కొరత ఏర్పడుతుండటంతో ఆక్రమణలు, పచ్చదనం క్షీణత జనాభా విస్పోటనానికి దారితీస్తోంది.

అభివృద్ధే సమస్యలు తెస్తోందా?

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఐదో స్థానంలో ఉంది. అన్నీరంగాల్లో నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కాగా ఇదే ఇప్పుడు నగరానికి తలనొప్పులు తీసుకొస్తుందా? అన్న అనుమానం పెరిగిపోతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పక్క జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వలసలు వస్తున్నారు. అభివృద్ధి ఒకచోట కేంద్రీకృతం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా కొందరు భావిస్తున్నారు. అన్ని సంస్థలు, పరిశ్రమలు హైదరాబాద్ కేంద్రంగా వస్తుండటంతోనే ఉద్యోగ అవకాశాల కోసం భాగ్యనగరం బాట పడుతున్నారని, దాని కారణంగా నగరంలో జనాభా అధికమై అభివృద్ధి ఆటకం కలుగుతుందని సమాచారం.

పెరుగుతున్న ధరలు

భారీగా తరలివస్తున్న జనాభా కారణంగా హైదరాబాద్ నగరం నలిగి పోతోందనేది మరో వాదన. భారీగా ప్రజలు ఇక్కడికే తరలి వస్తుండటంతో ధరల పెరుగుదలు పెరిగిపోతున్నాయి. డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా హైదరాబాద్‌లో పక్కాగా అప్లై అవుతోంది. ప్రజల అవసరాలను అవకాశాలుగా మార్చుకుని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. దానికి తోడు జనాభా ఎక్కువ, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వస్తువులు తక్కువ కావడంతో ఆటోమేటిక్‌గా వాటికి డిమాండ్ పెరుగుతోంది. గృహ, రవాణా రంగాల్లో దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అందుతున్న జీతాల కంటే అవసరాలకు పెడుతున్న ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. రానున్న కాలంలో వీటి ధరలు మరింత పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News