హైడ్రా ‘మానవత్వం’పై పెరిగిపోతున్న రాజకీయ దుమారం
2014 వరకు చెరువు విస్తీర్ణం ఎంతుంది, 2014-24 మధ్యలో చెరువు విస్తీర్ణం ఎంతగా కుచించుకుపోయిందన్న విషయం పై ఫొటో చూస్తే ఎవరికైనా అర్ధమైపోతుంది;
ఫాతిమా గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్న ఎడ్యుకేనల్ ట్రస్ట్ విషయంలో హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ చెప్పిన ‘మానవత్వం’ కారణంపై రాజకీయదుమారం రేగుతోంది. ఫాతిమా గ్రూపు ఓవైసీ(OYC Brothers) సోదరుల ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ గ్రూపుకు చెందిన విద్యాసంస్ధలు చెరువును ఆక్రమించి నిర్మించినవే అని స్పష్టమైంది. ఓవైసీ సోదరులు అంటేనే ఎంఐఎం(AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, చాంద్రాయణగుట్ట ఎంఎల్ఏ అక్బరుద్దీన్ ఓవైసీ అని అందరికీ తెలుసు. రాజకీయంగా వీళ్ళతో వైరం పెట్టుకోవటానికి బీజేపీ(Telangana BJP) తప్ప మరే రాజకీయపార్టీ కూడా ఇష్టపడదు. ఓల్డ్ సిటిలో ఎంఐఎం బలం అపారం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చాలా సంవత్సరాలుగా ఓల్డ్ సిటీలోని ఓట్లకోసం ఎంఐఎం మీదే ఆధారపడ్డాయి. అందుకనే వీళ్ళు ఆడింది ఆట పాడిందే పాటగా దశాబ్దాలుగా సాగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా వీళ్ళజోలికి పెద్దగా వెళ్ళింది లేదు.
ఇపుడు విషయం ఏమిటంటే ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) సీఎం కాగానే జలవనరుల రక్షణ, పరిరక్షణ కోసం ప్రత్యేకించి హైడ్రా(Hydra) అనే వ్యవస్ధను ఏర్పాటుచేసింది. దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాధ్ కమీషనర్ గా ఉన్నారు. హైడ్రా ఏర్పడిన దగ్గర నుండి దాని యాక్టివిటీస్ బాగా వివాదాస్పదమవుతోంది. చెరువులు, కాల్వలను ఆక్రమించి బడా బాబుల నిర్మాణాలజోలికి వెళ్ళకుండా మధ్య, దిగువమధ్య తరగతి జనాలు అప్పులుచేసి, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కొనుక్కున్న ఫ్లాట్లలో కొన్నింటిని కూల్చేసింది. అలాగే వివిధ రంగాల్లో అత్యంత ప్రముఖులు నిర్మించుకున్న ఫామ్ హౌస్ ల జోలికి మాత్రం ఇంతవరకు వెళ్ళలేదు. హైడ్రా ఏర్పాటైన కొత్తల్లో సినీనటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేసిన మాట వాస్తవం. నాగార్జున కన్వెన్షన్ సెంటర్ నే హైడ్రా కూల్చేసిందంటే ఇక మిగిలిన ఆక్రమణలదారులను ఎందుకు లెక్కచేస్తుందనే ప్రచారం జనాల్లో పెరిగిపోయింది. నగరంలో వేలాది ఆక్రమణలున్న విషయం అందరికీ తెలిసిందే. హైడ్రా కబ్జాదారుల, భూఆక్రమణదారుల భరతంపట్టడం ఖాయమని అందరు అనుకున్నారు.
అయితే అంచనాలకు భిన్నంగా హైడ్రా కొన్ని నిర్మాణాలను మాత్రమే కూల్చేసింది. మధ్య, దిగువతరగతి జనాలు బ్యాంకుల్లో అప్పులు తీసుకుని కొనుగోలుచేసిన అపార్ట్ మెంట్లను జలవనరులను ఆక్రమించి నిర్మించారన్న కారణాన్ని చూపిన హైడ్రా వాటిల్లో కొన్నింటిని కూల్చేసింది. దాంతో అప్పులుచేసి ఫ్లాట్లు కొనుగోలుచేసిన జనాలంతా రోడ్డునపడ్డారు. నిజానికి ఫ్లాట్ల కొనుగోలుదారులు చేసిన తప్పేమీలేదు. ఎందుకంటే ఆ అపార్ట్ మెంట్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ అనుమతులిచ్చాయి, బ్యాంకులు అప్పులిచ్చాయి. అన్నీ అనుమతులను చూసుకున్న తర్వాతే, బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి కాబట్టే జనాలు ఫ్లాట్లను కొన్నారు. అయితే ఫ్లాట్లు కొన్నతర్వాత హైడ్రా సదరు నిర్మాణం ఆక్రమణని, చెరువును ఆక్రమించుకుని నిర్మించిందనే ముద్రవేసి కూల్చేసింది. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖలదే తప్పంతా. చెరువుల్లో నిర్మాణాలకు రియాల్టర్లు, బిల్డర్లతో ఒప్పందాలు చేసుకున్న బ్యాంకులదీ తప్పే. తాముకొనుగోలు చేసేటపుడు ఫ్లాట్లకు ప్రభుత్వశాఖల అనుమతులున్నాయని గమనించిన తర్వాత బ్యాంకులు కూడా అప్పులిచ్చాయి కాబట్టే జనాలు ఫ్లాట్లను కొనుక్కున్నారు.
మధ్య తరగతి, దిగువ తరగతి జనాలకు జీవితకాలంలో ఒక ఇల్లు సమకూర్చుకోవటమే గగనం. ఈ విషయాలు కమీషనర్ రంగనాధ్ కు తెలీకపోవచ్చు. అందుకనే చెరువులను కబ్జాచేసి నిర్మించినవి అనే ముద్రవేసి నిర్మాణాలను కూల్చేశారు. వాటిల్లో ఉంటున్న జనాలంతా రోడ్లమీద పడ్డారు. హైడ్రా కూల్చివేతల కారణంగా ఫ్లాట్లలో ఉంటున్న వాళ్ళు రోడ్లపైన పడతారన్న ఆలోచన కమీషనర్ కు అప్పట్లో ఎందుకు రాలేదు ? వీళ్ళ విషయంలో రంగనాధ్ మానవత్వం ఎందుకు చూపలేదు. శిక్షించాల్సింది చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేసిన బిల్డర్లతో పాటు అనుమతులు ఇచ్చిన శాఖల అధికారులను. కాని రంగనాధ్ చేసినపనివల్ల రోడ్డునపడి శిక్షకు గురైంది ఫ్లాట్ల కొనుగోలుదారులు. పదులసంఖ్యలో అపార్ట్ మెంట్లను హైడ్రా కూల్చేసి ఏ తప్పూచేయని వందలమందిని రోడ్డున పడేసింది.
ఇపుడు విషయానికి వస్తే ఫాతిమా గ్రూపు ఓవైసీ సోదరుల ఆధ్వర్యంలో నడుస్తోంది. ఓల్డ్ సిటీలోని సూరారం చెరువును ఆక్రమించుకుని సోదరులు తమ విద్యాసంస్ధలను నిర్మించుకున్నారు. 2014 వరకు చెరువు విస్తీర్ణం ఎంతుంది, 2014-24 మధ్యలో చెరువు విస్తీర్ణం ఎంతగా కుచించుకుపోయిందన్న విషయం పై ఫొటో చూస్తే ఎవరికైనా అర్ధమైపోతుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై ఆధారపడింది కాబట్టే ఓవైసీ సోదరులు చెరువును ఆక్రమించేసి తమిష్టారాజ్యంగా నిర్మాణాలు చేసుకున్నారు. ఈనిర్మాణాలను తొలగించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్న సమయంలో కమీషనర్ మానవత్వం అనే డ్రామా మొదలుపెట్టారు.
కమీషనర్ ఏమన్నారంటే ‘ఫాతిమా ఓవైసీ విమెన్స్ కాలేజీ అన్నది అక్బరుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటి సంస్ధ. నిరుపేద మైనారిటి బాలికలు, యువతులకు కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. కొన్ని కోర్సులకు మాత్రమే నామమాత్రపు ఫీజులను వసూలు చేస్తున్నారు. ఈకాలేజీలో ఏటా 10వేలమంది చదువుకుంటున్నారు. మైనారిటి యువతలకు విద్యను అందించటం ద్వారా ఈకాలేజీ సామాజికవెనుకబాటుదనం నుండి వారికి విముక్తికల్పించటానికి ప్రయత్నిస్తోంది’ అని అన్నారు.
పరిధిదాటిన రంగనాధ్
నిజానికి మైనారిటి, ఉచితవిద్య, వెనుకబాటుదనం లాంటివి రంగనాధ్ పరిధిలో లేని అంశాలు. రంగనాధ్ చెప్పిన అంశాలను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. హైడ్రా చూడాల్సింది ఏమిటంటే ఫాతిమా విద్యాసంస్ధ భవనాలు చెరువు ఆక్రమణలా కాదా అని మాత్రమే. చెరువును ఆక్రమించి భవనాలను నిర్మించారా లేదా అని నిర్ధారించుకోవాలి. చెరువును ఆక్రమించి చేసిన నిర్మాణాలు అన్నవిషయం తేలితే సదరు భవనాలను కూల్చేసి మొత్తం చెరువును ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావటమే హైడ్రా టార్గెట్ గా పనిచేయాలి. హైడ్రా పరిధి ఏమిటి ? హైడ్రా టార్గెట్ ఏమిటన్న విషయాన్ని మరచిపోయిన రంగనాధ్ మైనారిటి విద్యాసంస్ధలు, ఉచితవిద్య, సమాజంలో వెనుకబాటుదనం, మానవత్వం లాంటి మాటలు ఎందుకుమాట్లాడారో అర్ధంకావటంలేదు. నిజంగానే హైడ్రా మానవత్వంతో ఆలోచించేట్లయితే గతంలో కూల్చేసిన ఫ్లాట్ల యజమానుల విషయంలో మానవత్వాన్ని ఎందుకు చూపించలేదు. అప్పట్లో ఫ్లాట్లను కూల్చేయకముందు కూడా వాటి యజమానులు రంగనాధ్ కాళ్ళుపట్టుకుని కూల్చవద్దని బతిమలాడుకున్నారు.
యజమానులు ఎంతబతిమలాడినా పట్టించుకోకుండా ఫ్లాట్లను హైడ్రా కూల్చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో చూపించిన మానవత్వం హైడ్రా కమీషనర్ రంగనాధ్ కు ఫాతిమా కాలేజీ భవనాల విషయంలోనే ఎందుకు గుర్తుకొచ్చినట్లు ? ఎందుకంటే ఫాతిమా కాలేజీ భవనాలను కూల్చేస్తే రేవంత్ ప్రభుత్వం మనుగడ ఇబ్బందుల్లో పడే అవకాశముంది. విద్యాసంస్ధలను కూల్చటానికి హైడ్రా రెడీ అయితే వెంటనే రేవంత్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిస్తే చాలు రాజకీయాల్లో గందరగోళం పెరిగిపోతుంది. అసలే అత్తెసరు మెజారిటితో రేవంత్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఎంఐఎం మద్దతుగా నిలబడింది కాబట్టే అసెంబ్లీలో రేవంత్ నెగ్గుకుని వస్తున్నారు. ఎంఐఎం వ్యతిరేకం అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. రాజకీయ కారణాలతో అందిన ఆదేశాల కారణంగానే ఫాతిమా విద్యాసంస్ధల జోలికి హైడ్రా వెళ్ళటంలేదు అన్నది వాస్తవం. ఇంతోటిదానికి సమాజం, వెనుకబాటుతనం, ఉచిత విద్య, మానవత్వం అంటు రంగనాథ్ ఏవోవే కథలు చెబుతున్నారు.
భవనాలు కూల్చాల్సిందే : బీజేపీ
ఫాతిమా విద్యాసంస్ధ భవనాలను చెరువును ఆక్రమించి నిర్మించినట్లు కేంద్రమంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు. చెరువును ఆక్రమించి నిర్మించారు కాబట్టే భవనాలను కూల్చేయాలని హైడ్రాను వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ కారణాలతోనే ఫాతిమా కాలేజీ భవనాల జోలికి హైడ్రా వెళ్ళటంలేదని వీళ్ళు ఆరోపించారు. ఓవైసీ విద్యాసంస్ధలు కూల్చకుండా రేవంత్ రెడ్డే అడ్డుపడుతున్నారని కూడా వీళ్ళు ధ్వజమెత్తారు.