జనాల ఆశలపై కేసీఆర్ నీళ్ళు చల్లేస్తున్నారా ?

బడ్జెట్ సమావేశంలో మొదటిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరైన కేసీఆర్ మళ్ళీ ఇంతవరకు సభలో కనబడలేదు.;

Update: 2025-03-19 10:13 GMT
BRS chief KCR

ఇక్కడ జనాలు అంటే మామూలు ప్రజలు కాదు కేవలం బీఆర్ఎస్ జనాలు అని మాత్రమే అర్ధంచేసుకోవాలి. విషయం ఏమిటంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారని కొడుకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రకటించిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్(KCR) పాల్గొనే విషయమై స్వయంగా కేటీఆరే చెప్పారు కాబట్టి నిజమే అని పార్టీ నేతలు, క్యాడర్ అంతా నమ్మారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ఇంకేముంది మాటలతో మంటలు పుట్టిస్తారు..సభలో అగ్గిరాజేస్తారు..రేవంత్(Revanth) ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తారు అని చాలామంది అనుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా తుస్సుమన్న టపాకాయలాగ అయిపోతుందా కేసీఆర్ యవ్వారం అనే చర్చ మొదలైంది. దీనికి కారణం ఏమిటంటే బడ్జెట్ సమావేశంలో మొదటిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరైన కేసీఆర్ మళ్ళీ ఇంతవరకు సభలో కనబడలేదు.

అసెంబ్లీ సమావేశాల్లో కనబడలేదంటే కేసీఆర్ సభకు రాలేదనే అర్ధం. బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ హాజరై రేవంత్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతారని అంతా అనుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువుపెట్టి చాకిరేవు పెడతారని అంతా ఎదురుచూశారు. అయితే కేసీఆర్ సభకు రాకుండానే ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు సభలో పెట్టడం, ఆమోదం పొండటం అయిపోయింది. బుధవారం సభలో రాష్ట్ర బడ్జెట్ ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టేశారు. కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టినపుడు, చర్చ జరిగినపుడు కూడా కేసీఆర్ సభకు రాలేదు. సమావేశాల చివరిరోజు ఈనెల 28వ తేదీ.

సభలో ఇంపార్టెంట్ బిల్లుల ప్రవేశం, ఆమోదం అయిపోయింది కాబట్టి అసెంబ్లీకి కేసీఆర్ రావటం డౌటనుమానమే అనే ప్రచారం పార్టీలో పెరిగిపోయింది. బడ్జెట్ పై గురువారం నుండి రెండు, మూడురోజులు సభలో చర్చలు జరుగుతాయి. ఆ సమయంలో కేసీఆర్ సభకు హాజరయ్యేది అనుమానమే అని సీనియర్ నేతలంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ పై చర్చల్లో మామూలుగా అయితే అధికారపార్టీ సభ్యులు, ఆర్ధికమత్రి, ముఖ్యమంత్రి ప్రసంగమే హైలైట్ అవుతుంది. కాబట్టి కేసీఆర్ సభకు హాజరైనా చేసేదేమీ ఉండదు. ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యేది దాదాపు అనుమానమే అనే ప్రచారం పార్టీలో పెరిగిపోతోంది. జరుగుతున్నది చూసిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి హజరయ్యే విషయంలో కొడుకు కేటీఆర్ చెప్పిందంతా తుస్సనిపించి పార్టీ జనాల ఆశలపై నీళ్ళు చల్లేసినట్లయ్యింది.

Tags:    

Similar News