కాంగ్రెస్ కు కిషన్ మద్దతా ?

పార్లమెంటు ఎన్నికల ఫలితాల తరువాత 25 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు.

Update: 2024-05-24 08:00 GMT
Central minister and Telangana BJP President KishanReddy

పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండి 25 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటనలో ఆశ్చర్యం ఏమీలేదు. ఎందుకంటే ఒకపుడు కాంగ్రెస్ ను లేవకుండా దెబ్బకొట్టేందుకు కేసీయార్ శతవిధాలుగా ప్రయత్నించారు. అందుకనే ఇపుడు దెబ్బకు దెబ్బ తీసేందుకు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అందుకనే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రాగానే మరో 25 మంది కారుపార్టీ ఎంఎల్ఏలు హస్తంలోకి వచ్చేస్తున్నట్లు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు పదేపదే చెబుతున్నారు.

రెండుపార్టీల మధ్య ఫిరాయింపుల వివాదాలున్నాయి కాబట్టి ఓకే. మరి కేంద్రమంత్రి, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు మద్దతుగా ఎందుకు మాట్లాడుతున్నట్లు ? ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నిక ప్రచారంలో కిషన్ మాట్లాడుతు పార్లమెంటు ఎన్నికల ఫలితాల తరువాత 25 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. కిషన్ చేసిన తాజా ప్రకటనతో చాలామంది ఆశ్చర్యపోయారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు బీజేపీలోకి వస్తారని చెప్పాల్సిన కిషన్ కాంగ్రెస్ లో చేరుతారని చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలను ఆకర్షించేందుకు కాంగ్రెస్, బీజేపీలు రెండూ దేనిప్రయత్నాలు అవి చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ ఎంఎల్ఏలను ఆకర్షించాల్సిన బాధ్యత కిషన్ మీదుంది. ఎందుకంటే కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడి హోదాలో పార్టీ బలోపేతానికి బాధ్యుడు కిషనే కాబట్టి.

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుందని కిషన్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. అత్యధిక సీట్లు సాధిస్తున్నపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు చేరాల్సింది బీజేపీలో కాని కాంగ్రెస్ లో కాదుకదా. మరి ఆదిశగా కిషన్ చేస్తున్న ప్రయత్నాలు ఏమిటో తెలీదు. కేంద్రంలో నరేంద్రమోడీనే అధికారంలోకి రాబోతున్నారని చెబుతూ, తెలంగాణాలో అత్యధిక సీట్లలో గెలుస్తుందని చెబుతున్న కేంద్రమంత్రి కారుపార్టీ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరుతారని చెప్పటమే విచిత్రంగా ఉంది. కిషన్ మాటల్లో అర్ధమవుతున్నది ఏమిటంటే తెలంగాణాలో మెజారిటి ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తోందని. మెజారిటి ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవకపోతే బీఆర్ఎస్ నుండి ఎంఎల్ఏల వలసలకు బ్రేక్ పడుతుంది. ఒకసారి బ్రేక్ పడిన తర్వాత వలసలు కాంగ్రెస్ లోకి కాకుండా బీజేపీ వైపు జరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సింది కాంగ్రెస్సే కాని బీజేపీ కాదు. అలాంటిది కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు వెళతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పటం విడ్డూరంగానే ఉంది. చూస్తుంటే కాంగ్రెస్ లో చేరమని బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కిషనే ప్రోత్సహిస్తున్నట్లో లేకపోతే మార్గదర్శనం చేస్తున్నట్లో కనబడుతోంది. మరి జనాల రియాక్షన్ కు కిషన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News