కేటీఆర్ రాజకీయసన్యాసం నిజమేనా ?

50 వేల ఓట్ల మెజారిటీకి ఒక్కఓటు తక్కువ వచ్చినా తాను రాజకీయసన్యాసం తీసుకుంటానని చాలెంజ్ చేశారు;

Update: 2025-02-11 08:10 GMT
KTR in Kosgi meeting

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచిత్రమైన డిమాండ్ మొదలుపెట్టారు. అదేమిటంటే కొడంగల్ ఎంఎల్ఏగా రేవంత్ రెడ్డి(Revanth) రాజీనామా చేయాలని. ‘రేవంత్...దమ్ముంటే రాజీనామా చేయ్’ అని కొడంగల్ నియోజకవర్గం కొస్గిలో జరిగిన బహిరంగసభలో సవాలువిసిరారు. కొడంగల్ అసెంబ్లీకి ఉపఎన్నిక జరిగితే 50 వేల ఓట్ల మెజారిటీకి తక్కువ లేకుండా బీఆర్ఎస్(BRS) గెలుస్తుందని చెప్పారు. ఒకవేళ తాను చెప్పినట్లుగా 50 వేల ఓట్ల మెజారిటీకి ఒక్కఓటు తక్కువ వచ్చినా తాను రాజకీయసన్యాసం తీసుకుంటానని చాలెంజ్ చేశారు. బీసీ కులగణన చేశామని, రైతురుణమాఫీ చేశామని, రైతుభరోసా నిధులు వేశామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ నిజంగానే అవన్నీ చేసుంటే కొడంగల్ ఎంఎల్ఏకి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో తిరిగిపోటీచేసి గెలవాలని చాలెంజ్ చేశారు.

14 నెలలపాలనలో రేవంత్ మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులకు చేసిందేమీ లేదని మండిపోయారు. తప్పుడుహామీలిచ్చి, ప్రజలను మోసంచేసి ఓట్లేయించుకున్న రేవంత్ కాంగ్రెస్ (Congress) ను అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రయ్యారని కేటీఆర్(KTR) ఎద్దేవాచేశారు. తనసోదరులకు, అల్లుడికి, బావమరుదులకు మేలుచేయటానికి మాత్రమే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ మండిపడ్డారు. కొడంగల్(Kodangal) నియోకవర్గంలోని లగచర్ల గ్రామంలోని రైతులపై రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైలులో ఉంచిందని దుయ్యబట్టారు. పచ్చనిపంటలు పండే భూములను రేవంత్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ సిటీ పేరుతో లాగేసుకునేందుకు ప్లాన్ చేసినట్లుగా కేటీఆర్ ఆరోపించారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రేవంత్ ముఖ్యమంత్రి అయినదగ్గర నుండి కేటీఆర్, హరీష్(Harish) చాలాసార్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు టైంటేబుల్ వేసుకున్నట్లుగా రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అగ్రనేతలిద్దరు పదేపదే ఆరోపణలతో రెచ్చిపోతునే ఉన్నారు. కాబట్టి రేవంత్ రాజీనామా కోసం కేటీఆర్ డిమాండ్ చేయటం కొత్తేమీకాదు. విచిత్రం ఏమిటంటే కొడంగల్ లో రేవంత్ రాజీనామా ఎందుకు చేస్తాడు ? కేటీఆర్ అడగ్గానే రేవంత్ రాజీనామా చేసేస్తాడా ? రేవంత్ ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత ఆకాశమంత ఎత్తున పెరిగిపోయింది నిజమే అయితే సిరిసిల్లలో తాను, సిద్ధిపేటలో హరీష్ రాజీనామా చేయచ్చుకదా. తమగెలుపుమీద తమకు అంతనమ్మకం ఉన్నపుడు, ప్రజల్లో రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోందని అనుకున్నపుడు కేటీఆర్, హరీష్ ఎందుకు రాజీనామా చేయకూడదు ?

రేవంత్ తో రాజీనామా చేయించటం వీళ్ళచేతుల్లో లేదు. అయితే తామిద్దరు రాజీనామాలు చేయటం కేటీఆర్, హరీష్ చేతుల్లోనే ఉంది. ఒకసారి కేసీఆర్ తో మాట్లాడి రాజీనామాలు చేసేస్తే ఉపఎన్నికలు రావటం ఖాయం. అప్పుడు ఎలాగూ రేవంత్ ప్రభుత్వంపైన జనాల్లో తీవ్రస్ధాయిలో వ్యతిరేకత ఉందికాబట్టి కచ్చితంగా కేటీఆర్, హరీషే గెలిస్తే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉందని నిరూపించినట్లవుతుంది. కేసీఆర్(KCR) మీద వ్యతిరేకతతో మాజీమంత్రి ఈటల రాజేందర్(Eatala Rajendar) రాజీనామా చేసి హుజూరాబాద్ లో ఉపఎన్నికలు తెప్పించి మళ్ళీపోటీచేసి గెలిచిన విషయం గుర్తుండే ఉంటుంది. బీఆర్ఎస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన ఈటల గెలిచి తనసత్తా ఏమిటో నిరూపించుకున్నారు.

ఇపుడు కేటీఆర్, హరీష్ కూడా అదేపద్దతిలో రాజీనామాలు చేసి ఉపఎన్నికలు వచ్చేట్లుచేసి, తిరిగిపోటీచేసి గెలిస్తే అప్పుడు నిజంగానే రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని నిరూపించినట్లవుతుంది. అప్పుడు జనాలు కూడా కేటీఆర్, హరీష్ చెప్పేది నిజమని నమ్మే అవకాశముంది. అంతేకాని ఊరికే రేవంత్ ను రాజీనామా చేయమని కేటీఆర్ అడగ్గానే ఎందుకు రాజీనామా చేస్తాడు ? పైగా బీఆర్ఎస్ మెజారిటి 50 వేలకు ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాననే పిచ్చి చాలెంజ్ మరోటి. ఉపఎన్నికలు వచ్చి రేవంతే గెలిచినా లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్ధి గెలిచి 50 వేల ఓట్ల మెజారిటీ రాకపోయినా అధికార దుర్వినియోగం జరిగిందని కేటీఆర్ గోలచేయటం ఖాయం. అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలతో రాజకీయసన్యాసం చాలెంజ్ ను పక్కన పెట్టేస్తారనటంలో ఎలాంటి సందేహంలేదు.

Tags:    

Similar News