మావోయిస్టుల షెల్టర్ జోన్ బద్ధలవబోతోందా ?

మావోయిస్టుల అగ్రనేతలను మట్టుపెట్టడమే ఏకైక టార్గెట్ గా ఇపుడు కర్రెగుట్టల అడవుల గాలింపు జరుగుతున్నట్లు అర్ధమైపోతోంది;

Update: 2025-04-25 08:06 GMT
Operation Kagar in Karreguttala Forest

మావోయిస్టులతో అమీతుమీ తేల్చుకోవాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు డిసైడ్ అయ్యాయి. అందుకనే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు భద్రతాదళాలు ఆరురాష్ట్రాల్లోని అడవులను జల్లెడపడుతున్నాయి. ఛత్తీస్ ఘడ్-తెలంగాణ(Telangana) సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల అడవుల(Karreguttala Forests)ను భద్రతాదళాలు రాత్రనక, పగలనక గాలిస్తున్నాయి. మావోయిస్టుల(Maoists)కోసం రాత్రుళ్ళు అడవుల్లో గాలింపుచర్యలు ఎప్పుడూ జరగలేదు. అలాంటిది గడచిన నాలుగురోజులుగా కర్రెగుట్టల్లోని అడవుల్లో భద్రతాదళాలు రాత్రిళ్ళు కూడా అణువణు గాలిస్తున్నాయి. మావోయిస్టుల అగ్రనేతలను మట్టుపెట్టడమే ఏకైక టార్గెట్ గా ఇపుడు కర్రెగుట్టల అడవుల గాలింపు జరుగుతున్నట్లు అర్ధమైపోతోంది. అందుకనే సుమారు 200 కిలోమీటర్లలో విస్తరించిన అడవులను గాలించేందుకు ఒకవైపు ఛత్తీస్ ఘడ్ మరోవైపు తెలంగాణ సరిహద్దులు, ఇంకోవైపు మహారాష్ట్ర నుండి వేలదిగా భద్రతాదళాలు అడవుల్లోకి చొచ్చుకు వచ్చేస్తున్నాయి.

మావోయిస్టుల గాలింపులో కోబ్రా, సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, బస్తర్ ఫైటర్స్, పోలీసుల్లో మెరికల్లాంటి వేలాదిమందిని ఎంపికచేసి ఆపరేషన్ కగార్ అనే కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మొదలుపెట్టాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, తెలంగాణ, ఏవోబీ ఏరియాల్లో ఆపరేషన్ కగార్(Operation Kagar) ముమ్మరంగా జరుగుతోంది. ఇపుడు కూంబింగ్ జరుగుతున్న కర్రెగుట్టల అడవుల్లో సుమారు 20 వేలమందితో గాలింపుచర్యలు జరుగుతున్నాయంటేనే ఆపరేషన్ కగార్ ఏ స్ధాయిలో జరగుతోందో అర్ధమైపోతోంది. ఒకవైపు అడవుల్లో వేలాదిమంది గాలింపుచర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఆకాశమార్గంలో హెలికాప్టర్లు, ద్రోన్లు, ఇంకోవైపు మందుపాతరలు, బాంబులను పసిగట్టేందుకు వందలాది పోలీసుకుక్కలు రంగంలోకి దిగాయి.

ఇంతకీ మావోయిస్టులున్నారా ?

మావోయిస్టులకు చాలాకాలంగా దట్టమైన కర్రెగుట్టలఅడవులు షెల్టర్ జోన్ గా ఉంది. సుమారు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలోని అడవుల అనుపానులు తెలిసినవారు మాత్రమే లోపలికి వెళ్ళి సురక్షితంగా తిరిగి బయటకు రాగలరు. అడవుల అనుపానులు తెలియనివారు తెలియకుండా లోపలకు ప్రవేశిస్తే బయటకువచ్చే దారితెలీక అవస్ధలు పడాల్సిందే. అందుకనే పోలీసులు కూడా కర్రెగుట్టల అడవులవైపు పెద్దగా దృష్టిపెట్టలేదు. అందుకనే అడవుల్లో నివసించే గిరిజనులు, అడవులను ఆనుకునుండే గ్రామాల్లోని గిరిజనులు కూడా మవోయిస్టులకు మద్దతుగా నిలబడేవారు. ఇలాంటి అడవుల్లోకి ఇపుడు సడెన్ గా భద్రతాదళాలు ఎలాగ ప్రవేశించాయి ? ఎలాగంటే మావోయిస్టుల అనాలోచిత చర్యలవల్లే వాళ్ళ ఉనికి బయటపడిందని చెప్పాలి. కొద్దిరోజుల క్రితం అడవుల్లోకి ఎవరూ ప్రవేశించేందుకు లేదని మావోయిస్టులు ఆదివాసీలపై ఆంక్షలు విధించారు. అడవుల్లో మందుపాతరలు, బాంబులు అమర్చాము కాబట్టి ఆదివాసీలు ఎవరూ రావద్దని చెప్పారు. ఎవరైనా తమఆదేశాలను ఉల్లంఘించి అడవుల్లోకి ప్రవేశించి మందుపాతరలు, బాంబుల వల్ల చనిపోతే తమ బాధ్యతలేదని హెచ్చరించారు.

తమను అడవుల్లోకి ప్రవేశించవద్దని హెచ్చరించటాన్ని జీర్ణించుకోలేని ఆదివాసీలు మావోయిస్టులపై తిరగబడ్డారు. మావోయిస్టులను నిలదీస్తు, వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరుతో గ్రామాల్లో పోస్టర్లు అంటించారు. మావోయిస్టుల హెచ్చరికలు, ఆదివాసుల వ్యతిరేకత పోలీసుల దృష్టికి చేరింది. దాంతో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి కర్రెగుట్టల అడవుల్లో అసలేం జరుగుతోంది అన్నవిషయమై సమాచార సేకరణలో పడ్డాయి. దాంతో విషయమంతా బోధపడింది. కర్రెగుట్టలఅడవుల్లో పెద్దఎత్తున మావోయిస్టులు సమావేశం అవుతున్నారన్న విషయం పోలీసులకు అర్ధమైపోయింది. ఇదేవిషయాన్ని లోకల్ పోలీసులు ఉన్నతాధికారులకు చేరవేశారు. అడవులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని జనాల కదలికలపై నిఘా మొదలైంది. పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టుల హెచ్చరికలు, ఆదివాసీల వ్యతిరేక పోస్టర్లను ఆపరేషన్ కగార్ లోకి కీలక అధికారులకు చేరవేశారు.

వెంటనే తెలంగాణ పోలీసుఉన్నతాధికారులు ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఒడిస్సాల్లోని పోలీసు ఉన్నతాధికారులను అప్రమత్తంచేశారు. అందరు కర్రెగుట్టల్లోని పరిస్ధితిని విశ్లేషించుకుని పెద్దసంఖ్యలో మావోయిస్టులు సమావేశమవుతున్న విషయాన్ని నిర్ధారించుకున్నారు. అందుకనే ఐదురాష్ట్రాల్లోని భద్రతాదళాలను ఛత్తీస్ ఘడ్-తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలఅడవులవైపు మళ్ళించారు. ఇపుడు పరిస్ధితి ఎలాగుందంటే కర్రెగుట్టల అడవులను భద్రతాదళాలు అన్నీవైపులా చుట్టుముట్టేశాయి. భూమిపైనే కాకుండా ఆకాశంలో నుండి కూడా మావోయిస్టుల కోసం గాలింపు జరుగుతోంది. భద్రతాదళాల అంచనా ప్రకారం సుమారు 1500 మంది మావోయిస్టులు సమావేశం అయ్యేందుకే కర్రెగుట్టల్లోకి చేరుకున్నారు. తమ సమావేశాలు, కదలికలు పోలీసులకు ఎక్కడ తెలుస్తాయో అన్న ఆలోచనతోనే ఆదివాసీలను అడవుల్లోకి ప్రవేశించవద్దని ముందుగా మావోయిస్టులు హెచ్చరించింది. అయితే తమ హెచ్చరికలపై ఆదివాసీలు తిరగబడతారని మావోయిస్టులు ఊహించినట్లులేదు.

ఆపరేషన్ కగర్ టార్గెట్ ఎవరు ?

ఆపరేషన్ కగార్ టార్గెట్ అంతా మావోయిస్టుల అగ్రనేతలే అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిలో కూడా ఐదురాష్ట్రాల్లోని పోలీసులకు కొరకరానికొయ్యగా తయారైన అగ్రనేత హిడ్మా(Maoist Leader Hidma)తో మరికొందరు అగ్రనేతలు సమావేశాలకు హాజరైనట్లు భద్రతాదళాలకు ఉప్పందింది. అందుకనే ఎట్టి పరిస్ధితుల్లోని హిడ్మాతో పాటు ఇతర అగ్రనేతలు ఎవరూ ఈసారి తప్పించుకునేందుకు లేదన్నట్లుగా భద్రతదళాలు అడవులను అన్నీవైపుల నుండి చుట్టుముట్టేశాయి. ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు చనిపోవటమో లేకపోతే ఆయుధాలను వదిలేసి లొంగిపోవటమో ఏదో ఒకటే జరగాలి కాని గతంలో లాగ తప్పించుకునేందుకు లేదని భద్రతదళాలు చాలా పట్టుదలగా ఉన్నాయి.

గతంలో ఆపరేషన్ కగార్ లో భాగంగా భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య చాలా ఎన్ కౌంటర్లు జరిగాయి. అయితే ఎన్నిసార్లు ఎన్ కౌంటర్లు జరిగినా హిడ్మా, దేవా లాంటి కొందరు అగ్రనేతలు తప్పించుకున్నారు. భద్రతాదళాల నుండి అగ్రనేతలు ఎలాగ తప్పించుకుంటున్నారన్నది మిస్టరీగా మారింది. అందుకనే ఈసారి లోకల్ పోలీసులను ఆపరేషన్ నుండి దూరంగా ఉంచి ఇతర రాష్ట్రాల పోలీసులు, భద్రతాదళాలతోనే అడవుల గాలింపు మొదలుపెట్టారు. అడవులబయట అన్నీవైపులా భద్రతాదళాలు కాపలాకాస్తుంటే, అడువుల్లో జల్లెడపట్టేందుకు వేలాదిమంది భద్రతాదళాలు రాత్రనక, పగలనక గాలిస్తున్నారు. వీళ్ళకు మద్దతుగా హెలికాప్టర్లు, ద్రోన్లు మావోయిస్టుల ఆచూకీ తెలుసుకోవటంలో బిజీగా ఉన్నాయి.

కర్రెగుట్టల అడవులే కేంద్రంగా నాలుగురోజులుగా ఇంతజరుగుతున్నా అధికారికంగా ఎవరూ నోరిప్పటంలేదు. అయితే అడవుల్లో ఏదో జరగుతోందని, ఇంకేదో జరగబోతోందనే విషయం మాత్రం అందరికీ అర్ధమైపోతోంది. ఎందుకంటే అడవులకు ఆనుకునుండే గ్రామాల్లోని జనాలను భద్రతాదళాలు, అటవీశాఖ ఉన్నతాధికారులు ఖాళీచేయించేస్తున్నారు. అడవులపైన హెలికాప్టర్లు, ద్రోన్లు నిరంతరం ఎగురుతునే ఉన్నాయి. అడవుల్లో బాంబుపేలుళ్ళ శబ్ధాలు వినబడుతున్నాయి. ఆగిఆగి తుపాకులు గర్జిస్తున్నాయి. బాంబుపేలుళ్ళు, తుపాకుల గర్జనల మోతతోనే అడవుల్లో ఏమో జరుగుతోందనే విషయం ఎవరూ చెప్పకపోయినా అర్ధమైపోతోంది.

అందుబాటులోని సమాచారం ప్రకారం మావోయిస్టుల సమావేశాల్లో పాల్గొనేందుకు 80 మంది అగ్రనేతలతో మొత్తం 1500 మంది హాజరైనట్లు తెలుస్తోంది. అయితే వీరిలో హిడ్మా ఉన్నాడా లేడా అనే విషయంలో క్లారిటీలేదు. ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది.

రహదారుల మూసివేత

ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, మహారాష్ట్రకు మధ్యలో ఉన్న కర్రెగుట్టల అడవుల్లోకి ప్రవేశించే గ్రామాల దారులన్నింటినీ భద్రతాదళాలు మూసేశాయి. రహదారులను మూసేసిన భద్రతాదళాలు అడవుల్లోకి కొద్దిరోజుల పాటు ఎవరూ ప్రవేశించవద్దని ఆంక్షలు విధించాయి. 200 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన అడవులు, గుట్టల్లో నాలుగురోజులుగా బాంబుల మోత, తుపాకుల గర్జనలు మారుమోగుతున్నాయి. దశాబ్దాలపాటు మావోయిస్టులకు కంచుకోటలుగా నిలిచిన అడవులు, అటవీగ్రామాల్లో భద్రతాదళాలు బేస్ క్యాంపులు ఏర్పాటుచేసుకుంటున్నాయి. అంటే మావోయిస్టుల సేఫ్ జోన్లు, షెల్టర్ జోన్లీ భద్రతాదళాల స్వాధీనం అవుతున్నట్లు అర్ధమవుతోంది.

పై రాష్ట్రాల కేంద్రంగా అటవీప్రాంతాల్లో భద్రతాదళాలు ఏర్పాటుచేసుకున్న బేస్ క్యాంపుల్లో హెలికాప్టర్లు, పెద్దఎత్తున అధునాతన ఆయుధాలు, మందుగుండు సామగ్రి పెట్టుకున్నారు. పైమూడు రాష్ట్రాల్లోని అటవీసరిహద్దు గ్రామాలు భీమారంపాడు, పూజారి కాంకేర్, పామేడు, ఊసూరు, చర్ల, వెంకటాపురం, వాజేడు గ్రామాల్లో భద్రతాదళాల అధికారులు రిజర్వు క్యాంపులను ఏర్పాటుచేసుకున్నారు.

గ్రామాలను ఖాళీచేస్తున్న గిరిజనులు

కర్రెగుట్టల అడవుల కేంద్రంగా మావోయిస్టులకు భద్రతాదళాలకు మధ్య ఏదో జరుగుతోందనే టెన్షన్ ఆదివాసీల్లో పెరిగిపోతోంది. వాళ్ళమధ్య ఆధిపత్యపోరాటంలో తాము ఎక్కడ నలిగిపోతామో అనే భయం ఆదివాసీల్లో పెరిగిపోతోంది. అందుకనే తెలంగాణ నుండి ఛత్తీస్ ఘడ్ లోకి ప్రవేశించే గ్రామాల్లోని గిరిజనులు తమ గ్రామాలను ఖాళీచేసి దూరంగా వెళిపోతున్నారు. ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని రాంపురం, భీమారం, చిన్న ఊట్ల, పెద్దఊట్ల, కస్తూరిపాడు, పూజారి కాంకేర్, గుంజపర్తి, నంబి, గల్ గావ్, నడుంపల్లి, ఊసూరు, అవుపల్లి గ్రామాల్లోని ఆదివాసీలు చాలావరకు తమ ఇళ్ళను ఖాళీచేసేశారు. గ్రామాల్లోనే ఉంటున్న కొందరు ఆదివాసీలు ఇళ్ళలో నుండి బయటకు రావటంలేదు. మొత్తానికి జరుగుతున్నది చూస్తుంటే కర్రెగుట్టల అడవుల్లో ఈసారి మావోయిస్టులకు భారీ నష్టం తప్పేట్లు లేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టే టార్గెట్ తోనే ఆపరేషన్ కగార్ వేట ముమ్మరంగా జరుగుతోంది. చివరకు ఏమి జరగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News