Tension in KTR|కేటీఆర్ లో టెన్షన్ పెరిగిపోతోందా ?

ఫార్ములా రేసులో అసలు అవినీతే జరగలేదని, రేవంత్ రెడ్డి(Revanth reddy) ప్రభుత్వం తనపైన కక్షసాధింపు చర్యలకు దిగుతోందని కొద్దిరోజులుగా చెప్పిందే చెబుతున్నారు.;

Update: 2025-01-01 11:13 GMT
KTR in Formula car race

ఏవ్యక్తయినా పదేపదే ఒకేవిషయాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే అనుమానించాల్సిందే. ఇపుడు విషయం ఏమిటంటే ఫార్ములా ఈ కార్ రేసు (Formula E Car Race)గురించే కేటీఆర్ ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఫార్ములా రేసులో అసలు అవినీతే జరగలేదని, రేవంత్ రెడ్డి(Revanth reddy) ప్రభుత్వం తనపైన కక్షసాధింపు చర్యలకు దిగుతోందని కొద్దిరోజులుగా ప్రతిరోజూ చెప్పిందే చెబుతున్నారు. ఫార్ములా కార్ రేసులో అక్రమాలు, అవినీతి జరిగిందని ప్రభుత్వం నమ్ముతోంది. అందుకు అన్నీ ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. అందుకనే ఏసీబీ కేసులు నమోదుచేసింది. ఇదేసమయంలో ఈడీ(ED Inquiry) కూడా రంగంలోకి దిగేసి కేసులు నమోదుచేయటమే కాకుండా విచారణకు తేదీలను కూడా ప్రకటించేసింది. కేటీఆర్(KTR) ఈనెల7వ తేదీన ఈడీ విచారణకు హాజరవ్వాల్సుంటుంది.

ఈ నేపధ్యంలోనే ఈరోజు మీడియాతో మాట్లాడుతు ఫార్ములా కార్ రేసు కేసులో హైకోర్టు(High Court) తీర్పు ఎలాగ వస్తుందో చూద్దామన్నారు. ఇందులో అసలు అవినీతే లేనపుడు ఇక కేసు ఎక్కడిది అని మీడియానే ఎదురు ప్రశ్నించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పన్నారు, ఈడీ కేసు ఉత్తదే అన్నారు, కేసే లేనపుడు ఇక విచారణ ఎందుకన్నారు. విచారణ విషయాన్ని తనలాయర్లు చూసుకుంటారని చెప్పారు. న్యాయస్ధానాలపై తనకు నమ్మకం ఉందని అంటూనే తనపైన నమోదుచేసిన కేసుల్లో పసలేదన్నారు. ఏదోరకంగా తనను జైలుకు పంపాలని రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఎద్దేవాచేశారు. ఫార్ములా కేసుపెట్టి అరెస్టుచేసి జైలుకు పంపాలన్న ప్రయత్నం ఆరోదని ఎగతాళిగా మాట్లాడారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసులో పసే లేనపుడు మీడియాతో ప్రతిరోజు ఫార్ములా కేసుగురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ? కేసుపైన ఎలాగూ హైకోర్టులో విచారణ జరగుతున్నది కదా. కోర్టులో విచారణ జరుగుతున్నపుడు తాను మాట్లాడకూడదని మౌనంగా ఉండచ్చు. అయితే ఆపని చేయకుండా పదేపదే ఫార్ములా కారు కేసులో అవినీతిలేదని ఎందుకు చెబుతున్నారో అర్ధంకావటంలేదు. తాను హైదరాబాదుకు ఖ్యాతి తీసుకొద్దామని అనుకుంటే రేవంత్ రెడ్డి నాశనం చేసినట్లు మండిపడ్డారు. క్యాబినెట్ అనుమతి లేకుండానే తాను ఫార్ములా రేసును హైదరాబాదుకు తీసుకొస్తే మరి క్యాబినెట్ అనుమతిలేకుండానే ఫార్ములా రేసును రద్దుచేసిన రేవంత్ మీద కూడా కేసుపెట్టాల్సిందే అని పిచ్చి లాజిక్ మాట్లాడారు. ప్రతిరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కేటీఆర్ లో టెన్షన్ పెరిగిపోతున్నట్లే అనుమానంగా ఉంది.

Tags:    

Similar News