‘రిగ్గింగ్ కూడా చేశా’.. జగ్గారెడ్డి ఇస్తున్న మెసేజ్ ఏంటి..

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి చేయాలనుకునే వారి కన్నా డబ్బులు ఉన్న వారికే టికెట్లు కట్టబెడుతుందా? చర్చకు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణం.

Update: 2024-10-13 07:11 GMT

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి చేయాలనుకునే వారి కన్నా డబ్బులు ఉన్న వారికే టికెట్లు కట్టబెడుతుందా? చర్చ తెలంగాణలో అధికమవుతోంది. ఇందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణం. సంగారెడ్డిలో నిర్వహించిన దసరా వేడుకల్లో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అదే విధంగా అసలు జగ్గారెడ్డి తన వ్యాఖ్యలతో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అని కూడా రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తోపులం అంటే ఏంటి? నలుగురికి న్యాయం చేయడం కోసం పోరాడటమా.. ఎవరినీ లెక్కచేకుండా తప్పైనా చేసేయడమా? దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నా. తాజాగా తాను రిగ్గింగ్ చేశానని, ఎస్పీ కారును ఢీ కొట్ట. ఎంత తోపులమైనా కాటికి వెళ్లాల్సిందే అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆయన తన వ్యాఖ్యలతో సమాజానికి గానీ, ఆయనను స్ఫూర్తిగా భావించే యువ నేతలకు గానీ, యువతకు గానీ ఏమని మెసేజ్ ఇస్తున్నారు.

శనివారం సంగారెడ్డిలో జరిగిన దసరా వెడుకల్లో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి అనే వ్యక్తి అదిరేటోడు, బెదిరేటోడు కాదని, ఒక ఫైటర్ అంటూ వ్యాఖ్యానించారు. మరి ఆయనను బెదిరించడానికి, అదిలించడానికి ఎవరు ప్రయత్నించారో మాత్రం చెప్పలేదు. ఈ సందర్భంగానే ఓటమి అనేది ప్రతి వ్యక్తికి అనేక పాఠాలు నేర్పుతుందని, తనకూ నేర్పిందని అన్నారాయన. ఎన్నికల్లో తాను ఓడినా.. తన భార్య నిర్మలమ్మకు కార్పొరేషన్ పదవి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. తాను ఓడిపోయానని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ దూరం పెట్టలేదని, తన భార్యను పలికి సీఎం రేవంత్ రెడ్డి తన కోటాలోనే పదవిని అందించారని చెప్పుకొచ్చారాయన. ఈ క్రమంలోనే ఏ పండగ వచ్చినా సంగారెడ్డిలో ఘనంగా కార్యక్రమాలు చేయడంలో తాను ముందుంటానని అన్నారు. తానూ ఎన్నో చేశానంటూ గతాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఆఖరికి ఎన్నికల్లో రిగ్గింగ్ కూడా చేసినట్లు చెప్పుకొచ్చారాయన.

ఎస్పీ కారును ఢీ కొట్టా..

‘‘1995లో మా మనుషులను కొట్టారన్న కోపంతో ఎస్పీ కృష్ణంరాజు కారును ఢీ కొట్టాను. 3వేల మందితో పోలీస్ స్టేషన్‌ను ముట్టడించాను. ఆ తర్వాత పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ కూడా చేశా. ఎంత తోపులం అయినా కాటికి పోక తప్పదు. పుట్టిన ప్రతి ప్రాణికి చావు అనివార్యం. ప్రాణికే చావు తప్ప పైసాకు కాదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నా భార్య నిర్మల కానీ, ఆంజనేయులు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం’’ ఉంది అని చెప్పుకొచ్చారు. ఆయన మాటలు అనేక అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతల కన్నా వారి దగ్గర ఉన్న డబ్బుకే అధిక ప్రాధాన్యం ఇస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేవలం వారి దగ్గర డబ్బు ఉంది కాబట్టే వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారా? అంటే ఎమ్మెల్యే టికెట్‌లను కాంగ్రెస్ అమ్ముకుంటుందే తప్ప ప్రజాసేవ చేయాలన్న నేతలకు అవకాశం కల్పించడం లేదా? అన్న చర్చ ప్రజల్లో కూడా మొదలైంది. అంతేకాకుండా గతేడాది జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇలానే ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకుని, ధన బలంతోనే గెలిచిందా? అన్న అనుమానాలు అధికమవుతున్నాయి. మరి తన వ్యాఖ్యల వెనక ఉన్న పరామార్థాన్ని రానున్న కాలంలో జగ్గారెడ్డి ఏమనా వివరిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News