‘కాంగ్రెస్‌లో చేరలే.. కలిసి పనిచేస్తున్నా’
డిప్యూటీ సీఎం పదవి నేను అడ్డుకోలేదు.. కేసీఆరే పిలిచి ఇచ్చారన్న కడియం శ్రీహరి.
స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం వేడెక్కుతోంది. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫిరాయింపుల అంశంలో కడియం శ్రీహరిపై రాజయ్య విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో చేరిన కడియం వెంటనే రాజీనామా చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో తామంతా ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నామని కడియం శ్రీహరి సహా ఫిరాయింపు నేతలు బొంకుతున్నారంటూ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ఆయన వ్యాఖ్యలకు కడియం శ్రీహరి తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, తనకూ బూతులు వచ్చంటూ హెచ్చరించారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్‌లో చేరలేదని, కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నాను మాత్రమేనని వెల్లడించారు.
వరంగల్‌లో కడియం శ్రీహరి ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాజయ్య విమర్శలు, ఆరోపణలపై స్పందించారు. స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని వివరించారాయన. ‘‘నియోజకవర్గ పరిధిలో రిజర్వాయర్లు ఉన్నా కాలువుల అసంపూర్తిగా ఉన్నాయి. చెట్లు, పూడిక పేరుకుపోయి అస్తవ్యస్థంగా ఉన్నాయి. దాని వల్ల చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. ఈ విషయాన్ని నేను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లా. కాలువల్లో పూడికలు తీసి స్లాబులు వేయాలని చెప్పాను. 2023 ఎన్నికల్లో తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాను. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని ప్రజలకు మాట ఇచ్చా. బీఆర్ఎస్ ఓటమితో నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించా. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని అనుకున్నా. అదే చేస్తున్నా’’ అని స్పష్టతనిచ్చారు.
రాజయ్య ఏమన్నారంటే..
పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించాయి. ‘‘సిగ్గుశరం, చీము నెత్తురు ఉంటే కడియం శ్రీహరి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. పౌరుషం ఉంటే వెంటనే రాజీనామా చేసి రా. రూ.200 కోట్లకు కడియం అమ్ముడుపోయారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోవడానికి కడియం భయపడుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఆ విషయాన్ని ఒప్పుకొని ముక్కు నేలకు రాసి కేసీఆర్ ని కలవాలి’’ అని అని రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పిలిచి నాకు పదవి ఇచ్చారు
రాజయ్యకు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బూతులు తనకు బాగా వచ్చన్నారు. ‘‘నేను పుట్టింది పల్లెటూర్లలోనే. పెరిగింది గుడెసెల్లోనే. బూతులు వింటూనే పెరిగా. నేర్చుకున్నా. నాకూడా చాలా మాటలు వచ్చు, బూతులు వచ్చు’’ అని కడియం అన్నారు. ‘‘డిప్యూటీ సీఎం పదవి కోసం నేనేమీ కేసీఆర్‌ను అడుక్కోలేదు. ఆయనే నన్ను పిలిచి నాకు ఆ పదవి ఇచ్చారు. నీ అనుభవం అవసరం, నీ తెలివి తేటలు అవసరం అడిగి ఢిల్లీ నుంచి పిలిపించుకుని డిప్యూటీ సీఎం చేశారు కేసీఆర్’’ అని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు.