Kaleswaram | ‘మింగిన ప్రతి రూపాయి కక్కిస్తాం’

కాళేశ్వరం అవకతవకల విషయంలో కేసీఆర్‌ను దోషిగా పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందన్న మహేష్ కుమార్.;

Update: 2025-08-02 12:41 GMT

కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleswaram Project) పేరుతో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందని తెలంగాణ కాంగ్రెస్(Congress) కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Mahesh kumar Goud) ఆరోపించారు. అధికారంలో ఉన్నాం కదా అని ప్రజాధనాన్ని ఆరగించేశారంటూ బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత పాలకులు మింగిన ప్రతి రూపాయిని కక్కించే బాధ్యత తమ ప్రభుత్వానిదని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ తన నివేదిక ఇచ్చిన క్రమంలోనే మహేష్ కుమార్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ రిపోర్ట్‌లో ఏముంది? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పుడు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అయితే ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేస్తుంది. నీటి పారుదల శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర మంత్రిమండలికి సమర్పించనుంది.

కేసీఆరే దోషి..!

‘‘కాళేశ్వరం కమిషన్ పేరుతో రూ.లక్షల కోట్లు వృథా చేసి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు. ఇది నేను అంటున్నదని కాదు.. పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పింది. ఇంజనీర్లు చెప్తున్నా వినిపించుకోకుండా కేసీఆర్ తన స్వలాభం కోసమే ఆలోచించారు. దానికోసమే పనిచేశారు.. నిర్ణయాలు తీసుకున్నారు. తనకు నచ్చిన ప్రదేశంలోనే కాళేశ్వరం కట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రాజెక్ట్‌లో రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రెండు పిల్లర్లు కుంగడం అంటే సామాన్యమైన విషయమా? మరోవైపు ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ భారీ అవినీతి చేయలేదా? ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్లు ప్రతిపైసా కక్కాల్సిందే.. తప్పదు.. కక్కిస్తాం’’ అని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం కమిషన్‌లో ఏముంది..?

అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయా? లేదా? అన్న అంశంపై పీసీ ఘోష్ కమిషన్ దాదాపు ఏడాదిన్నర పాటు విచారణ జరిపింది. జులై 31తో కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో అదే రోజున తన నివేదికను కమిషన్.. ప్రభుత్వానికి అందించింది. అప్పటి నుంచి అసలు ఈ నివేదికలో ఏముంది? అనేది కీలకంగా మారింది. ఇంతలోనే నివేదికలో ఉన్నది ఇదే అని కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. ప్రభుత్వవర్గాల నుండి లీకైన సమాచారం ప్రకారం రిపోర్టులో జస్టిస్ ఘోఫ్(Justice PC Ghosh) ప్రాజెక్టు, బ్యారేజీల్లో జరిగిన అవినీతి, అవకతవకలకు కేసీఆరే కారణమని స్పష్టంచేశారు. వ్యక్తుల ఇష్టం ప్రకారమే కాళేశ్వరం పనులు జరిగాయని తేల్చిచెప్పినట్లు చెప్పారు.

అవినీతే కాకుండా ఆర్ధిక అవకతవకలు కూడా చాలానే జరిగాయని చెప్పిన జస్టిస్ అందుకు బాధ్యులు ఎవరన్న విషయాన్ని పేర్లతో సహా ప్రస్తావించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంటూ ప్రాజెక్టు, బ్యారేజీ పనులను పర్యవేక్షించిన ఐఏఎస్ అధికారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ప్రాజెక్టులు, బ్యారేజీల అంచనాలు మార్చటం, నిర్మాణస్ధలం మార్పు తదితరాలకు ఎవరు బాధ్యులు అన్న విషయాన్ని కూడా ఘోష్ చెప్పినట్లు తెలిసింది. మంత్రివర్గ నిర్ణయం లేకుండానే బ్యారేజీల నిర్మాణం చేపట్టారని, ముందు నిర్ణయాలు తీసుకుని తర్వాత మంత్రివర్గ సమావేశంలో రాటిఫై చేయించుకున్నట్లు జస్టిస్ స్పష్టంగా చెప్పరని సమాచారం.

Tags:    

Similar News