Kaleswaram | ఫామ్ హౌస్‌లో కేసీఆర్ యాగం.. క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్

కాళేశ్వరం అవకతవకలు అక్రమాలకు ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని ఘోష్ నివేదిక ప్రస్తావించిందన్న ఉత్తమ్.;

Update: 2025-08-04 12:26 GMT

‘ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చండీయాగం చేయడానికే ఈ పూజలు చేస్తున్నారు’’ తెలంగాణ రాష్ట్రమంతటా తీవ్ర చర్చలకు దారితీశాయి ఈ వార్తలు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను అందించింది. దీనిపై సోమవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తున్న క్రమంలో మరోవైపు కేసీఆర్ యాగం చేస్తున్నారన్న వార్తలు కార్చిచ్చులా అంటుకున్నాయి. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం ఏ దారీ దొరక్క.. కేసీఆర్.. దేవుడిపైనే భారం వేశారని కొందరు విమర్శలు కూడా గుప్పించారు. కాగా ఈ వార్తలపై బీఆర్ఎస్ పార్టీ స్పష్టత ఇచ్చింది. ప్రత్యేక పూజల వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ వివరించింది. ఫేక్ న్యూస్ ఖండన పేరుతో బీఆర్ఎస్ సోషల్ మీడియా సెల్ పోస్ట్ పెట్టింది.

అన్నీ అబద్ధాలే: బీఆర్ఎస్

‘‘బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు.. ఎర్రవెల్లిలోని తన నివాసంలో చండీ యాగం నిర్వహిస్తున్నారని జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ కార్యాలయం నుంచీ గానీ, బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల నుంచీ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినా కూడా, కనీస సమాచారం తెలుసుకోకుండా, వాస్తవాలను నిర్ధారించుకోకుండా, తమ ఇష్టం వచ్చినట్లుగా ఫామ్‌హౌస్‌లో చండీయాగం అంటూ ప్రముఖ ఛానెళ్లు, పత్రికలు ఈ దుష్ప్రచారాన్ని కొనసాగించడం బాధ్యతారాహిత్యం. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కొనసాగిస్తున్న ఇటువంటి అవాస్తవాలను, అసత్యాలను వార్తల పేరుతో చేసే దుష్ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలి. తమ తమ ఛానెళ్ల నుంచి ఈ వార్తలను తొలగించాలని అన్ని పత్రికలు, ఛానెళ్ల యాజమాన్యాలను, ఎడిటర్లను కోరుతున్నాం’’ బీఆర్ఎస్ ఐటీ సెల్ తన పోస్ట్‌లో పేర్కొంది.

కేసీఆరే బాధ్యుడు: ఉత్తమ్

ఇదిలా ఉంటే మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్‌ రిపోర్ట్‌పై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కమిషన్ రిపోర్ట్‌ను మంత్రివర్గం ముందుంచారు. నివేదిక సారాంశాన్ని అర్థమయ్యేలా వివరించారు. ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజ్‌ల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజ్ ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వరకు జరిగిన అవకతవకలు అక్రమాలకు ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని ఘోష్ నివేదిక ప్రస్తావించింది. కెసిఆర్ తో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావును బాధ్యునిగా కమిషన్ తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దని సూచించిన నిపుణుల కమిటీ నివేదికను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టారని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ తేల్చి చెప్పింది’’ అని ఉత్తమ్ వివరించారు.

Tags:    

Similar News