చిన్న లాజిక్ మిస్సయిన కవిత

లేఖను సంతోష్ లీక్ చేశారుసరే, అసలు తనలేఖ కేసీఆర్ కు చేరిందా ? తండ్రి చదివారా ? అన్న విషయంలో క్లారిటిలేదు;

Update: 2025-09-04 07:46 GMT
KCR, Kavitha and Santosh

బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత చిన్న లాజిక్ మిసైనట్లున్నారు. ఎంతసేపు తాను తండ్రి కేసీఆర్(KCR) కు రాసిన లేఖ ఎలాగ లీకైందని మాత్రమే అడుగుతున్నారు ? లీక్ లీకవ్వటంపై కేసీఆర్ విచారణ జరిపించాలని చాలాసార్లు డిమాండ్ చేశారు. గడచిన మూడునెలలుగా ఇదే ప్రశ్నను పలు వేదికలమీద అడిగిన కవిత(Kavitha) బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతు తాను రాసిన లేఖను లీక్ చేసింది రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్(Santosh)అని చెప్పి సంచలనం సృష్టించారు. ఇక్కడే కవిత లాజిక్ మిస్సయ్యారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తాను రాసిన లేఖను సంతోష్ లీక్ చేశారుసరే, అసలు తనలేఖ కేసీఆర్ కు చేరిందా ? తండ్రి చదివారా అన్న విషయంలో క్లారిటిలేదు. తానురాసిన లేఖ తండ్రికి చేరిందని, చదివారని ఎక్కడా ఇప్పటివరకు చెప్పలేదు. తండ్రికి కవిత లేఖ రాయటం వరకు ఓకే. కాని ఆ లేఖ కేసీఆర్ కు చేరిందని, తండ్రి చదివారని కవితకు గ్యారెంటీ ఏమిటి ? కవిత రాసిన లేఖ డైరెక్టుగా కేసీఆర్ చేతికి అందదు కదా. ఫామ్ హౌస్ లో కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది, సెక్యురిటి తీసుకుని ఉంటారు. వీళ్ళు కూడా కాకపోతే కేటీఆర్, సంతోష్ లేకపోతే హరీష్ ఇలా..ఎవరో ఒకరికి లేఖ ముందు అందుంటుంది. ఆ తర్వాత కేసీఆర్ కు చేరుండాలి(?). కవిత రాసిన లేఖ ఫామ్ హౌసులో ముందు అందుకున్నది ఎవరు ? అన్నది తేలాలి. లేఖను అందుకున్న వాళ్ళు దాన్ని నేరుగా కేసీఆర్ కు చేర్చారా ? లేకపోతే ఇంకెవరికైనా అందించారా అన్నది తెలీదు.

కవిత ఆలోచించాల్సిన పాయింట్లు మూడున్నాయి. తాను రాసిన లేఖ తండ్రికి చేరిందా ? అందిన లేఖను కేసీఆర్ చదివారా ? అన్నది కీలకం. ఇక మూడోపాయింట్ ఏమిటంటే కేసీఆర్ చదివిన తర్వాత లేఖ లీకయ్యిందా ? లేకపోతే అసలు చదవకుండానే లేఖ లీకయ్యిందా ? ఇదీకాకపోతే తాను లేఖ రాసిన విషయం అసలు కేసీఆర్ కు తెలుసా ? చివరి రెండు ప్రశ్నలను పక్కనపెట్టేస్తే మొదటి ప్రశ్న ప్రకారం కేసీఆర్ చదివిన తర్వాతే లేఖ లీకయ్యుంటే ? అప్పుడు సంతోష్ ను కాదు కవిత ఎవరిని తప్పుపట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే లీఖ లీకవ్వటం కేసీఆర్ అనుమతితోనే జరిగిందని అనుకోవాల్సుంటుంది. కూతురు తనకు రాసిన లేఖను కేసీఆర్ తనదగ్గరే పెట్టుకుంటారు కాని ఎవరికంటే వాళ్ళకిస్తారని అనుకునేందుకు లేదు. కవిత రాసిన లేఖను కేసీఆర్ చదివుంటే తర్వాత దాన్ని కొడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి కేటీఆర్ కు ఇచ్చే అవకాశాలున్నాయి.

కేసీఆర్ కు కవిత రాసిన లేఖ అసలు సంతోష్ చేతిలోకి ఎలాచేరింది ? అన్నదే కీలకమైన ప్రశ్న. సంతోష్ కు లేఖను ఇస్తే కేసీఆర్ లేదా కేటీఆర్ ఇచ్చుంటారు. ఈరెండింటిలో ఏది జరిగినా సంతోష్ ను కవిత టార్గెట్ చేయటంలో అర్ధమేలేదు. తండ్రి లేదా సోదరుడే లేఖను సంతోష్ కు అందించి లీక్ చేయించారంటే అర్ధమేంటి ? కవితను పార్టీనుండి దూరంగా పెట్టేందుకు ఫామ్ హౌస్ సాక్ష్యంగా చాలాకాలంగా పెద్ద వ్యూహమే రచించారని అర్ధంచేసుకోవాలి. లేఖ లీకవ్వటంపై కవిత పెద్ద గోలచేస్తుందని తెలిసి, చేయాలని ప్లాన్ చేసే లేఖను లీక్ చేసుండాలి. సంతోష్ ను ఎవరో పావుగా వాడుకుని కవితను దెబ్బకొట్టారని అర్ధమవుతోంది. ఆ వ్యూహంలో కవిత తెలిసో తెలీకుండానో చిక్కుకుని పెద్ద రాద్ధాంతం చేశారు. దాని ఫలితమే తాజా సస్పెన్షన్.

కవిత ఆరోపణల వేడి ఎన్నిరోజులుంటుంది ?

పార్టీలో ఉండి సహచర నేతలపై ఆరోపణలు చేయటానికి, పార్టీనుండి సస్పెండ్ అయిన తర్వాత ఆరోపణలు చేయటానికి చాలా తేడా ఉంటుంది. పార్టీలో ఉంటూ సహచర నేతలపై ఆరోపణలు చేస్తే ఉండే విలువ పార్టీ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఉండదు. నాలుగురోజులు తనఅవసరాల కోసం మీడియా కవిత ఆరోపణలను హైలైట్ చేస్తుంది తర్వాత పక్కన పడేసి కొత్త అంశంకోసం వెతుక్కుంటుంది. నేతలు, క్యాడర్ కూడా దాదాపు ఇలాగే ఉంటారు. ఎందుకంటే అందరికీ తెలిసిన సత్యం ఏమిటంటే మైనస్ కేసీఆర్, కవిత జీరో అని. సొంతంగా పార్టీ పెట్టుకుని బలోపేతంచేసి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగటం అంటే చిన్న విషయం కాదు.

కవిత తన కెపాసిటి నిరూపించుకునేందుకు తొందరలోనే స్ధానికసంస్ధల ఎన్నికలే పెద్ద పరీక్షగా నిలబోతున్నాయి. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీకి తాము సిద్ధంగా లేమని కవిత చెబితే అదే పెద్ద మైనస్ అవుతుంది. ఒకవేళ జాగృతి తరపున పోటీ పెట్టి అభ్యర్ధులను గెలిపించుకోలేకపోతే అది కూడా మైనస్సే అవుతుంది.

ఎంఎల్సీగా పోటీచేస్తారా ?

బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎంఎల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. శాసనమండలి రాజీనామాను ఆమోదించటమే తరువాయి. రాజీనామాను ఆమోదిస్తే ఆరుమాసాల లోపు మళ్ళీ ఎన్నిక జరగాల్సుంటుంది. నిజామాబాద్ జిల్లా స్ధానిక సంస్ధల కోటాలో 2022లో కవిత ఎంఎల్సీగా గెలిచారు. కవిత రాజీనామ చేసిన ఎంఎల్సీ స్ధానంకు షెడ్యూల్ ప్రకారం ఇంకా మూడున్నర ఏళ్ళ పదవీకాలముంది. బహుశా ఈడిసెంబర్లోగా ఎన్నికలు జరిగే అవకాశముంది. మరపుడు కవిత తిరిగి ఎన్నికల్లో పోటీచేస్తారా ? అన్నది కీలకంగా మారింది. పోటీచేస్తే ఎన్ని ఓట్లు వస్తాయన్నది కవిత కెపాసిటిని తెలుపుతుంది. ఈ ప్రశ్నలకు కవిత ప్రకటించబోయే కార్యాచరణ సమాధానం ఇస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News