క్రైసిస్ లో బీఆర్ఎస్ కవిత

కవిత మామూలు నేత అయ్యుంటే అసలు మాట్లాడుకునే అవసరమే లేదు;

Update: 2025-05-15 08:18 GMT
Kalvakuntla Kavitha

బీఆర్ఎస్ నేత, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత ఐడెంటిటి క్రైసిస్ తో ఇబ్బందిపడుతున్నట్లున్నారు. కవిత మామూలు నేత అయ్యుంటే అసలు మాట్లాడుకునే అవసరమే లేదు. ఎందుకంటే ఎంతోమంది నేతలు పార్టీ జెండాలుమోసినా, బ్యానర్లు కట్టినా, బట్టలుచించుకుని పార్టీకోసం ఎంతకష్టపడినా అధినేతలు పట్టించుకోరు. కాని కవిత(Kavitha) విషయం అలాకాదు. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు కవిత చక్రంతిప్పారు. కవిత సింపులుగా కవితమాత్రమే కాదు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారాలపట్టి కూడా. ఇంతటి ఘనమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్న తనకు పార్టీలో ఒక్కసారిగా ప్రధాన్యత తగ్గిపోయినట్లుగా ఫీలవుతున్నట్లున్నారు. దీనికంతటికి కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో ఇరుక్కోవటమే. తీహార్ జైలులో ఆరుమాసాలున్న తర్వాత అతికష్టమీద బెయిల్ తీసుకుని కవిత ఇపుడు బయట తిరుగుతున్నారు. బెయిల్ ఎప్పుడు రద్దయినా మళ్ళీ జైలుకు వెళ్ళక తప్పదు.

ఒకపుడు అన్న, మాజమంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తో సమానంగా గుర్తింపుకలిగి, ప్రభుత్వంలో ఆడింది ఆటగా సాగించుకున్న కవిత గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. దాంతో పార్టీలో కవిత మాట ఇఫుడు పెద్దగా చెల్లుబాటుకావటంలేదనే ప్రచారం జరుగుతోంది. అందుకనే పార్టీనేతగా కాకుండా జాగృతిసంస్ధ అధ్యక్షురాలిగా వ్యవహారాలు నడుపుతున్నారు. పార్టీతో సంబంధాలు తెంపుకునే ఉద్దేశ్యంలేకపోయినా కార్యక్రమాలన్నీ జాగృతి అధ్యక్షురాలిగానే నడుపుతున్నారు, నియోజకవర్గాలుతిరుగుతున్నారు, జిల్లాల్లోని నేతలతో సమావేశమవుతున్నారు. ఎన్నిచేసినా, ఎంతమంది నేతలను కలిసినా అదంతా జాగృతి పరిధిలోనే జరుగుతోంది.

కవితలో ఒకవిషయంలో అసంతృప్తి బాగా పెరిగిపోతోంది. అదేమిటంటే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున తనకు పార్టీ మద్దతుగా నిలబడలేదని. ప్రతిపక్ష బీజేపీ, మంత్రులు, అధికార కాంగ్రెస్ నేతలు తనను లిక్కర్ రాణి అని, సారా వ్యాపారంలో ముడుపులు తీసుకున్నారని పదేపదే ఆరోపణలుచేస్తున్నా పార్టీతరపున కౌంటర్ రాలేదన్నది కవిత అసంతృప్తికి కారణం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సారా వ్యాపారంలో సౌత్ గ్రూప్ తరపున కవిత పాత్రే కీలకం అన్న విషయాన్ని సీబీఐ, ఈడీలు రౌస్ ఎవిన్యు కోర్టులో సాక్ష్యాలతో సహా నిరూపించారు. దర్యాప్తు సంస్ధలు దాఖలుచేసిన ఛార్జిషీట్లలో చాలాచోట్ల కవిత ముడుపులు తీసుకున్నారనేందుకు సాక్ష్యాలను చూపించాయి. దర్యాప్తుసంస్ధలు చూపించిన సాక్ష్యాలతో కన్వీన్స్ అయిన తర్వాతే కోర్టు కవితను కస్టడీలోకి తీసుకోమని చెప్పి తీహార్ కు పంపించింది. అలాగే బెయిల్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇవ్వని కారణం కూడా అదే. బెయిలిస్తే సాక్ష్యాలను కవిత తారుమారుచేస్తారన్న దర్యాప్తుసంస్ధల వాదనతో కోర్టు ఏకీభవించింది కాబట్టి చాలాసార్లు బెయిల్ నిరాకరించింది.

సారా వ్యాపారంలో ముడుపులు తీసుకున్నారన్న ఆధారాలు ఇంతస్పష్టంగా కనబడిన తర్వాత బీఆర్ఎస్(BRS) నేతలు ఏ విధంగా కవితను వెనకేసుకుని వచ్చి మాట్లాడగలరు ? సారా వ్యాపారంలో కవిత ముడుపుల వ్యవహారంలో తండ్రి కేసీఆర్(KCR) కూడా ఇప్పటివరకు ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం గమనార్హం. సోదరుడు కేటీఆర్, హరీష్ రెండు, మూడుసార్లు తీహార్ జైలులో కవితను కలిసి ధైర్యంచెప్పారంతే. తండ్రి, సోదరుడే కవితకు మద్దతుగా మాట్లాడనపుడు ఇక సీనియర్ నేతలు మాత్రం ఏమి మాట్లాడగలరు ? అందుకనే బీజేపీనేతలు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు కవితను టార్గెట్ చేస్తున్నా పార్టీ నేతలు మాట్లాడటంలేదు. ఈ కారణంగానే బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణలను కవిత తట్టుకోలేకపోతున్నారు.

అందుకనే ఈమధ్య మీడియాతో మాట్లాడుతు ఆరుమాసాలు జైలులో ఉన్నా ఇంకా కష్టపెడతారా ? అంటు బేలమాటలు మాట్లాడారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి పార్టీ స్పందిస్తుంది అని కవిత చెప్పినా పార్టీ తరపున ఎవరూ స్పందించటంలేదు. ఈ విషయంలోనే కవితకు పార్టీపై అసంతృప్తి పెరిగిపోతోంది. 6 మాసాలు జైలులో ఉన్నది సరిపోదా ? ఇంకా తనపై ఆరోపణలు చేసి కష్టపెడతారా ? అని అడగటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణకోసం పోరాటంచేసి కవిత జైలుకు వెళ్ళలేదు. కేసీఆర్ కూతురు హోదాలో సారావ్యాపారంలో జోక్యంచేసుకుని ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో జైలుకువెళ్ళారు.

కేసీఆర్ మీద అసంతృప్తేనా ?

తాను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నట్లు కవిత చెప్పారు. 47 నియోజకవర్గాల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే సామాజిక తెలంగాణ ఏర్పడలేదని తాను చెప్పినట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పడినా సామాజిక తెలంగాణా రాలేదంటే అందుకు తన తండ్రి కేసీఆరే కారణమని కవిత చెప్పకనే చెప్పారు. తాను చెప్పిన మాటలతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను డైరెక్ట్ ఎటాక్ చేస్తారని తెలిసే కవిత కావాలనే సామాజిక తెలంగాణ రాలేదని చెప్పారు. కవిత ఊహించినట్లుగానే మంత్రులు, కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ నేతలు కేసీఆర్ ను ఎటాక్ చేశాయి. జరిగింది చూస్తుంటే కేసీఆర్ మీద కూడా కవితలో అసంతృప్తి పెరిగిపోతోందన్న విషయం అర్ధమైపోతోంది.

కేటీఆర్ కే టాప్ ప్రయారిటి

పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఇద్దరిలో పార్టీనేతలు కేటీఆర్ కే టాప్ ప్రయారిటి ఇస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ తరపున నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టే పార్టీ మొత్తం కేటీఆర్ నే భవిష్యత్ అధినేతగా చూస్తున్నారు. ప్రాంతీయ పార్టీలంటేనే అధినేతల కుటుంబ ఆస్తులు అనటంలో సందేహంలేదు. ఆస్తులకు కొడుకులు ఎలాగ వారసులు అవుతారో పార్టీలకు కూడా సహజంగానే అధినేతల తర్వాత వాళ్ళ కొడుకులకే పగ్గాలు దక్కుతాయి. బహుశా ఈవిషయంలోనే తండ్రితో కవిత విభేదించినట్లు అనుమానంగా ఉంది. అందుకనే పార్టీతో కవిత అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు.

సామాజిక తెలంగాణ డిమాండ్

బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గరనుండి కవిత పదేపదే సామాజికతెలంగాణ అంటున్నారు. కవిత చెబుతున్న సామాజికతెలంగాణ అంటే ఏమిటో తెలీటంలేదు. తెలంగాణలో బీసీల జనాభా 50 శాతంకన్నా అధికంగా ఉన్నారు కాబట్టి పార్టీపగ్గాలను బీసీలకు ఇవ్వాలని ఇన్ డైరెక్టుగా కవిత డిమాండ్ చేస్తున్నారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలకు తగ్గట్లుగానే కవిత బీసీనేతలు, బీసీలసంఘాలతో ప్రత్యేకించి సమావేశమవుతున్నారు. అధికారంలో ఉన్నపుడు ఎప్పుడూ మాట్లాడని కవిత జ్యోతిరావుపూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ అమలుచేయాలని పదేపదే డిమాండ్లు చేస్తున్నారు. బీసీ సమస్యలు మాట్లాడేందుకు, సమస్యల పరిష్కారాలపై పోరాటాలుచేసేందుకు బీసీ సంఘాల నేతలున్నప్పటికీ కవితే బీసీ ఇష్యూస్ టేకప్ ఎందుకు చేస్తున్నారన్న విషయమై పార్టీలో చర్చలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్ బీసీల సమస్యలపై కవిత మాట్లాడినట్లుగా మాట్లాడటంలేదు.

సామాజిక తెలంగాణ అంటే ?

సామాజిక తెలంగాణ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలను భాగస్వాములను చేయటమే అని బీసీ సమస్యల పరిష్కారంపై పోరాటంచేస్తున్న కీలక నేత చెప్పారు. పోస్టుల్లో అత్యధికం కొన్ని కులాలే ఎంజాయ్ చేస్తున్నాయన్నారు. కాబట్టి పోస్టులను తాడిత, పీడిత కులాలకు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయింపులు సక్రమంగా జరగాలని చెప్పారు. ఆర్ధిక స్వావలంభన, రాజకీయ గుర్తింపు దక్కినపుడే సామాజికతెలంగాణ సాధ్యమవుతుందని సదరు నేత చెప్పారు.

కవిత సొంతపార్టీ పెడతారా ?

కాంగ్రెస్ పార్టీ((Telangana Congress) మీడియా కమిటి ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు కవిత తొందరలోనే పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరగటాన్ని కవిత జీర్ణించుకోలేకపోతున్నట్లు రెడ్డి చెప్పారు. బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలపిన విషయంలోనే కవితలో అసంతృప్తి పేరుకుపోతోందన్న విషయాన్ని సామా వివరించారు. కేసీఆర్, కేటీఆర్ మీద కవితలో అసంతృప్తి పెరిగిపోతున్నట్లు సామా చెప్పారు. తనలోని అసంతృప్తిని కేసీఆర్ కు రాసిన లేఖల్లో ప్రస్తావించినట్లు సామా వెల్లడించారు. పార్టీలో అన్నా, చెల్లెళ్ళ మధ్య ఆధిపత్యపోరు తారస్ధాయికి చేరుకున్నట్లు రామ్మోహన్ రెడ్డి బయటపెట్టారు. ఏదేమైనా పార్టీ పెట్టేంత స్టామినా కవితకు లేకపోవచ్చు కాని రాజకీయాల్లో ఏ నిముషంలో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కదా. చివరకు కవిత ఏమిచేస్తారో చూడాలి.

Tags:    

Similar News