జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీద కెసిఆర్ ఎదురు దాడి

విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే , పరిగణనలోకి తీసుకోకుండానే పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి , పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తారా?

Update: 2024-06-15 06:56 GMT
KCR and Justice Narasimhareddy

కేసీయార్ హయాంలో విద్యుత్ రంగంలో జరిగినట్లుగా వినబడుతున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. అనేక ఆరోపణలను ప్రస్తావించిన కమీషన్ కేసీయార్ కు ఒక లేఖరాసింది. ఆ లేఖకు సమాధానాన్ని జూన్ 15వ తేదీలోగా పంపాలని ఆదేశించింది. లేఖకు సమాధానాన్ని పంపటానికి జూలై 30వ తేదీవరకు గడువు కావాలని కేసీయార్ అడిగినా కమీషన్ ఇవ్వలేదు. దాంతో కమీషన్ లేఖకు కేసీయార్ సమాధానం ఇస్తారా ఇవ్వరా అనే ఉత్కంఠ పెరిగిపోతోంది.


ఈ నేపధ్యంలో కేసీయార్ కమీషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో జస్టిస్ తో పాటు ఎవరూ ఊహించని రీతిలో కేసీయార్ ఘాటుగా స్పందించారు. లేఖమొత్తంమీద కేసీయార్ చెప్పిందేమిటంటే జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు పనికిరారని. ఎందుకంటే ‘జస్టిస్ మైండ్ సెట్ ను చూసిన తర్వాత తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టాలని నరసింహారెడ్డి ప్రీ డిటైర్ మైండ్ తో ఉన్న’ట్లు కేసీయార్ కు అర్ధమైందట.

అందువల్లే నరసింహారెడ్డి విచారణ బాధ్యతల్లో ఉండటం ఎంతమాత్రం సమంజసంకాదని కేసీయార్ భావించారు. కాబట్టి ‘కమీషన్ ఛైర్మన్ బాధ్యతల్లో నుండి మీ అంతట మీరుగా స్వచ్చంధంగా పక్కకు తప్పుకోవాల’ని కేసీయార్ డిమాండ్ చేశారు. ‘యాద్రాద్రి పవర్ ప్లాంట్ పనులు జరుగుతన్నా కూడా ఏమీ జరగటంలేదన్నట్లుగా ఛైర్మన్ మాట్లాడటా’న్ని కేసీయార్ తప్పుపట్టారు. అలా మాట్లాడటాన్ని ఛైర్మన్ పరిధిదాటి మాట్లాడటంగానే కేసీయార్ గుర్తుచేశారు.


గత ప్రభుత్వాన్ని బద్నాంచేయలన్న ఉద్దేశ్యమే ఛైర్మన్ మాటల్లో కేసీయార్ కు కనబడింది. అందుకనే ‘కమీషన్ ఛైర్మన్ బాధ్యతల్లో ఉండటం నరసింహారెడ్డికి సమంజసంకాద’ని కేసీయార్ డిసైడ్ చేశారు. ‘రాజకీయకక్షతో తనను, తన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమీషన్ వేసి’నట్లు కేసీయార్ మండిపోయారు.

‘24 గంటల విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వంచేసిన కృషిని తక్కువచేసి చూపించటమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దానికి వత్తాసుగా మీడియా సమావేశం పెట్టి కమీషన్ ఛైర్మన్ గా మీరు కూడా అదే పద్దతిలో మాట్లాడటం తనకెంతో బాధ కలిగించింద’ని కేసీయార్ చెప్పారు. ‘ఆరోపణలపై విచారణ జరిపి నిజాన్ని నిగ్గుతేల్చి సరైన రిపోర్టును ప్రభుత్వానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యతగా కమీషన్ వ్యవహరించటంలేద’ని కేసీయార్ ఆక్షేపించారు.


జ‘మధ్యవర్తిగా నిలిచి సరైన తీర్పు ఇచ్చేట్లుగా కమీషన్ వ్యవహారశైలి లేద’ని నరసింహారెడ్డి తీరును కేసీయార్ తప్పుపట్టారు. ‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనా మీ తీరు మాత్రం సహజన్యాయసూత్రాలకు భిన్నంగా ఉంద’ని కేసీయార్ ఆరోపించారు. విచారణ మొదలుకాకముందే తీర్పు చెప్పినట్లుగా జస్టిస్ వైఖరి ఉందని కేసీయార్ ఆక్షేపించారు. కాబట్టి ‘ఈ దశలో కమీషన్ ముందు తాను హాజరై ఏమి చెప్పినా ఉపయోగం ఉండదని అర్ధమైపోయింద’ని కేసీయార్ చెప్పారు. ‘పైన పేర్కొన్న అన్నీ విషయాలను పరిగణలోకి తీసుకుని మీరు ఎంక్వయిరీ కమీషన్ బాధ్యతల నుండి స్వచ్చంధంగా వైదొలగాల’ని కేసీయార్ డిమాండ్ చేశారు. 12 పేజీల లేఖ మొత్తం మీద కేసీయార్ చెప్పిందేమిటంటే విచారణకు తాను హాజరుకానని ఏమి చేసుకుంటారో చేసుకోండన్న అర్ధమే వస్తోంది అందరికీ. మరి కేసీయార్ తాజా లేఖ నేపధ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి కమీషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News