తెలంగాణ లో ఏం జరుగుతున్నదో ప్రజలు జాగ్రత్తగా గమనించాలి

తమను ఓడించి ప్రజలు తప్పు చేశారని, తక్కువ టైంలోనే తమ తప్పును తెలుసుకొని సరిదిద్దుకునే అవకాశం కోసం ఆరాటపడుతున్నారని బిఆర్ ఎస్ వాళ్లుంటున్నారు, గమనిస్తున్నారా?BR;

Update: 2025-03-25 11:25 GMT
KT Ramarao, Working President, BRS

ప్రజలు జరుగుతున్న చరిత్ర గమనించాలి రోజూ. దుష్ట చతుష్టయం లాగా ఒకే ఇంటి పక్షులు పదే పదే మాట్లాడుతున్నాయి. అన్ని ముచ్చట్లు ఈ పక్షలు చెబుతున్నాయి.

అన్ని విషయాలు కెటిఆర్ , హరీష్, కవిత , కెసిఆర్ లే మాట్లాడుతున్నారు. అందరికీ వీళ్లే నాయకత్వం వహిస్తారు. బిసిల లీడర్లు వాళ్లే, ఎస్ సి లీడర్లు వాళ్లు, ఎస్టీల లీడర్లు వాళ్లే. మరొక గొంతు వినిపించదు.మరొక మనిషి కనిపించడు. దీనితో ఏమయిపోయింది భారత రాష్ట్ర సమితి (BRS) అనేది కుటుంబ పార్టీయే తప్ప తెలంగాణ ప్రజల కోసం నడిచే పార్టీ కాదని తమకు తామే నిరూపిస్తున్నారు. ఇదొకటి.

ఇంకో విషయం. గమనించాలె! వాళ్లు తిరిగి మేం అధికారంలోకి వచ్చి మీ సంగతి చూస్తాం అని హెచ్చరిస్తున్నారు. మల్లా వచ్చేమాట దేవుడెరుగు! ఆ మాట పక్కకు పెట్టి, వాల్ల డిప్రెషన్ ను పక్కకు పెట్టి చూస్తే … ఆ మాటలు ఈ ప్రవర్తన ఏం చెపుతున్నది?

వాళ్లు అధికారంలో వున్నపుడు ఎంత దుర్మార్గంగా , ఎంత వియంతృత్వ ధోరణితో ప్రవర్తించారో తెలుపుతున్నది. అది ఎంత అహంకారం,? కాళేశ్వరం కమిషన్ ముందు ఇంజనీర్లు అదే మాట పదే పదే చెప్పారు. లేదా మరిచిపోయామన్నారు. అట్లా వీరు అధికార దుర్వినియోగం చేస్తూ ఎంత అవినీతికి పాల్పడ్డారో వారి మాటలు, ఆ మాటల్లో తొణికిసలాడతున్న ఎరోగెన్స్ తెలుపుతున్నాయి.

తమ పాలనలో ఇలా అతి దుర్మార్గంగా ప్రవర్తించి అందరి నోర్లు మూయించి అవినీతి పనులు చేసారని దీని భావం. వాళ్లను గమనించండి. వాళ్ల పత్రికను, వాళ్ల టీవీని, వాళ్ల భాషను , వాళ్ల బాడీ లాంగ్వేజ్ ని గమనించండి. ప్రజలు తమకు ఓటు వేయక చాలా తప్పు చేసారట! ప్రజలు తమ తప్పు తెలుసుకుంటారట! స్వాతంత్ర్యం వచ్చిన్నుంచి ఎవరైనా గీ భాష మాట్లాడినారా?

మనిషి అట్నే కనపడతాడు. మాట తీరు అలాగే ఉంటుంది. కాని లోపలి సరుకు మారుతుంది. త్యాగాలు ప్రజలవి భోగాలు వారివయ్యాయి. కాని వాళ్లే త్యాగాలు చేసామని బాజా వాయిస్తారు. బీఆర్ ఎస్ పార్టీ ప్రజల ఉద్యమాలను, ప్రజల త్యాగాలను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నది. ఉద్యమాల పేరు చెప్పి ఏం చేసారో ప్రజలు గమనించాలి.

అయిదు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన పద్దులు బడ్జట్ లో చూపలేదు. లోపల లోపల ఖతం పట్టిచ్చిన్రు. ఉన్న ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టిన విషయం తెలువ కుంట చేసిన్రు. ఆ పైసలన్ని ఏంచేసినారో తెలువది. అప్పు తెచ్చినట్టు చూప లేదు. కనక ఖర్చు పెట్టినట్టు కూడ చూప రాదాయె! మరి గన్ని లక్షల కోట్లు ఏం జేసిన్రో ప్రజలకు తెలువక పాయె. కాగ్ నివేదిక బయట పెట్టేదాకా లోపలేం జరిగిందో చెప్పక పాయె! మాట మాటకు కాళేశ్వరం మేడిగడ్డ అంటరు. దానికి పెట్టింది ఎనభయి వేల కోట్లే అంటరు. అందులో బడ్జెట్ల కెళ్లి పెట్టింది కూడ వున్నది. ఆ పైసలన్ని ఎట్ల ఖర్చయినయి? దేనికి ఖర్చయినయి? ఆసరా పథకంతో రెండువేల చొప్పున ఇచ్చినయి మాత్రం ప్రజలకు ముట్టినయి. బీసీలకు లోన్లు ఇవ్వ లేదు. ఔట్ సోర్సింగ్ బందు జేసి పూర్తి జీతాలపై నియామకాలు చేయలేదు. డబుల్ బెడ్రూంలకు అన్ని కలిపి పదివేల కోట్లు!

మరి, తెలంగాణ ఉద్యమకారులకు ఏమైనా చేసినారా ? పోనీ ఉద్యమించిన విద్యార్థులకు ఉద్యోగాలుచ్చినారా? ఉన్నత విద్యా సంస్థల్లో నియామకాలు చేయక యూనివర్శిటీలను చదువులను నాశనం పట్టించినారు. ప్రభుత్వ విశ్వ విద్యాలయాలు వాటిలో సీట్లు కోర్సులు పెంచక పోగా ప్రయివేటు యూనివర్సిలకు పర్మిషన్లిచ్చినారు. వాటిలో రిజర్వేషన్లు లేవన్నారు.

ఏక్కడ కట్టినా మా మందలోనే ఈనాలని ఏ పార్టీల గెలిచినా తమ పార్టీలనే కలుపు కున్నారు. ఇపుడు తమ పార్టీ వాళ్లను తీసుకున్నరని కోర్టుకు పోయినారు. మరి అపుడు మీరు ఏ లెక్కల తీసుకున్నారో ఇపుడు అదే లెక్క ల తీసుకున్నరని లోకం అడుగుతుందని తెలువదా? మీరంతా కలసి ఇసుక దందాల ఏడు వేల కోట్లు తిన్నారని నేటి ప్రభుత్వం అంటున్నది.

సిరిసిల్ల ఇసుక దొంగతనం పట్టుకుంటే పానాలు పోయేట్టట్టు దళితులను కొట్టిచ్చింది అందుకే అని చెప్పినట్టయింది గద!

అధికారం లోకి వచ్చి అంతదాక పెట్టిన కేసులు ఎత్తేసేయమంటే అరిగోస పెట్టిన త్యాగమూర్తులు వీరు! 1996 నుండి మలి తెలంగాణ ఉద్యమాలు చేసినోల్లకు ఏమిచ్చినారు? బిచ్చగాల్ల లెక్క తిప్పిచ్చుకున్నారు. కసిరి కొట్టినారు. వేల పుస్తకాలు చదివిన తెలివి ఏడ ఏడ్చేంది? ఏండ్ల తరబడి గ్రంథాలయాలకు పుస్తకాలే కొన లేదు. ఇంటింటికి నల్లా మిషన్ భగీరథ అన్నారు. బిల్లు లెత్తినారు. పైసలు తిన్నారు. నల్లా లేదు, నీళ్లు లేవు.

సెక్రెటేరియట్ కు రాకుండ ప్రపంచ రికార్డు సాధించినందుకు, లక్షలకోట్లు వెనకేసుకొని “అందరిని కొంటం మల్ల గెలుస్తాం’ అనే బలుపు మాటలు గాక పోతే ప్రజలు ఓడిస్తే సిగ్గు తెచ్చుకున్నరా,లే. ’తప్పయింది, మా తప్పులే మమ్ముల ఓడిచ్చినయి, ఇక నుంచి అట్ల తప్పులు చెయ్య,” అని చంద్రబాబు మర్యాద కోసమైనా అన్నాడు. మీకు ఆ సంస్కారం కూడ లేదంటే అధికార మత్తు డబ్బు మదం ఇచ్చిన మత్తు ఇంకా దిగలేదని, దిగే అవకాశం లేక ఇట్లనే ఒర్రి ఒర్రి సస్పెన్షన్ నిరూపించుకుంటున్నారు.

తమను ఓడించి ప్రజలు తప్పు చేశారని, తక్కువ సమయంలోనే ప్రజలు తమ తప్పును తెలుసుకొని సరిదిద్దుకునే అవకాశం కోసం ఆరాటపడుతున్నారని ... ఇట్లా అనేక రకాలుగా తమలో నరనరాణ జీర్ణించుకున్న దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఇట్లా ఎందరో కొట్టుక పోయినారు. ఇక ముందు కూడా కొట్టుకు పోతారు. ఇది బిఆర్ ఎస్ కే కాదు, అందరికి వర్తిస్తుంది. కెసిఆర్ తీరుగా కాంగ్రెస్ ప్రవర్తిస్తే ఈ నలుగురు దుష్ట చతుష్టయం ఎపుడో రేవంత్ రెడ్డి లెక్క జగన్ లెక్క ఎపుడో జైలు పాలయ్యేవారు. గద్దర్ మీద చచ్చి పోయే దాక పాత కేసులు ఎత్తెయ్యలేదని జనానికి తెలుసు. రేవంత్ రెడ్డి తనను గోస వోసుకున్నందుకు ప్రతీకారం తీసుకోవాలనుకొని కూడా ఎందుకో ఓపిక పట్టుతున్నాడు. కాంగ్రెస్ ను మట్టి నిండా ముంచి దళిత ముఖ్య మంత్రిని గోడకేసి చరిచి బీసీ నాయకత్వం ను అడ్రసు లేకుండా చేసి పదేండ్లు కుట్ర పూరితంగా అధికారంలోకి వచ్చిన ఒక కుటుంబం పేరాశకు తెలంగాణ ఉద్యమం , తెలంగాణ ప్రజల ఆకాంక్షలు త్యాగాలు బలై పోయాయి. న మీడియా నోరు అన్ని ప్రజా సంఘాల నోరు నొక్కి చేసినది ఒక పాలనా? అందరికీ స్వేచ్ఛగా మనసులో మాట చెప్పే అవకాశం ఇచ్చి అందరిని కలుపుక పోయే పాలనే నిజమైన ప్రజా స్వామ్య పాలన. మీ పత్రికలో మీడియాలో మీగురించి తప్ప మిగతా ఉద్యమ కారుల గొంతుకాదు గదా వాసన కూడా లేకుండా నడిపే మీకు ప్రజాస్వామ్య విలువలు సంస్కృతి ఏం తెలుసు?

 ధరణి పోర్టల్, రైతు బంధు ప్రవేశ పెట్టిన కౌలుదాకు, అనుభవ దారి కాలమ్ తొలగించడం ద్వారా అయిదు దశాబ్దాలుగా ఉద్యమాల ద్వారా పొందిన పనికి రాని భూములను సాగులోకి తెచ్చుకున్నారు. వాటిని దొరలకు , లాండ్ మాఫియాలకు అప్పగించిన కుట్ర వీరిది. వేలాది,  లక్షలాది ప్రజలు కడుపుకొట్టి భూమి బేదఖలు చేసిన దుర్మార్గపు పాలన వీరిది. చెపుతూ పోతే మరెన్నో!! వీరిని చరిత్ర ఎన్నడూ క్షమించదు.

ఇపుడు కొత్త పాట పాడుతున్నారు. ప్రజలు తప్పు తెలుసుకున్నారు, ఈ కుటుంబానికి మళ్లీ అధికారం కట్ట బెట్టేందుకు ఆరాటపడుతున్నారనే పాటతో జనం మధ్య వస్తున్నారు. ప్రజల గమనించాలి.


(ఇందులో వ్యక్తం చేసినవన్నీ రచయిత వ్యక్తి గత అభిప్రాయాలు)

Tags:    

Similar News