KCR America|అమెరికా పర్యటనకు కేసీఆర్
రివర్సులో ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళుతుండటం ఆశ్చర్యంగా ఉంది.;
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తొందరలో అమెరికాకు వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాని అంతకుముందు కాని కేసీఆర్ అమెరికా(KCR America tour)కు వెళ్ళిందిలేదు. పదేళ్ళ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వం తరపున విదేశాల్లో ఎక్కువగా పర్యటించింది కొడుకు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(KTR) మాత్రమే. మామూలుగా అధికారంలో ఉన్నపుడు ముఖ్యమంత్రులు విదేశీప్రయాణాలు చేస్తుంటారు. అలాంటిది దానికి రివర్సులో ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళుతుండటం ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు అమెరికాకు ఎందుకు వెళుతున్నారన్నది పార్టీ నేతలకు కూడా అంతుబట్టడంలేదు. మనవడు హిమాన్షు అమెరికాలో చదువుకుంటున్నాడు. మనవడితో గడిపేందుకు కేసీఆర్ అమెరికాకు వెళుతున్నారేమో అనే చర్చ పార్టీ నేతల మధ్య జరుగుతోంది.
అమెరికాకు ఎప్పుడు బయలుదేరుతారనే విషయం స్పష్టంగా తెలియకపోయినా వెళ్ళిన దగ్గర నుండి రెండునెలలు ఉంటారని మాత్రం సమాచారం. పోయిన ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్ జనాల్లోకి పెద్దగా వచ్చిందిలేదు. ఈ ఏడాదిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే 17 సీట్లలో ఒక్కటంటే ఒక్కదానిలో కూడా గెలవలేదు. దాంతో అప్పటినుండి పూర్తిగా ఫామ్ హౌస్(Farm House)కు మాత్రమే పరిమితమైపోయారు. ఎప్పుడైనా నేతలను పిలిపించుకుని సమావేశం అవటంమినహా పార్టీకార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. భారీ వర్షాలు, వరదముప్పు, కరువు ఇలా ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చి జనాలు అల్లాడిన సందర్భాల్లో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు రాలేదు.
తొందరలోనే స్ధానికసంస్ధల ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం తెలిసిందే. జనవరిలో లేదా ఫిబ్రవరిలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని మంత్రులే చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో అయినా పార్టీ విజయం కోసం కేసీఆర్ ప్రచారం చేస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు పార్టీ కార్యక్రమాలు మొత్తాన్ని మొన్నటివరకు కేటీఆర్, హరీష్(Harish) మాత్రమే చూసుకునే వారు. అలాంటిది వీళ్ళకు ఇపుడిప్పుడే కూతురు(Kavitha) కవిత జతకలుస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ముగ్గురికి తోడు కేసీఆర్ కూడా రోడ్డుమీదకు వస్తే బాగుంటుందని పార్టీ నేతలు చాలాకాలంగా అనుకుంటున్నారు. అలాంటిది ఇపుడు కేసీఆర్ అమెరికాకు వెళ్ళబోతున్నారనే సమాచారంపై నేతలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ తిరిగి వస్తారని జరుగుతున్న ప్రచారం చూస్తే ఈలోగానే స్ధానికసంస్ధల ఎన్నికలు జరిగితే పార్టీ తరపున అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం మాటేమిటనే చర్చ పెరిగిపోతోంది. అధికారికంగా కేసీఆర్ కుటుంబం కూడా అమెరికా పర్యటనను ధృవీకరించలేదు కాని వెళుతున్నారనే చర్చయితే బాగా జరుగుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.