ఖమ్మంలో జానెడ్ ఇంటి స్థలం కోసం పదేండ్లుగా పోరాటం

ఖమ్మం జిల్లా అర్బన్ మండలం వెలుగుమట్లలో పేదలు నివసిస్తున్న భూదాన్ భూమిని కాజేసేందుకు ప్రయత్నం : OPDR రిపోర్టు

Update: 2024-10-24 04:26 GMT
Source: Telangana Today

ఖమ్మం జిల్లా అర్బన్ మండల పరిధి లోని వెలుగుమట్ల (వినోభా నవోదయ) కాలనీ) లో నివసిస్తున్న ప్రజలు  మంచినీరు, కరెంట్ అంతర్గత రహదారులు మొదలైన సమస్యలను  పరిష్కారం కోసం చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు.  ఇవన్నీ భూదాన్ భూములు. ఈ భూముల్లో నివాస హక్కులు పొంది  ఇల్లు కట్టుకుని నివసిస్థున్న ప్రజలకు ఈ వసతులు కల్పించాలని హైకోర్టు కూడా ఉత్తర్వులిచ్చింది.  అయితే, సమస్యలు పరిష్కారం కావడం లేదు. అందుకే వారు నిరంతరం పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ పోరాటాల పై  పోలీసు దాడులు జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. దీని  గురించి స్థానిక నాయకుల నుండి సమాచారం అందిన ‘ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ’ (OPDR: mOrganization for Protection of Democratic Rights)  రాష్ట్ర నాయకులు అక్టోబర్ 9 న ఖమ్మం వెళ్లారు.


అసలు సమస్య ఏమిటి?


ఖమ్మం పట్టణ శివారు ప్రాంతంలో వున్న వెలుగుమట్లలో సుమారు 62 ఎకరాల 7గుంటల భూదాన్ (Bhudan Lands) భూమి వుంది. ఈ భూముల లో 2014 లో భూదాన బోర్డు వారి కేటాయింపులతో భూదాన బోర్డు పట్టాలు అని ప్రజలు వ్యవహరించే ప్రొసీడింగ్ ఆర్డర్ల తో పేదలు, నివాస హక్కులు సంపాదించుకుని,ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. వాటికి ఇంటి నెంబర్లు, కరెంట్ మీటర్లు ఇవ్వాలని నీటి సదుపాయం కల్పించాలని అనేక మార్లు వివిధ స్థాయిల అధికారులను కలిసి విన్నవించారు.


రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్ శాఖ ఆఫీసుల చుట్టు తిరుగుతు వచ్చారు స్వంతంగా చందాలు వేసుకుని ఒక గ్రామీణ పేదల సంఘం కమిటీ ద్వారా నీరు , విద్యుత్తు ఏర్పాట్లు ప్రైవేటుగా కొనుక్కుని జీవనం సాగిస్తున్నారు. ఇలా సదుపాయాల కొరకు ప్రజలు డిమాండ్ చేస్తుంటే అధికారులు మాత్రం ఒక దశలో ఇచ్చిన కొద్ది ఇంటి నెంబర్లను కూడా నిలిపి వేసి ఇవి అక్రమ కట్టడాలుగా పరిగణిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసమే వెలుగు మట్ల పజలు పోరాటం చేస్తున్నారు.




ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా, ధర్నాలు చేసినా, చివరకు హైకోర్టు నుండి మంచినీరు,కరెంట్ ఇవ్వమని ఉత్తర్వులు వచ్చినా కూడా,స్థానిక రెవెన్యూ , కరెంట్, మున్సిపాలిటీ అధికారులు, కలెక్టర్ వాటిని లెక్క చేయకుందా ప్రజా వ్యతిరేక వైఖరని అవలంబిస్తున్నారు. ఖర్చులు , ఇబ్బందులు భరించలేక ప్రజలు తమ తాత్కాలిక ఇళ్ళను ఖాళీ చేసి వెళ్ళేలా పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఈ మధ్య పట్టణం విస్తరించటం కలెక్టరు ఆఫీసు కాంప్లెక్స్ నిర్మించటం తో ఇక్కడ భూముల విలువలు బాగా పెరిగిపోయాయి. దానితో ఈ భూమిని కబ్జా చేసి అమ్ముకుని వ్యాపారం లో లాభాలు గడించాలనుకుంటున్న వారికి ఈ పేదల కాలనీ అడ్డంకిగా వుంది. వారు తమకున్న రాజకీయ పలుకుబడి, ధనబలం తో పేదల కాలనీని తొలగించాలని ఈ భూములు తమ పట్టా భూములని వాదిస్తున్నారు అధికార పార్టీలు , వారు చెప్పినట్లు ఆడే అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా నిలుస్తూ పేద ప్రజల న్యాయమైన సమస్యను పరిష్కరించటంలో పూర్తిగా విఫలమైనారు.


రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగ ప్రవేశం


ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి సెషన్ కోర్టునుండి తెచ్చుకున్న"ఎక్స్పార్టీ డిక్రీ" ని చూపిస్తూ  1954నుండి భూదాన భూమిగా రికార్డు అయివున్న సుమారు 62 ఎకరాల భూమినుండి పేదలను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భూదాన బోర్డు లే ఔట్ నుండి తలా 100 గజాల జాగాపై నివాసహక్కులు పొందిన 1896 కుటుంబాలను నేరస్థులుగా భూ ఆక్రమణదారులుగా చిత్రిస్తున్నారు. ఈ భూమిలో అధికారులు జోక్యం చేసుకోరాదని, ఇళ్లను ఖాళీ చేయించ రాదని, యధాతధ స్థితి ని కొనసాగించాలని, ఈ కాలనీకి విద్యుత్తు, నీరు అందించాలని పలుమార్లు హైకోర్టు తో సహా అనేక కోర్టులు ఇచ్చిన ఆర్డర్లను మాత్రం ఏమాత్రం పట్టించు కోవడం లేదు. నిర్దాక్షిణ్యంగా ఇళ్లను ధ్వంసం చేయడం, ప్రజలపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, దౌర్జన్యాలకు దిగటం వంటి క్రూరమైన చర్యల వెనుక అధికారపార్టీ ప్రమేయం వుందని, పాలక పార్టీ అనుచరులకు ఈ భూముల విషయంలో ప్రయోజనం కల్గించే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వము, అధికారులు బరితెగించి పోలీసు వ్యవస్థ ద్వారా పేదలపై ఈ దౌర్జన్యకాండకు పాల్పడుతున్నారని స్పష్టమవుతున్నది. హేయమైన ఈ చర్యలను ఒపీడీఆర్ తీవ్రంగా ఖండిస్తున్నది


పోలీసుల దాడులు


వినోబా(నవోదయ) కాలనీ పేద  నివాసాలపై పోలీసులు అధికారులు దాడులు చేస్తూ ప్రజలను  భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. బలవంతంగా ఇండ్లలో సోదాలు చేయడం, కేసులు నమోదు చేయడం, పోలీసు అధికారుల చుట్టూ తిప్పుకోవడం, బెదిరించి ఇళ్లు ఖాళీ చేయించాలని ప్రయత్నించడం విచ్చల విడిగా కొనసాగిస్తు న్నారు. ఇళ్ళు పీకివేస్తున్న సమయంలో ప్రతిఘటించిన ఒక మహిళ గాయాలతో మరణించింది. అనేకమంది మీద 5, 6 కేసులు పెట్టారు 15 కేసులలో ఇరికించబడ్డ కార్యకర్తలు కూడా వున్నారు. పోలీసులు చేస్తున్న ఈ పాశవిక దమన కాండ అమానవీయమైనది. అనైతికమైనది. పేద కుటుంబాల జీవనాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది. దాదాపు రెండు వేల మంది పేదల నివాస హక్కులను హరించి వేస్తున్నది. కొద్దిమంది ధనవంతులకు, భూ వ్యాపారులకు వత్తాసు నిస్తున్నది


ఒపిడిఆర్ నిజనిర్ధారణ కమిటి


ఈ సమస్య తీవ్రతను, పోలీసుల ప్రవర్తనని పేదల ఉద్యమం పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గమనించిన  ఒపిడిఆర్   ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పరచి వాస్తవాలను ప్రజలకు తెలియ జెప్పాలని నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజాసంఘాల బాధ్యుల నుండి 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఓపిడిఆర్ నియమించింది.


ఓపిడిఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జతిన్ కుమార్, ఓపిడిఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.విజయేందర్ రావు, జీపీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పడిగ ఎర్రయ్య, ఆంధ్ర,ప్రదేశ్ , తెలంగాణ జిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె.వెంకటేశ్వర రావు, జి.వెంకటాద్రి, జిపిఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ఎం. వీరస్వామి, ఎఫ్ఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి హెచ్ ఎస్ ఎన్ మూర్తి, విజయసారధి అడ్వకేట్ (ఆంధ్రప్రదేశ్ హైకోర్టు), ఆంధ్రప్రదేశ్ ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ నాయకులు రాంబాబు, ఖమ్మం అడ్వకేట్ వెంకటలక్ష్మి, ఓపిడిఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుంకర రమేష్ బాబు, దండా లింగయ్య ఓపిడిఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బాణాల లక్ష్మణ చారి, టి.ఆర్.టి.ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి కిరణ్ జ్యోతి, హైదరాబాద్ ఓపిడిఆర్ సభ్యులు పద్మ, లక్ష్మి నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడ్డారు.


ఈ కమిటీ వారు అక్టోబరు 21 న తిరిగి ఖమ్మం సందర్శించారు. వినోబా కాలనీ కి వెళ్ళి ప్రజల అభిప్రాయాలను సేకరించారు. కాలనీ ఏర్పడిన పరిస్థితులను, అక్కడి ప్రజల జీవన స్థితిని, వారిపై వస్తున్న అభియోగాలను, అసత్య ఆరోపణల తో సహా ప్రభుత్వ వర్గాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని, పోలీసు దౌర్జన్యాలను గురించి విచారించారు. గ్రామీణ పేదల సంఘం" రాష్ట్ర నాయకులు పి. ముత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ తాళ్లూరి కృష్ణ, ఉమ్మడి నల్లగొండ జిల్లా బాధ్యులు వై. సురేందర్ ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు .


సమస్యను పరిశీలించిన సంస్థ నాయకులు ఉపాధ్యక్షులు డాక్టర్ జతిన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. విజయేందర్ రావు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ దండా లింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బాణాల లక్ష్మణాచారి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికి ఈ సౌకర్యాలను కల్పించవలసిన ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొన్నారని, ఇప్పటికైనా మొద్దు నిద్ర వదిలి వాటిని తప్పక అమలు జరపాలని కోరారు. పోలీస్ వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్టేటస్ కో ఉన్న అక్కడి భూమిలో ప్రవేశించరాదని  కమిషనర్ ఆఫ్ పోలీస్(సి.పి) గారిని 09/10/2024న కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం వినోభా(నవోదయ) కాలనీలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (OPDR )రాష్ట్ర ప్రతినిధులు ప్రజలతో ముఖాముఖి జరిపారు. 


ఒపిడిఆర్ నిజనిర్ధారణ కమిటీ ప్రజలతో జరిపిన ముఖాముఖి 

ఒపీడీర్ కమిటీ సభ్యులు 22-10-24 న కలెక్టరు గారిని కలిసి వాస్తవాలు వివరించి కోర్టు ఉత్తర్వుల కనుగుణంగా ప్రజలకు సముచితంగా నీరు, విద్యుత్తు వంటి కనీస సౌకర్యాలను కల్పించవలసిందిగా డిమాండ్ చేశారు. ఇంటి నెంబర్లు కేటాయించి పౌర హక్కులు కాపాడవలసిందని విజ్ఞప్తి చేశారు. భూదాన బోర్డు రద్దయింది కనుక సి సి ఎల్ ఎ నుండి అనుమతులు కావాలని ఆయన అన్నారు. ఉనికి లో వున్నప్పుడే అనుమతులు ఇచ్చిన బోర్డు అదే విషయాన్ని కోర్టులో కూడా ధృవీకరించింది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ పోలీసు విభాగాలు గత పది సంవత్సరాలనుండి ఒక శాఖ నుండి నుండి మరో విభాగానికి తిప్పుతూ అక్కడ నివసిస్తున్న పేద వారిని ఇలాగే వేధిస్తున్నారని అది సబబు కాదని. దాదాపు రెండు వేల మంది పేద ప్రజల పట్ల సానుభూతి తో వ్యవహరించాలని, ప్రజలు తమ హక్కులు నిలబెట్టుకోవటానికి కృతనిశ్చయులై వున్నారని, ప్రభుత్వ వైఖరి తో విసిగి పోయిన వారు ఏ పోరాటానికైనా సిద్ధంగా వున్నారని నిజ నిర్ధారణ కమిటీ గ్రహించిన వాస్తవాన్ని చెప్పి, పూర్తి అధికారిక సర్వే నిర్వహించి భూదాన కాలనీ హద్దులు నిర్ణయించి వారి హక్కును స్థిరీకరించి, వారికి శీఘ్రమే సదుపాయాలు కల్పించమని కమిటీ నొక్కిచెప్పింది.


తరువాత ఓపిడిఆర్ కమిటీ వినోబా కాలనీ లో బహిరంగ [విచారణ] సంభాషణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఓపిడిఆర్ రాష్ట్ర నాయకులు దండా లింగయ్య వ్యవహరించగా, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, దాదాపు 300 మందికి పైగా కాలనీ వాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. ఏది ఏమయినా తమ స్థలాలను వొదిలేది లేదని గట్టిగా చెప్పారు. నవోదయ సాంస్కృతిక సంస్థ" కళాకారులు విప్లవ గేయాలను ఆలపించి సభికులను ఉత్తేజ పరిచారు.


పేద ప్రజలకు అరు గ్యారంటీలు అమలు చేస్తామని అనునిత్యం ప్రచారం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. వినోబా (నవోదయ)కాలనీ ప్రజలకు వచ్చిన హై కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం అధికారులు అమలు చేయటం లేదు. ఎన్నికల వాగ్దానాల ప్రకారం ఇల్లు కల్పించవలసిన ప్రభుత్వం ఆ వాగ్దానం నెరవేర్చక పొగా, ప్రజలే స్వయంగా బోర్డు నుండి హక్కులు సంపాదించుకుని ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటే వాటిని కూడా గుర్తించడంలేద అని ఒపిడిఆర్ పేర్కొంది.


ఖమ్మం నగరంలోని ఇళ్ల స్థలాల పేదలు తమ హక్కుల సాధన కొరకు న్యాయమైన పోరాటం సాగిస్తున్నారని, అయితే పాలకులు ప్రజల హక్కులను రక్షించటంలోనూ, వారి సమస్యలను పరిష్కరించటంలోను విఫలమై దేశంలో పచ్చి పోలీసు రాజ్యం నడుపుతున్నారనీ, ఈ క్రమంలోనే ఉద్యమకారులపై, సాధారణ ప్రజలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందు లకు గురి చేస్తున్నారని నేతలు స్పష్టం చేశారు.

ప్రజల న్యాయమైన పోరాటానికి తమ సంస్థ ఎల్లవేళలా అండ దండల నిస్తుందని ఓపిడిఆర్ కమిటీ వారికి తమ పూర్తి మద్దతు ప్రకటించింది. నిజ నిర్ధారణ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి పరిష్కారానికి తోడ్పడతామని తెలియ జేసింది.  కాలనీ వాసులపై పోలీసులు అనుసరిస్తున్న విధానం ప్రజావ్యతిరేకమైనది. దీనిని తీవ్రంగా గర్హిస్తున్నామని ఒపిడిఆర్  సంస్థ  ప్రతినిధులు ప్రకటించారు.


గట్టి పూనికతో ఖమ్మం పేద ప్రజానీకం సాగిస్తున్న ఈ పోరాటాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజల వద్దకు తీసుకు వెళతామని పోరాటానికి సంఘీభావాన్ని కూడ గడతామని ప్రకటించారు. ఖమ్మం లోనే కాక హైడ్రా పేరిట, మూసి సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను తొలగిస్తున్న ప్రభుత్వాల నైజాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరు గమనించి ప్రభుత్వాల ఈ ప్రజా వ్యతిరేక వైఖరులను తిప్పికొట్టాలని , తమ హక్కులు సాధించుకునే ప్రజాతంత్ర ఉద్యమాలలో సంఘీభావం తో ఒకరికొకరు తోడుగా నిలిచి ఉద్యమాలను మరింత ప్రభావ శీలంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.














Tags:    

Similar News