మూసీ నిద్రచేయబోతున్న కిషన్ రెడ్డి
మూసీనది పరిసర ప్రాంతంలోని ఒక ఇంట్లో తాను శనివారం అంతా ఉంటానని చెప్పారు.
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మూసీనది ప్రాంతంలో నిద్రచేయబోతున్నారు. మూసీనది(Musi river) పునరుజ్జీవనం విషయంలో నదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలు, నిర్మాణాలను కూల్చేయాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. మూసీనదిగర్భం మధ్యలో నుండి నదికి రెండువైపులా సుమారు 50 మీటర్లమేర ఉన్న నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించబోతున్నది ప్రభుత్వం. దీంతో నివాసితుల్లో పెద్ద గోల మొదలైంది. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో సుమారు 200 ఇళ్ళను ప్రభుత్వం కూల్చేసింది. తమ ఇళ్ళను కూడా ప్రభుత్వం ఎక్కడ కూల్చుతుందో అన్న ఆందోళనతో వందమంది కోర్టులో కేసులు వేశారు. కేసును విచారించిన న్యాయస్ధానం ఇళ్ళకూల్చివేతపై స్టే ఇచ్చింది. దాంతో కూల్చివేతలకు బ్రేక్ పడింది.
ఈ నేపధ్యంలోనే మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రిస్టేజిగా తీసుకున్న రేవంత్ కు నూరుశాతం వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలకు మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ నేపధ్యంలోనే మూసీనది ప్రాంతంలో ప్రతిపక్షాల నేతలు పడుకుంటే నివాసితుల ఇబ్బందులు ఏమిటో తెలుస్తుందని రేవంత్ ఛాలెంజ్ చేశారు. రేవంత్ సవాలును బీఆర్ఎస్, బీజేపీ నేతలు కొద్దిరోజుల పాటు పట్టించుకోలేదు. అయితే శుక్రవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Central Minister Kishan Reddy) సడెన్ గా ఒక ప్రకటన చేశారు. అదేమిటంటే మూసీనది ప్రాంతంలో తాను నిద్రిస్తానని. మూసీనది పరిసర ప్రాంతంలోని ఒక ఇంట్లో తాను శనివారం అంతా ఉంటానని చెప్పారు. అదే ఇంట్లో భోజనం చేస్తాను, నిద్రిస్తానని కిషన్ చెప్పారు. రేవంత్ చెప్పినట్లు ఒక్కరోజు నిద్రపోవటం కాదని మూడునెలలు నిద్రచేయటానికి కూడా తమ పార్టీ నేతలంతా సిద్ధంగా ఉన్నట్లు కిషన్ చెప్పారు.
మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని అయితే ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ళను కూల్చటాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నట్లు కిషన్ చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇదే పద్దతిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) కూడా మాట్లాడుతున్నారు. మూసీనది ప్రక్షాళన చేయటానికి అభ్యంతరంలేదు కాని పేదలుంటున్న ఇళ్ళను మాత్రం కూల్చవద్దంటున్నారు. పేదలుంటున్న ఇళ్ళను, నిర్మాణాలను తొలగించకుండా మూసీనదిని వెడల్పు చేయటం సాధ్యంకాదు. నదిని వెడల్పుచేయకుండా మూసీ ప్రక్షాళన జరగదు. ఆక్రమణలు, నిర్మాణాలను అలాగే ఉంచి మూసీనదిని ప్రక్షాళన ఎలాగ చేయాలన్న ప్రశ్నకు సమాధానాలు చెప్పటంలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రకటించిన కేటీఆర్ రెండువైపులా ఇళ్ళను తొలగించమని అధికారులను ఆదేశించారు. తాము అధికారంలో ఉన్నపుడు నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించమని చెప్పిన కేటీఆర్ ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ పని చేస్తానని రేవంత్ అంటుంటే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.