Komatireddy Venkat Reddy | ‘కవిత దీక్ష ఒక జోక్’..

ప్రత్యేక రైలులో పార్టీకి చెందిన బీసీ నేతలు ఢిల్లీకి బయలుదేరారు.;

Update: 2025-08-04 08:38 GMT

బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నాచౌక్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ధర్నా ఒక పెద్ద జోక్ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సెటైర్లు వేశారు. ఇంతపెద్ద జోక్ తానెప్పుడూ వినలేదు, చూడలేదంటూ చుకలంటించారు. అసలు తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత ఎవరో కూడా తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ వ్యవహారంలో కేంద్రంతో కొట్లాడతామని ఆయన తెలిపారు. అందుకోసమే ఢిల్లీలో మహాధర్నా చేయడానికి తమ పార్టీ పిలుపునిచ్చిందని అన్నారు. బీసీల నేతలతో ప్రత్యేక రైలులో ఈరోజు ఢిల్లీకి బయలుదేరినట్లు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు. సోమవారం అనేక అంశాలపై చర్చించడం కోసం తమ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తుందని వివరించారు.

‘‘కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ నిందితులు జైలుకు వెళ్లడం ఖాయం. నా ఫోన్ ట్యాప్ కాలేదు. బనకచర్లను నిలువరించి తీరుతాం. కాళేశ్వరం నివేదికపై మంత్రివర్గ సమావేవంలో చర్చిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఊహించలేని అవినీతి జరిగింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసిన అధికారుల దగ్గర నుంచే రూ.వందల కోట్ల అవినీతి ధనం లభ్యమవుతుంది. ఇక అప్పుడు అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్, హరీష్ రావుల దగ్గర ఎంత మొత్తంలో డబ్బు ఉందో? ఈ విషయంలో తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు. చట్టప్రకారం చర్యలు ఉంటాయి’’ అని తెలిపారు.

‘‘బీసీ రిజర్వేషన్ల విషయంలో మా ప్రభుత్వం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉంది. కేంద్రంతో కొట్లాడయినా సాధించి తీరుతాం. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఇదే అంశంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తాం. బీసీ రిజర్వేషన్ల ప్రాముఖ్యత వివరిస్తాం. ఎలాగైనా సాధిస్తాం’’ అని తెలిపారు. అనంతరం కవిత ధర్నాపై ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కవిత ఎవరో నాకు తెలీదు. ఆమె చేస్తున్న ధర్నా ఒక జోక్’’ అని అన్నారు. అదే విధంగా ఏపీ మంత్రి నారా లోకేష్‌కు రాజకీయ అవగాహన శూన్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు..

కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగానే సోమవారం ప్రత్యేక రైలులో పార్టీకి చెందిన బీసీ నేతలు ఢిల్లీకి బయలుదేరారు. వారితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీకి పయనమయ్యారు. చర్లపల్లి నుంచి వారు ఢిల్లీకి బయలుదెరారు.

Tags:    

Similar News