KTR | ‘పాలించే సీఎం కావాలి.. యాత్రలు చేసే సీఎం కాదు’

అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ చేసింది మూడే మూడు పనులన్న కేటీఆర్.;

Update: 2025-08-02 07:52 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ఢిల్లీ(Delhi) పర్యటనలు మరోసారి రాష్ట్రరాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా రేవంత్ మరోసారి ఢిల్లీ టూర్‌కు రెడీ కావడంతో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్లడం కాకుండా రాష్ట్రానికి ఏం చేశారు? అంటూ ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి హస్తినకు వెళ్లడమే ధ్యేయంగా రేవంత్ నడుచుకుంటున్నారని, 20 నెలల పాలనలో 50 సార్లు ఢిల్లీకి మూటలు మోశారంటూ ఘాటు ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR).. ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ ఒకటి పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. ఢిల్లీలో ఇన్నిసార్లు మూటలు మోసిన సీఎం.. ఏనాడైనా తెలంగాణకు ఏమైనా ఢిల్లీ నుంచి తీసుకొచ్చారా? అని కూడా ప్రశ్నించారు.

‘‘హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్! తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా... ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి. ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు: మొదటి పని – ఫ్లైటు టికెట్ బుక్ చేయడం! రెండో పని – ఢిల్లీకి పోవడం! మూడో పని – ఖాళీ చేతులతో తిరిగి రావడం! రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు .. రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదు.. సాగునీళ్లు రావు .. తాగునీళ్లు లేవు ... కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదు’’ అని చురకలంటించారు.

‘‘బనకచర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన లేదు. రెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు .. జాబ్ క్యాలెండర్ల జాడ లేదు. రుణమాఫీ కాలేదు- రైతు భరోసా రాలేదు. తులం బంగారం ఊసు లేదు .. రూ.4 వేల ఫించన్ జాడ లేదు. గురుకులాల గోడు పట్టదు - గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదు. కానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్‌లు ఎక్కుతున్నాడు .. దిగుతున్నాడు. “ఒక్కసారి కాదు… రెండు సార్లు కాదు…50 సార్లకు చేరిన హస్తిన యాత్ర. కానీ తెచ్చింది ఏమీ లేదు! శుష్కప్రియాలు .. శూన్య హస్తాలు.. అయిననూ పోయి రావలె హస్తినకు!కానీ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి?? నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ… దానికి బదులు దక్కింది మాత్రం... ఫోటో షూట్లు, వీడియోలు, విందు రాజకీయాలు!’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి కానీ ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు అని కేటీఆర్ పోస్ట్ పెట్టారు.


రాష్ట్రం బయటే ఎక్కువ రోజులు..?

తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కన్నా రాష్ట్రం బయటే ఎక్కువ ఉన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి.. 50 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు వెళ్తున్నది 51వ సారి. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం సమయంలో వెళ్లడాన్ని ప్రతిపక్షాలు కూడా మినహాయించినట్లు ఉన్నాయి. అయితే ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ సీఎం రేవంత్ అక్కడ కనీసం రెండు రోజులు గడిపినట్లు అధకారిక లెక్కలు చెప్తున్నాయి. ఢిల్లీ మినహా ఇంగ్లండ్, దక్షిణ కొరియా, అమెరికా, జపాన్, దావోస్ సహా పలు ఇతర దేశాల పర్యటనలకు కూడా రేవంత్ వెళ్లారు. వీటితో పాటుగా మన దేశంలో జరిగిన పలు ఎన్నికల్లో పార్టీ పరంగా ప్రచారం చేయడానికి కేరళ, మహారాష్ట్ర, హర్యానాలు సహా పలు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లారు. ఇలా ఆయన వేసిన టూర్లన్నీ లెక్కేసుకుంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన సచివాలయంకు వచ్చిన దానికన్నా రాష్ట్రం బయటే ఉన్నది ఎక్కువ అని తెలుస్తోంది.

Tags:    

Similar News