కేటీయార్ నిజం అంగీకరించారా ?
సింగరేణి బొగ్గుగనుల వేలంపాటలకు సంబంధించి ఒక నిజాన్ని అంగీకరించారు.
ఇంతకాలం చెప్పినదానికి విరుద్ధంగా కేటీయార్ ఈరోజు మాట్లాడారు. సింగరేణి బొగ్గుగనుల వేలంపాటల నేపధ్యంలో గురువారం పార్టీ సీనియర్ నేతలు, అనుబంధంగా పనిచేస్తున్న బొగ్గుగని కార్మికసంఘం నేతలతో కేటీయార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సింగరేణి బొగ్గుగనుల వేలంపాటలకు సంబంధించి ఒక నిజాన్ని అంగీకరించారు. ఎందుకంటే బయట వాళ్ళదగ్గర చెప్పినట్లుగా సింగరేణి గురించి సంబంధిత కార్మికసంఘం నేతల దగ్గర మాట్లాడితే కుదరదు కదా.
దేశవ్యాప్తంగా ఉన్న గనులను కేంద్రప్రభుత్వం వేలం వేస్తోంది. ఇందులో భాగంగానే మొన్నటి 15వ తేదీన దేశంలోని 60 బొగ్గుగనులను వేలానికి పెట్టింది. ఇందులో సింగరేణి పరిధిలోని శ్రావణపల్లి బొగ్గుగని కూడా ఉంది. బొగ్గుగని వేలంపాటను వ్యతిరేకించే క్రమంలో కార్యాచరణను నిర్ణయించేందుకు కేటీయార్ బొగ్గుగని కార్మికసంఘం నేతలతో సమావేశమయ్యారు. ఇంతకాలం తమప్రభుత్వం పదేళ్ళు బొగ్గుగని వేలంపాటలను అడ్డుకున్నదనే చెబుతున్నారు. మీడియా సమావేశాల్లో, పార్టీ నేతల సమావేశాల్లో కూడా ఇదే విషయాన్ని పదేపదే చెప్పారు. కాని ఇపుడు మాత్రం అసలు విషయాన్ని అంగీకరించారు. ఇంతకీ కేటీయార్ అంగీకరించిన నిజం ఏమిటంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రం రెండు బొగ్గుగనులను వేలం వేసిందని. వేలం వేయటమే కాకుండా రెండు గనులను రెండు ప్రైవేటు సంస్ధలకు కేటాయించిందన్న వాస్తవాన్ని కూడా అంగీకరించారు.
బొగ్గుగనులకు వేలంవేసి రెండు గనులను ప్రైవేటుసంస్ధలకు అప్పగించింది నిజమైనపుడు మరింతకాలం తమ ప్రభుత్వం వేలంపాటలను వ్యతిరేకించిందని, అడ్డుకున్నదని ఎలా చెప్పారన్నదే పాయింట్. బొగ్గుగునుల వేలంపాట జరగలేదని, కేంద్రం ప్రైవేటుసంస్ధలకు గనులను కేటాయించలేదని కార్మికసంఘం నేతల దగ్గర చెబితే పరువుపోతుంది. ఎందుకంటే వాస్తవాలు ఏమిటో కార్మికసంఘం నేతలకు పూర్తిగా తెలుసు. కాబట్టి విషయం పూర్తిగా తెలిసిన వాళ్ళదగ్గర ఎలాబడితే అలా మాట్లాడితే కుదరదు. అందుకనే వేలంపాటలు, బొగ్గుగనుల కేటాయింపుపై కేటీయార్ ఇపుడు నిజాలు మాట్లాడారు. ఒక విషయంలో నిజం అంగీకరించిన కేటీయార్ మరో విషయంలో మాత్రం అబద్ధం చెప్పారు.
అదేమిటంటే బొగ్గుగనులను కేంద్రం వేలంవేసినా గనుల్లో నుండి తట్టెడు బొగ్గును ఎత్తకుండా విజయవంతంగా అడ్డుకున్నట్లు చెప్పారు. నిజానికి గనుల్లో నుండి తట్టెడు బొగ్గును ఎత్తటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నది ఏమీలేదు. పై రెండు సంస్ధలు అరబిందో, అవంతికలు బొగ్గు తవ్వకాల్లో వాటి సమస్యలు వాటికి అడ్డుపడ్డాయి. అందుకనే బొగ్గుగనుల కేటాయింపు పూర్తిగా జరిగినా ఇప్పటివరకు తవ్వకాలు మొదలుపెట్టలేకపోయాయి. వాటి సమస్యల వల్ల అవి తవ్వకాలు మొదలుపెట్టలేకపోవటాన్ని కేటీయార్ తమ విజయంగా చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.