తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇవ్వండి.. ఖర్గేకి కేటీఆర్ సూచన

దయచేసి తెలంగాణను మరో బుల్‌డోజర్‌ రాజ్‌గా మారకుండా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సలహా ఇవ్వండి అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Update: 2024-08-30 10:20 GMT

దయచేసి తెలంగాణను మరో బుల్‌డోజర్‌ రాజ్‌గా మారకుండా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సలహా ఇవ్వండి అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గతంలో ఖర్గే చేసిన ఒక ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ ఆయన ఇలా రాసుకొచ్చారు. ఖర్గే చెప్పినట్లుగా, ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయమన్నారు. తెలంగాణలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతోంది అని మండిపడ్డారు.

మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.నిన్న అక్రమంగా కూల్చివేసిన నిరుపేదల్లో 25 కుటుంబాలు శారీరక వికలాంగులు ఉన్నారన్న కేటీఆర్... ఆమోదయోగ్యమైన పద్ధతులు పాటించకుండా, విధివిధానాలు లేకుండా అమలు చేసే చట్టం చట్టమే కాదన్నారు. అడ్డగోలుగా నిరుపేదల పైకి బుల్డోజర్ నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి.. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యాంగా మార్చకుండా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.

ఖర్గే పోస్ట్ సారాంశం ఏంటంటే... 

ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులను చేయడం అమానవీయం, అన్యాయం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై పదే పదే దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రూల్ ఆఫ్ లా ద్వారా నిర్వహించబడే సమాజంలో ఇటువంటి చర్యలకు స్థానం లేదు. పౌరుల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు బుల్‌డోజింగ్‌ను ఉపయోగించే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిర్మొహమాటంగా విస్మరించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అరాచకం సహజ న్యాయాన్ని భర్తీ చేయదు. నేరాలకు న్యాయస్థానాలలో తీర్పు ఇవ్వాలి... కానీ, ప్రభుత్వం కనుసన్నల్లో కాదు" అంటూ ఖర్గే పోస్ట్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న కూల్చివేతల విషయంలో ఖర్గే ఇలాంటి సూచనలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ కాంగ్రెస్ నేతలకి కూడా చేయాలంటూ సెటైర్లు వేశారు.

Tags:    

Similar News