‘ఎన్నికల పోరుకు సిద్ధంగా ఉండండి’

స్థానిక సంస్థల ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సన్నాహాలు చేయాలని సూచించిన కేటీఆర్.

Update: 2025-09-25 12:09 GMT

తెలంగాణలోని బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని తెలిపారు. బీఆర్ఎస్ విజయం సాధించడం కోసం పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం భారీ ఎత్తున సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఆయన చెప్పారు. పార్టీ నేతలతో గురువారం జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో కేటీఆర్, హరీష్.. వారికి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని, కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. అందరితో మమేకమై ఉండే గెలుపు గుర్రాలను పోటీకి సన్నద్ధం చేయాలన్నారు.

‘‘కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలంతా కూడా మళ్లీ బీఆర్ఎస్ రావాలని, కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అమలు చేయని హామీలను, సర్కార్ అసమర్థత, వైఫల్యాలు, స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పల్లె ప్రగతి పేరిట గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ హయాంలో చేసిన కార్యక్రమాలు, వాటి ఫలితాలు వివరించాలి. దాంతో పాటుగానే ఇప్పుడు పల్లెల్లో పరిస్థితిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. బతుకమ్మ పండుగకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదు. తెలంగాణ సంస్కృతి పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. స్థానికంగా బీఆర్ఎస్ నేతల ద్వారా బతుకమ్మ కోసం ఏర్పాట్లు చేసేలా చూడాలి’’ అని కేటీఆర్ సూచించారు.

ప్రశ్నార్థకంగా స్థానిక సంస్థల ఎన్నికలు..

అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం అయోమయంలో ఉంది. ఎప్పుడు నిర్వహించాలి అన్న అంశంపై పాలకులకే ఒక క్లారిటీ లేదు. బీసీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని పదేపదే సీఎం రేవంత్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థలు నిర్వహించడానికి హైకోర్టు విధించిన గడువు ముగియడానికి వస్తోంది. దీంతో ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది హాట్ టాపిక్‌గా మారింది. హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30 దగ్గరపడటంతో ఈ గడువును పెంచాలని న్యాయస్థానాన్ని కోరే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రతిపక్షాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో కూడా చెప్పలేని ప్రభుత్వం పాలిస్తోందంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

Tags:    

Similar News