కేటీయార్ లో అపరిచితుడున్నాడా ?

కేసీయార్, కేటీయార్, కవితను అపరిచితుడు ఆవహించాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే కేటీయార్ తాజాగా ఒక ట్వీట్ చేశారు.

Update: 2024-05-19 04:40 GMT
KTR

కల్వకుంట్ల ఫ్యామిలీ వైఖరే చాలా విచిత్రంగా ఉంటోంది. తాము అధికారంలో ఉన్నపుడు ఒకలాగ వ్యవహరించిన ఈ ఫ్యామిలి ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి రాగానే పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. కేసీయార్, కేటీయార్, కవిత ఎవరిని తీసుకున్నా ఫ్యామిలీని అపరిచితుడు ఆవహించాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే కేటీయార్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. అందులో ఏముందంటే ‘ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు’ అనుంది. ఈ ట్వీట్ ఎందుకు చేశారంటే వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికలో పార్టీ తరపున పోటీచేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. ఈ నేపధ్యంలోనే పై ట్వీట్ చేశారు.

నిజానికి కేటీయార్ చేసిన ట్వీట్ కు రాకేష్ కు ఓటేసి గెలిపించమని అడగటానికి సంబంధమే లేదు. అయినా ఎందుకు ధిక్కార స్వరాలు, ప్రశ్నించేగొంతులు కావాలని కేటీయార్ చెప్పారు ? హైదరాబాద్ లో ధర్నాచౌక్ అనేది చాలా ఫేమస్. ఇందిరాపార్క్-ఎన్టీయార్ స్టేడియం మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఆందోళనకారులు దశాబ్దాలుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించాలన్నా, నిలదీయాలన్నా, వ్యతిరేకించాలన్నా రాజకీయపార్టీలు, విద్యార్ధిసంఘాలు, మహిళాసంఘాలు, ప్రజాసంఘాలు ధర్నాచౌక్ ను ఉపయోగించుకునేవి. ఈ ధర్నాచౌక్ ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో బాగా పాపులరైంది. ఈ చౌక్ ను టీఆర్ఎస్ ఉపయోగించుకున్నట్లుగా మరో రాజకీయపార్టీ ఉపయోగించుకోలేదనే చెప్పాలి. అలాంటిది, కేసీయార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నాచౌక్ ను నిషేధించారు.

తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ గొంతు లేవకూడదని, ప్రశ్నించకూడదన్న ఉద్దేశ్యంతోనే ధర్నాచౌక్ ను మూయించేశారు. అక్కడ ఎవరూ ఎలాంటి గొడవలు చేయకుండా పోలీసులను కాపలాపెట్టించారు. విచిత్రం ఏమిటంటే కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనతెలిపేందుకు ముఖ్యమంత్రి హోదాలో కేసీయార్ స్వయంగా ధర్నాచౌక్ లోనే దీక్షచేశారు. అంటే కేంద్రానికి వ్యతిరేకంగా తాను నిరసన తెలపచ్చుకాని తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకెవరూ నిరసన తెలపకూడదన్న వైఖరిని బయటపెట్టుకున్నారు. పదేళ్ళపాటు అలాగే సాగిన అధికారం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేజారిపోయింది. ఎప్పుడైతే ఎన్నికల్లో ఓడిపోయారో వెంటనే కేసీయార్, కేటీయార్ కు ధర్నాచౌక్ గుర్తుకొచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ధర్నాచౌక్ లో నిరసనలు తెలపటం మొదలుపెట్టారు.

ఇపుడేమో కేటీయార్ తెలంగాణాకు కావాల్సింది ‘అధికారగొంతులు కాదు...థిక్కార గొంతులు, ప్రశ్నించేగొంతు’లన్నారు. అంటే తాము ఎవరినైనా ప్రశ్నిస్తాము కాని తమను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదన్న కేసీయార్ వైఖరినే కేటీయార్ కూడా ఫాలో అవుతున్నట్లున్నారు. కేసీయార్, కేటీయార్ బాధను తెలంగాణా ప్రజలంతా అనుభవించాలన్నట్లుగా ఉంది వీళ్ళ వైఖరి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తండ్రి, కొడుకులు సహించలేకపోతున్నారు. అందుకనే నోటికొచ్చినట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని తాము తట్టుకోలేకపోతున్నాం కాబట్టి జనాలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని వీళ్ళిద్దరు కోరుకుంటున్నట్లున్నారు. అందుకనే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించండని జనాలను రెచ్చగొడుతున్నారు.

పదేళ్ళపాలనలో తండ్రి, కొడుకులు ఏమిచేశారో జనాలందరూ చూసిందే. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలుచేయండి, తిరగబడండని కేసీయార్ ఎంత రెచ్చగొడుతున్నా జనాలు ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీయార్ రెచ్చగొడితేనే పట్టించుకోని జనాలు ఇక కేటీయార్ రెచ్చగొడితే పట్టించుకుంటారా ? ఫ్యామిలీలో ముగ్గురు ఒకే పద్దతిలో ఆలోచిస్తున్నట్లున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీల్లో నాణ్యతలోపాలు బయటపడినా కేసీయార్ కాదంటున్నారు. అప్పుడేమో కాళేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్ చేసి దగ్గరుండి కట్టించారనన్నారు. ప్రపంచఅద్భుతాల్లో కాళేశ్వరం కూడా ఒకటని ఊదరగొట్టారు. ఇపుడు లోపాలు బయటపడగానే ప్రాజెక్టు డిజైన్ తో తనకేం సంబంధమంటున్నారు. తానేమన్నా ఇంజనీరునా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

ఇక కవిత అయితే ప్రతిపక్షంలోకి రాగానే అసెంబ్లీలో జ్యోతీరావుపూలే విగ్రహం పెట్టాలని నానా రచ్చచేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుచేయాల్సిందే అని ఎంతగోల చేశారో అందరు చూసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టించమని తన తండ్రి కేసీయార్ ను ఒక్కసారి కూడా అడగలేదు. ప్రతిపక్షంలోకి రాగానే పూలే విగ్రహంమీద అపారమైన ప్రేమ చూపించారు. 33 శాతం రిజర్వేషన్ల చట్టంతో పనిలేకుండా బీఆర్ఎస్ లో అసెంబ్లీ, ఎంపీ టికెట్లు ఇవ్వమని తన తండ్రిని ఎప్పుడూ అడగలేదు. మొదటసారి ముఖ్యమంత్రి అయినపుడు మంత్రివర్గంలో మహిళకు చోటులేకపోయినా కవిత పట్టించుకోలేదు. అంటే తాము అధికారంలో ఉన్నపుడు ఒకలాగ, ప్రతిపక్షంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే వీళ్ళలో అపరిచితుడు ఉన్నాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News