హెచ్ సీ యూ పై కేటీఆర్ బహిరంగ లేఖ
ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటున్న విద్యార్ధులను అభినందిస్తు సలాం చేశారు.;
బాగా వివాదాస్పదమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి పరిధిలోని 400 ఎకరాల రక్షణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. యూనివర్సిటి భూముల రక్షణ కోసం విద్యార్ధులకు తమపార్టీ అండగా ఉంటుందని లేఖలో చెప్పారు. కంచ గచ్చిబౌలిలోని యూనివర్సిటీ భూముల రక్షణకు చేతులు కలపాలంటు తెలంగాణ ప్రజానీకం, విద్యార్ధులు, పర్యావరణవేత్తలకు కేటీఆర్(KTR) బహిరంగ లేఖలో కోరారు. భూముల విషయంలో రేవంత్(Revanth) సర్కార్ వైఖరిని కేటీఆర్ తన లేఖలో ఎండగట్టారు. 400 ఎకరాల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. 400 ఎకరాల్లో 734 జాతుల మొక్కలు, 220 రకాల పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తుచేశారు.
ప్రభుత్వ ఆర్ధిక లాభంకోసం పర్యావరణంపై దాడిచేస్తున్నట్లు కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం పర్యావరణాన్నినాశనంచేస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటున్న విద్యార్ధులను అభినందిస్తు సలాం చేశారు. యూనివర్సిటి(HCU) పరిధిలోని అటవీభూముల రక్షణకు విద్యార్ధులు చేస్తున్న శాంతియుత పోరాటాన్ని మెచ్చుకున్నారు. పోరాటాలు చేస్తున్న విద్యార్ధులపై అపవాదులు, యూనివర్సిటీనే తరలించేస్తామని ప్రభుత్వం నుండి వస్తున్న బెదిరింపులను కేటీఆర్ తప్పుపట్టారు.
ఎకో పార్క్ పేరుతో ప్రభుత్వం సరికొత్తమోసానికి దిగినట్లు కేటీఆర్ ఆరోపించారు. అడవిని కాపాడేందుకు బదులుగా ప్రభుత్వమే భూఆక్రమణలకు పాల్పడుతుండటం ఆందోళనకరమన్నారు. నిరసనలను నియంత్రించటానికి యూనివర్సిటీని ‘ఫోర్త్ సిటీ’(Fourth City) ప్రాంతానికి తరలిస్తామని బెదిరించటం దుర్మార్గమన్నారు. పర్యావరణ రక్షణకోసం విద్యార్ధులు చేస్తున్నఆందోళనలకు అందరు మద్దతుగా నిలబడాలని పిలుపిచ్చారు. విద్యార్ధుల ఆందోళనలకు బీఆర్ఎస్(BRS) మద్దతుగా నిలబడుతుందని హామీఇచ్చారు.