ఉపఎన్నిక నామినేషన్‌కు ఈరోజే లాస్ట్..

నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్

Update: 2025-10-21 07:42 GMT

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ప్రదాని పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగానే నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్లు వేయడానికి మంగళవారం ఆఖరు తేదీ కావడంతో ఈరోజు కూడా భారీగానే నామినేషన్లు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్.. మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో దీపక్‌తో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను అందించారు లంకల దీపక్. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 13 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నామినేషన్‌ వివరాలను ఆన్‌లైన్‌లో భర్తీ చేసినా.. సంతకం, ప్రమాణం కోసం తప్పకుండా అభ్యర్థి అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంటుంది.

అక్టోబర్ 13 నుంచి ఇప్పటి వరకు షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో 80కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మరిన్ని నామినేషన్‌లు దాఖలు కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించడంతో భారీగా నామినేషన్లు రావొచ్చని అనుకుంటున్నారు అధికారులు. అయితే అక్టోబర్ 21తో నామినేషన్ల ప్రక్రియ ముగవగా ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు అధికారులు. ఈ ఉప ఎన్నిక కోసం మొత్తం 407 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. దాదాపు 3.2 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుంటారని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం ఎంత నమోదు అవుతుంది అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం కేవలం 47.49శాతంగా నమోదయింది. అంటే ఓటర్లలో సగం మంది కూడా ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఉపఎన్నికలో ఎంత మంది ఓటర్లు పాల్గొంటారు అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. కాగా ఈసారి ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News