వారసుల కోసమే గోడ దూకేస్తున్నారా ?

ఎంపీ కే కేశవరావు, కడియం శ్రీహరి, పీ రాములు, మల్లారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి సీనియర్లు బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదనే ఆందోళన పెరిగిపోతున్నట్లుంది.

Update: 2024-03-31 06:32 GMT
Kadiyam and KK source Facebook

ప్రధానప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ విషయం అర్ధమైపోతోంది. చాలామంది సీనియర్లు తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసమే బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేస్తున్నట్లు అర్ధమవుతోంది. రాజ్యసభ ఎంపీ కే కేశవరావు, కడియం శ్రీహరి, పీ రాములు, మల్లారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి సీనియర్లు బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదనే ఆందోళన పెరిగిపోతున్నట్లుంది. అందుకనే ఎవరిస్ధాయిలో వాళ్ళు మాట్లాడుకుని పార్టీ మారిపోతున్నారు. వీరిలో కేకే, కడియం కాంగ్రెస్ ముఖ్యులతో భేటీ కూడా అయ్యారు. కాంగ్రెస్ లో చేరటం లాంఛనమనే చెప్పాలి. అలాగే రాములు బీజేపీలో చేరారు. గుత్తా పార్టీ మారలేదు కాని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కొడుక్కోసం నల్గొండ కాంగ్రెస్ టికెట్ కోసం బాగా ప్రయత్నించారు.

అలాగే ఇంతకుముందే కాంగ్రెస్ లో చేరిన పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ లో చేరారు. ఇపుడు కేకే పార్టీ ఎందుకు మారారంటే కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి భవిష్యత్తు కోసమే. రాష్ట్రంలో సుమారు 30 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతలో పడిపోయాయి. హైదరాబాద్ కార్పొరేషన్ మీదకూడా కాంగ్రెస్ గురిపెట్టింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లను లాగేసుకుని, ఎంఐఎం కార్పొరేటర్ల సాయంతో గ్రేటర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ మేయర్ ను కూర్చోబెట్టాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహం. ఈ విషయాన్ని పసిగట్టిన కేకే, గద్వాల ముందుగానే రేవంత్ తో మాట్లాడేసుకున్నారు. కూతురుతో పాటు కేకే కాంగ్రెస్ లో చేరితే గద్వాల మేయర్ పదవికి ఎలాంటి ముప్పుండదన్న భరోసా దక్కిందని పార్టీ వర్గాల సమాచారం. అందుకనే ఇద్దరు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.

ఇక బీఆర్ఎస్ పార్టీలో వరంగల్ అభ్యర్ధిగా కడియం కావ్యకు టికెట్ ప్రకటించారు కేసీయార్. అయినా సరే టికెట్ వద్దనుకుని తండ్రి, కూతుళ్ళిద్దరు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. కారణం ఏమిటంటే బీఆర్ఎస్ అభ్యర్ధిగా కూతురు గెలవలేందని అర్ధమవ్వటమే. భవిష్యత్తు లేని బీఆర్ఎస్ లో ఉండేబదులు కాంగ్రెస్ లో చేరిపోతే మంచిదని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే కూతురితో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కారణం ఏమిటంటే బీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలవలేమని అర్ధమైపోయ్యే. నాగర్ కర్నూలు నుండి కొడుకు పోతుగంటి భరత్ కు టికెట్ ఇప్పించుకున్నారు.

అలాగే శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉంటూనే కొడుక్కి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి నల్గొండ లేదా భువనగిరి నుండి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే పార్టీలోనే టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఉండటంతో గుత్తా సక్సెస్ కాలేదు. మాజీమంత్రి చేమకూర మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్ గిరి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేసుకున్నారు. అయితే బీఆర్ఎస్ కు గెలుపు అవకాశాలు లేవని సడెన్ గా ప్రయత్నాలను విరమించుకున్నారు. కాంగ్రెస్ లోకి మారుతారనే ప్రచారాన్ని మల్లారెడ్డి కొట్టి పారేస్తున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ లో ఉంటే వారసులకు రాజకీయ భవిష్యత్తు కష్టమన్న ఉద్దశ్యంతోనే సీనియర్లు పార్టీ మారిపోతున్నారన్నది వాస్తవం.

Tags:    

Similar News