లోకూర్ దగ్గర పప్పులుడకవా ?
జస్టిస్ లోకూర్ కు ముక్కుసూటి మనిషిగా పేరున్నది. విచారణ సందర్భంగానే కాకుండా తీర్పులు చెప్పటంలో తన మన తేడా చూపించరని లోకూర్ కు బాగా పేరుంది.
బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగంలో అవినీతి ఆరోపణలను విచారించే కమిషన్ కు ఛైర్మన్ గా జస్టిస్ మదన్ బీ లోకూర్ ను ప్రభుత్వం నియమించింది. ఇంతకుముందు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు ఛైర్మన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలులోను, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో కేసీయార్ పదేళ్ళ పాలనలో పెద్దఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోగానే కేసీఆర్ పై వచ్చిన విద్యుత్ ఆరోపణలపై విచారణ కమిషన్ను నియమించారు. విచారణ వివరాలను జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో పంచుకున్నారన్న ఏకైక కారణంగా సుప్రింకోర్టు నరసింహారెడ్డి ఛైర్మన్ గా తగడని తీర్పుచెప్పింది. దాంతో ప్రభుత్వం కమిషన్ ఛైర్మన్ గా నరసింహారెడ్డి స్ధానంలో మదన బీ లోకూర్ ను నియమించింది.
కమిషన్ ముందు విచారణకు హాజరుకావటం ఇష్టంలేని కేసీఆర్ హైకోర్టులో ఛైర్మన్ నరసింహారెడ్డికి వ్యతిరేకంగా పిటీషన్ వేశారు. అయితే హైకోర్టులో ఓడిపోవటంతో వెంటనే సుప్రింకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలుచేశారు. రివ్యూ పిటీషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ నరసింహారెడ్డి వైఖరిని తప్పుపట్టింది. దాంతో ఛైర్మన్ గా నరసింహారెడ్డి తప్పుకున్నారు.
కొత్తగా నియమితులైన లోకూర్ ట్రాక్ రికార్డు చాలా క్లీన్ గా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా చేశారు. తర్వాత సుప్రింకోర్టులో జస్టిస్ గా కూడా పనిచేశారు. జస్టిస్ లోకూర్ కు ముక్కుసూటి మనిషిగా పేరున్నది. విచారణ సందర్భంగానే కాకుండా తీర్పులు చెప్పటంలో తన మన తేడా చూపించరని లోకూర్ కు బాగా పేరుంది. హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా ఉన్నపుడు లంచం తీసుకున్నారన్న అభియోగాలు రుజువు అవటంతో సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జి పట్టాభిరామారావును లోకూర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
సస్పెన్షన్ నేపధ్యం ఏమిటంటే ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో గాలి జనార్ధనరెడ్డికి వ్యతిరేకంగా ఒక పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ను విచారించి గాలికి బెయిల్ ఇవ్వాలా వద్దా అని విచారించింది పట్టాబిరామారావే. బెయిల్ పిటీషన్ను విచారించిన పట్టాబిరామారావు డబ్బులు తీసుకుని గాలికి బెయిల్ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలపై విచారణ జరిపించిన లోకూర్ డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ కాగానే పట్టాభిరామారావును సస్పెండ్ చేశారు. అలాగే ముస్లింలకు కేంద్రప్రభుత్వం కేటాయించిన 4.5 శాతం రిజర్వేషన్ చెల్లదని లోకూర్ తీర్పిచ్చారు. ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్ 27 శాతంలోనే ముస్లింలకు సర్దుబాటు చేయాలి కాని ప్రత్యేకంగా 4.5 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు లేదని చెప్పి కేంద్రం నిర్ణయాన్ని కొట్టేశారు.
లోకూర్ విచారించిన కేసులన్నింటిలోను ఎలాంటి మొహమాటాలు, ఒత్తిళ్ళకు లోనుకాకుండా తీర్పులిచ్చినట్లు తెలుస్తోంది. ఇపుడు కేసీఆర్ మీద వినిపిస్తున్న ఆరోపణల విషయంలో కూడా లోకూర్ వైఖరి అలాగే ఉండబోతోంది. ఆరోపణల్లో నిజముందని అనిపిస్తే కేసీఆర్ ను తప్పుపట్టడంలో ఎలాంటి శషభిషలుండవు. అలాగే ఆరోపణల్లో పసలేదని తేలితే కేసీఆర్ కు క్లీన్ చిట్ట ఇవ్వటానికి కూడా మొహమాటపడరు. ప్రభుత్వం తనను కమిషన్ కు ఛైర్మన్ గా నియమించింది కాబట్టి కేసీఆర్ కు వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న ఆలోచన కూడా లోకూర్ కు ఉండదు. ఉన్నదున్నట్లుగా సాక్ష్యాధారాల ప్రకారమే తీర్పులైనా, రిపోర్టయినా ఉంటుందనటంలో సందేహంలేదు. అందుకనే లోకూర్ ముందు ఎవరి పప్పులూ ఉడకవు అని లాయర్ల సర్కిళ్ళల్లో చెప్పుకుంటుంటారు. మరి ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత లోకూర్ విచారణ ఎలాగుంటుందో చూడాల్సిందే.