హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అక్రమాల డొంక కదులుతోంది. కొంతకాలంగా హెచ్‌సీయే అనేది నిర్వహించే కార్యక్రమాలతో కన్నా చేసిన అక్రమాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు నియామకం కూడా అక్రమంగానే జరిగినట్లు ఇటీవల దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను సీఐడీ అదుపులోకి తీసుకుంది. మల్కాజ్‌గిరి కోర్టు అనుమతుల మేరకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్‌రావు, సీఈవో సునీల్, రాజేందర్ యాదవ్, కవితను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా తాజాగా ఈ అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు మల్కాజ్‌గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితకు బెయిల్ మంజూరు చేస్తూ మల్కాజ్‌గిరి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులకు విధించి కస్టడీ పూర్తి కావడంతోనే న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా జగన్మోహన్ రావును మరోసారి కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. జగన్మోహన్ రావు, సునీల్ పిటిషన్‌పై వాదనలను సోమవారం వింటామని కోర్టు తెలిపింది.
అసలు అక్రమం ఇదే..
ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ మధ్య కొనసాగిన వివాదం.. సీఎం రేవంత్ చెంతకు చేరింది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. విజిలెన్స్ అధికారుల దర్యాప్తుకు ఆదేశించారు. మరుసటి రోజే హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. కానీ హెచ్‌సీఏకు అసలు చిక్కులు అప్పటి నుంచే మొదలయ్యాయి. దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అధికారులు అనేక విషయాలు కనుగొన్నారు. వాటిలో హెచ్‌సీఏ నిధులు దుర్వినియోగం అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ అంశంలోకి సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటించింది. హెచ్‌సీఏ అధ్యక్షులు జగన్ మోహన్ రావు, హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, హెచ్‌సీఏ సీఈవో సునీల్ కాంటే, చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు జి.కవితను సీఐడీ అరెస్ట్ చేసింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువా రెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ.. అనేక కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తోంది.