కర్రెగుట్టల్లో మావోయిస్టుల అతిపెద్ద బంకర్ గుర్తింపు
ఎలాగైనాసరే అడవులను(Karregutta forest) జల్లెడపట్టయినా మావోయిస్టులందరినీ తుడిచిపెట్టేయాలన్న పట్టుదలతో భద్రతాదళాలు రాత్రి, పగలనక అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి.;
కర్రెగుట్టల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ లో భాగంగా ఛత్తీస్ ఘడ్-మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్యలో ఉన్న కర్రెగుట్టల అడవుల్లో మావోయిస్టులకోసం భద్రతాదళాలు గడచిన ఆరురోజులుగా జల్లెడపడుతున్న విషయం తెలిసిందే. మావోయిస్టులు(Maoist Operations) భారీసంఖ్యలో సమావేశం అవుతున్నారన్న కచ్చితమైన సమాచారంతోనే భద్రతాదళాలు అడవుల్లో గాలింపుచర్యలు చేస్తున్నారు. అడవుల్లో సమావేశానికి మావోయిస్టు అగ్రనేతలు చాలామంది హాజరువుతున్నారన్న సమాచారం పోలీసుల దగ్గరుంది. అందుకనే ఎలాగైనాసరే అడవులను(Karregutta forest) జల్లెడపట్టయినా మావోయిస్టులందరినీ తుడిచిపెట్టేయాలన్న పట్టుదలతో భద్రతాదళాలు రాత్రి, పగలనక అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి.
మావోయిస్టులను తుడిచిపెట్టేయాలన్న పట్టుదల భద్రతాదళాల్లో ఏస్ధాయిలో ఉందంటే 200 కిలోమీటర్లలో విస్తరించున్న అడువులను భద్రతాదళాలు నాలుగువైపులా చుట్టుముట్టేశాయి. సుమారు 10 వేలమంది భద్రతాదళాలు అడువులను బయటనుండి కాపుకాస్తుంటే మిగిలిన 10 వేలమంది అడవుల్లో నాలుగువైపులా కూంబింగ్ చేస్తున్నారు. నేలపైన అధునాతన ఆయుధాలతో భద్రతాదళాలు గాలింపులు, కాల్పులు జరుపుతుంటే ఆకాశంలోనుండి హెలికాప్టర్లు, ద్రోన్లతో మావోయిస్టుల ఆచూకీకోసం గాలింపు జరుగుతోంది. మావోయిస్టులు అడవుల్లో అమర్చిన మందుపాతరలు, బాంబులను గుర్తించేందుకు వందలాది పోలీసు డాగ్ స్వ్కాడ్ ను కూడా భద్రతాదళాలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే శనివారం రాత్రి మావోయిస్టులకు పెద్దదెబ్బ తగిలింది. ఏ రూపంలో అంటే అడవిలో భద్రతాదళాలు అతిపెద్ద బంకర్(Maoist bunker) ను గుర్తించాయి. బంకర్లోకి భద్రతాదళాలు వెళ్ళిచూసినపుడు ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే, గుర్తించిన బంకర్లో సుమారు వెయ్యిమంది కొద్దిరోజుల పాటు తలదాచుకునేందుకు సమస్తసౌకర్యాలున్నాయి. నీటిసౌకర్యం, వంటలు చేసుకునేందుకు, బాత్రూమ్ సౌకర్యాలతో పాటు వెయ్యిమంది కొద్దిరోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిపేందుకు అవసరమైన వసతులతో బంకర్ ను మావోయిస్టులు ఏర్పాటుచేసుకున్నారు. సౌకల సౌకర్యాలతో ఇంతపెద్ద బంకర్ ను ఏర్పాటుచేసుకునేందుకు మావోయిస్టులకు ఎంతకాలం పట్టింది ? ఎంతమంది పనిచేస్తే ఇలాంటి బంకర్ తయారైందో తెలీదు. భద్రతదళాల కూంబింగ్ ఆపరేషన్స్(Operation Kagar) కారణంగా మావోయిస్టులు ఈబంకర్ను ఖాళీచేసి వెళ్ళిపోయారు. బంకర్లో పరిస్ధితులను గమనించిన తర్వాత మావోయిస్టులు బంకర్ ను ఈమధ్యనే ఖాళీచేసినట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. కాబట్టి మావోయిస్టులు చుట్టుపక్కలే ఎక్కడో మరోబంకర్లో తలదాచుకున్నారేమో అని అనుమానిస్తున్నారు. బయటపడిన బంకర్ తో పాటు అడవుల్లో చాలా గుహలను భద్రతాదళాలు గుర్తించాయి. మావోయిస్టులు గ్రూపులుగా విడిపోయి ఈగుహల్లో తలదాచుకునే అవకాశాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
అందుకనే అడవులను జల్లెడపట్టడమే కాకుండా ఇపుడు ఎదురుపడిన గుహల్లోపలకు ద్రోన్లను పంపాలని డిసైడ్ అయ్యారు. గుహల్లోపలకు ఆడియో, వీడియో, ఫొటోలు తీసే సౌకర్యాలున్న ద్రోన్లను భద్రతాదళాలు వందలసంఖ్యలో తెప్పించుకుంటున్నాయి. ఎలాగైనా సరే ఒక్కమావోయిస్టు కూడా తమనుండి తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదలతో భద్రతాదళాలున్నాయి. మావోయిస్టులు లొంగిపోవటమో లేకపోతే తమ కాల్పుల్లో చనిపోవటమో ఏదో ఒకటే జరగాలని భద్రతాదళాలు మహాపట్టుదలగా ఉన్నాయి.
తెలంగాణ(Telangana)లోని ములుగు, వెంకటాపురం, వాజేడు అడవుల్లోను, ఛత్తీస్ ఘడ్(Chhattisgarh) వైపున ఉన్న కొత్తపల్లి, భీమారంపాడు, చినఉట్లపల్లి, పెద్దఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్లం అడవుల్లోనే ప్రధానంగా భద్రతాదళాల కూంబింగ్ జరుగుతోంది. అడవులను జల్లెడపట్టడంలో భాగంగానే భద్రతాదళాలు చాలా ప్రాంతాలను తమఆధీనంలోకి తీసుకుంటున్నాయి. ఆధీనంలోకి తీసుకుంటున్న ప్రాంతాల్లో భద్రతాదళాలు బేస్ లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ప్రతి బేస్ లోను తక్కువలో తక్కువ 500మంది సాయుధులుండేట్లుగా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాలుగువైపుల నుండి అడవులను జల్లెడపడుతు మావోయిస్టులను అడవుల మధ్యలోకి లేదా కొండలపైకి చేరుకునేట్లుగా భద్రతాదళాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఒకసారి మావోయిస్టులు అడవుల మధ్యలోకి లేదా కొండలపైకి చేరుకుంటే ఇక వాళ్ళపని అయిపోయినట్లే.
ఇప్పటికే ఆరురోజుల గాలింపులో సుమారు 45మంది మావోయిస్టులు చనిపోయారు. భద్రతాదళాల అంచనా ప్రకారం మావోయిస్టుల టాప్ లీడర్లు 80 మందితో కలిపి సుమారు 1500 మంది అడవుల్లో సమావేశమయ్యేందుకు వచ్చుంటారు. కచ్చితమైన సమాచారం అందటంతోనే భద్రతాదళాలు అడవులు నాలుగువైపుల నుండి ఏకకాలంలో గాలింపుచర్యలు మొదలుపెట్టేశాయి. ఒకపుడు మావోయిస్టులకు అబూజ్ మడ్ కంచుకోటగా ఉండేది. వేలాది ఎకరాల విస్తీర్ణంలో ఉండే అబూజ్ మడ్ అడవులను భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దాంతో మరో షెల్టర్ జోన్ కోసం గాలించిన మావోయిస్టులు కర్రెగుట్టల అడవులను సేఫ్ జోన్ గా ఉపయోగించుకుంటున్నారు.
ఇలాంటి సేఫ్ జోన్లోకి కూడా ఇపుడు భద్రతాదళాలు ప్రవేశించాయి. మామూలుగా అయితే ఈఅడవులను భద్రతాదళాలు పట్టించుకునే అవకాశంలేదు. అయితే మావోయిస్టుల అనాలోచిత చర్యల వల్లే సేఫ్ జోన్ బయపడింది. అడవుల్లోకి ఆదివాసీలను ప్రవేశించవద్దని మావోయిస్టులు కొద్దిరోజులక్రితం హెచ్చరికలు పంపారు. అడవుల్లో మందుపాతరలు, బాంబులు అమర్చాము కాబట్టి ఆదివాసీలు ఎవరూ లోపలకు రావద్దని వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టుల వార్నింగులను అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఉండే ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకించటమే కాకుండా మావోయిస్టులను నిలదీస్తు గ్రామాల్లో పోస్టర్లను అంటించారు. ఈవ్యవహారాలన్నీ లోకల్ పోలీసుల దృష్టిలో పడ్డాయి. గ్రామాల్లో ఏమిజరుగుతోందో తెలుసుకునేందుకు పోలీసులు, నిఘావర్గాలు రంగంలోకి దిగాయి. దాంతో మావోయిస్టుల హెచ్చరికల విషయం బయటపడింది. మావోయిస్టులు గ్రామస్తులను అడవుల్లోకి రాకుండా ముందుజాగ్రత్తగా మందుపాతరలు, బాంబులు అమర్చుకున్నారంటే లోపల పెద్దఎత్తున ఏదో జరుగుతోందనే అనుమానం నిఘావర్గాలకు వచ్చేసింది. దీని ఫలితంగానే గడచిన ఆరురోజులుగా కర్రెగుట్టల అడవుల కూంబింగ్. ఆదివారం ఉదయం నుండి హెలికాప్టర్ల నుండి కూడా భద్రతాదళాలు కాల్పులు జరుపుతున్నాయంటే ఏదో పెద్ద వ్యవహారమే అడవుల్లో జరుగుతున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాకపోతే ఏ చిన్న విషయాన్ని కూడా బయటకు పొక్కకుండా భద్రతాదళాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందుకనే అడవుల్లో ఏమి జరగుతుందోనే విషయమై ఎవరు నోరిప్పటంలేదు.