పాడి కౌశిక్ రెడ్డికి మరోసారి నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.;
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ మాసబ్ ట్యాంక్ పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ నమోదైన కేసుకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారణకు గైర్హాజరైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతుందని పేర్కొంటూ ఫిర్యాదు ఇవ్వడం కోసం డిసెంబర్ 4న బుధవారం మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అదే సమయంలో ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర బయటకు వెళ్తున్నారు. అది గమనించిన కౌశిక్ రెడ్డి.. తన ఫిర్యాదు తీసుకున్న తర్వాత వెళ్లాలని డిమాండ్ చేశారు. తాను ఒక అర్జెంట్ పనిపైన వెళ్తున్నానని, తిరిగి వచ్చాక ఆయన ఫిర్యాదును స్వీకరిస్తానని సీఐ చెప్పారు. దాంతో కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి అనుచరులు సీఐ వాహనాన్ని అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సీఐ వెనక్కు వచ్చి కౌశిక్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించారు. అనంతరం తనను తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారంటూ కౌశిక్ రెడ్డి సహా ఆయన అనుచరులపై సీఐ ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ సహా 20మంది ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 57, 126(2), 132, 224, 333, 451(3), 191(2), r/w 190, r/w 3(5) సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
కాగా డిసెంబర్ 5న పోలీసులు కౌశిక్ రెడ్డిని అతని నివాసం నుంచి అరెస్ట్ చేశారు. ఇందులో అదే రోజు రాత్రికి బెయిల్ అందుకుని కౌశిక్ రెడ్డి బయటకు వచ్చారు. అయితే ఈ అరెస్ట్ క్రమంలో తనను అరెస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డరంటూ పోలీసులు మరోకేసు నమోదు చేశారు. ఇదెలా ఉంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.