గుల్జార్‌హౌస్ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వరుస అగ్నిప్రమాద సంఘటనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భవనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోనున్నారు.;

Update: 2025-05-18 10:40 GMT
అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

హైదరాబాద్ నగరంలోని గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. రెండు మూడు రోజుల్లో సీరియస్ గా సమావేశం నిర్వహించి ఇలాంటి అగ్ని ప్రమాద సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులతో అగ్నిప్రమాదాల గురించి మాట్లాడుతున్నారని భట్టి చెప్పారు.


ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జర్ హౌస్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలించారు. ఉపముఖ్యమంత్రి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉన్నారు.పాతబస్తీ గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాద సంఘటనా స్థలిని సందర్శించిన డిప్యూటీ సీఎం , అనంతరం మీడియాతో మాట్లాడారు.

మూడు నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది స్పందించారు...
మూడు నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది స్పందించారని, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో స్పందించాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చెప్పారు.ఉదయం 6:17 గంటలకు అగ్నిమాపక శాఖకు ప్రమాదం గురించి ఫోన్ రాగా 6:20 నిమిషాలకి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే పనులు చేపట్టారని ఆయన తెలిపారు. ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారని ఆయన వివరించారు.లేకుంటే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఫైర్ ఫైటర్ అస్వస్థత
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో మంటలు ఆర్పే క్రమంలో ఫైర్ ఫైటర్ ఒకరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ను ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భట్టి చెప్పారు.గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందడం పై సర్కారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

మంత్రిమండలి తీవ్ర దిగ్భ్రాంతి
పాతబస్తీలోని గుల్జార్‌ హౌస్‌ సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని, ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్తు మంత్రిమండలి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని తెలిపారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా స్పందించి మంత్రులు, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టడంతో పాటు బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని మినీ టు మినిట్ పర్యవేక్షణ చేశారని చెప్పారు.ఈ అగ్నిప్రమాదం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిందని డీజీపీ జితేందర్‌ చెప్పారు.మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, పొగ వల్ల ఊపిరాడక 17 మంది మృతి చెందారని డీజీపీ జితేందర్‌ చెప్పారు.



Tags:    

Similar News