హైదరాబాద్‌లో ‘మాక్ డ్రిల్’ ఎలా సాగిందంటే....

ఉగ్రవాదుల బాంబు దాడులు జరిగినపుడు ఎలా అప్రమత్తం అవ్వాలో ప్రజలకు అధికారులు కళ్లకు కట్టినట్లు చూపించారు.;

Update: 2025-05-07 13:53 GMT
మారేడుపల్లి అపార్టుమెంట్ వద్ద బాంబు పేలుడు

తేదీ 07.05.2025 , బుధవారం సాయంత్రం 4.00 గంటల సమయం...హైదరాబాద్ నగరంలోని మారేడుపల్లి ప్రాంతంలోని అపార్టుమెంట్...ఉగ్రవాదులు ఒక్కసారిగా అపార్టుమెంటుపై బాంబు వేశారు. ఢాం అని పేలిన శబ్దంతో మారేడుపల్లి ప్రాంతంలో పొగలు వెలువడటంతో పాటు బీతావహ పరిస్థితి నెలకొంది..అంతే సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సైరన్ మోగించి చుట్టుపక్కల వారినందరినీ అప్రమత్తం చేశారు. ఈ ఘటన జరిగిన సమాచారం అందుకున్న పోలీసు, తెలంగాణ అగ్నిమాపకశాఖ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎన్‌సీసీ, జీహెచ్ఎంసీ,హైడ్రా, విద్యుత్, వైద్యఆరోగ్యశాఖ బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చాయి. కూయ్ కూయ్ అంటూ అంబులెన్సులు సంఘటన స్థలానికి వచ్చాయి.




 - సాయంత్రం 4.20 గంటలకు బాంబు పేలుడు జరిగిన అపార్టుమెంట్ వద్దకు వచ్చిన పోలీసులు, అగ్నిమాపకశాఖ, విపత్తు సహాయక బృందాలు హుటాహుటిన వచ్చి అపార్టుమెంట్ లోని ఫ్లాట్లలో తీవ్ర గాయాలతో లోపల చిక్కుకున్న వారిని స్టెచర్ల సహాయంతో అంబులెన్సుల్లోకి ఎక్కించారు. క్షతగాత్రులను ఎక్కించుకున్న అంబులెన్సులు కూయ్ కూయ్ అంటూ ప్రభుత్వం ప్రాథమిక వైద్య కేంద్రానికి వెళ్లాయి. అక్కడ స్టెచర్ సాయంతో క్షతగాత్రులను బెడ్స్ మీదకు పడుకోబెట్టి, వైద్యులు, నర్సులు వైద్యచికిత్సలు ప్రారంభించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చారు.




 - బాంబు పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఫ్లాట్ల లోపల చిక్కుకున్న వారిని ఆక్సిజన్ సిలిండర్ల పైపుల సాయంతో ఆక్సిజన్ అందిస్తూ వారిని మోచేతులతో ఎత్తుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సమీపంలో షెనాయ్, గాంధీ ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.




 - ఎటుచూసినా క్షతగాత్రుల హాహాకారాలు...మరో వైపు పోలీసు, అగ్నిమాపక శాఖ సైరన్ తో సంఘటన స్థలం మార్మోగింది. పోలీసులు,ఇతర విపత్తు సహాయ సిబ్బంది పరుగెత్తుతూ క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.




 ఇదీ మాక్ డ్రిల్

ఇదంతా ఏమిటనుకుంటున్నారు...ఇదీ హైదరాబాద్ నగరంలో బుధవారం తెలంగాణ అధికారులు నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో భాగం...జమ్మూకశ్మీరులోని పహల్ గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో మన భారతదేశ సైనిక, వాయుసేన దళాలు పాకిస్థాన్ లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో భాగంగా దాడులు చేశాయి. ఈ కార్యక్రమం నేపథ్యంలో దేశంలోని దేశ రక్షణకు సంబంధించి వ్యూహాత్మక 244 ప్రాంతాల్లో బుధవారం ముందు జాగ్రత్తల గురించి ప్రజలకు అప్రమత్తం చేసేందుకు కేంద్రప్రభుత్వం మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని మారేడుపల్లి, గోల్కొండ, కంచన్ బాగ్, ఎన్ ఎఫ్ సీ కాలనీ ప్రాంతాల్లో తెలంగాణ పోలీసులు, విపత్తు శాఖ దళాలు చేపట్టిన మాక్ డ్రిల్ విజయవంతం అయింది. ఉగ్రవాదుల బాంబు దాడులు జరిగినపుడు ఎలా అప్రమత్తం అవ్వాలో ప్రజలకు అధికారులు కళ్లకకు కట్టినట్లు చూపించారు.



 బాంబుదాడులు లాంటి ఘటనలు జరిగినపుడు ప్రజలకు అప్రమత్తం చేసేందుకే మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. తమ మాక్ డ్రిల్ కార్యక్రమంతో ప్రజలకు అవగాహన ఏర్పడిందని వారు పేర్కొన్నారు.



Tags:    

Similar News