పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్..

రేవంత్‌ను రిబ్బన్ కటింగ్ సీఎం అంటూ బీఆర్ఎస్ విమర్శలు.

Update: 2025-10-03 08:27 GMT

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయిన సందర్భాలెన్నో. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ట్రాఫిక్ తిప్పలు మరీ అధికంగా ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో పాతబస్తీ ఏరియా ఒకటి. అక్కడ ట్రాఫిక్ అత్యంత దారుణంగా ఉంటుంది. అయితే తాజాగా పాతబస్తీ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రభుత్వం ఉపశమనం అందించింది. వారి ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ ఫలక్‌నుమా రోడ్ ఓవర్ బ్రిడ్స్(ROB)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని శుక్రవారం రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఫలక్‌నుమా రైల్వే ట్రాక్‌పై ఇప్పటికే ఒక బ్రిడ్స్ ఉంది.. కానీ అది మరీ ఇరుకుగా మారడం, ట్రాఫిక్ రద్దీ కూడా విపరీతంగా పెరగడంతో దానికి సమాంతరంగా మరో బ్రిడ్జ్ నిర్మించాలని జీహెచ్ఎంసీ భావించింది.

అనుకున్నట్లుగానే మరో రెండు లైన్ల ఆర్ఓబీని నిర్మించింది. ఈ బ్రిడ్జ్‌ను రూ.52.03 కోట్ల వ్యవయంతో 360 మీటర్ల పొడవున నిర్మించారు. తొలుత నిర్మించిన ఆర్ఓబీ రెండు లైన్లతోనే ఉండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. అందుకే కొత్తగా మరో రెండు లైన్ల బ్రిడ్జ్‌ను ప్రభుత్వం నిర్మించింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ఫలక్‌నుమా నుంచి చంద్రాయణ గుట్ట సహా ఇతర ప్రాంతాలకు వెళ్లే పాతబస్తీ ప్రయాణికులకు ఊరట లభించింది.

రిబ్బన్ కటింగ్ సీఎం: బీఆర్ఎస్

ఇదిలా ఉంటే ఈ బ్రిడ్జ్ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఘాటుగా స్పందిస్తోంది. తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్‌లకు కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా క్రెడిట్‌లు తీసుకుంటున్నాంటూ విమర్శలు గుప్పించింది. అంతేకాకుండా సీఎం రేవంత్, ఆయన మంత్రులను రిబ్బన్ కటింగ్ నేతలంటూ చురకలంటించింది. ‘‘చార్మినార్ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫలక్‌నుమాలో పాత రోడ్ ఓవర్ బ్రిడ్జికి సమాంతరంగా మరో రోడ్ ఓవర్ బ్రిడ్జి పనులను ప్రారంభించింది. 90శాతం పూర్తయిన పనులను రెండేండ్ల పాటు సాగదీసి నేడు రిబ్బన్ కట్ చేస్తున్న రేవంత్’’ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోంది.

Tags:    

Similar News