మిస్ వరల్డ్ పోటీల ప్రత్యక్ష ప్రసారం టైమ్స్ స్క్వేర్ స్క్రీన్‌పై...
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ లో 72వ మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫినాలే కార్యక్రమం కోలాహలంగా సాగుతోంది.;
By : The Federal
Update: 2025-05-31 13:45 GMT
తెలంగాణ రాష్ట్రంలోని హైటెక్స్ లో శనివారం రాత్రి మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతున్న 108 మంది అందాల భామలు ర్యాంప్ వాక్ చేస్తున్నారు.అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్ ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 108 మగువలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. శనివారం రాత్రి మరి కొద్ది గంటల్లో మిస్ వరల్డ్ ప్రపంచ విజేత ఎవరనేది తేలనుంది. మిస్ వరల్డ్ కిరీటం కోసం ఫైనల్స్ కి చేరినవారు పోటీపడుతున్నారు.20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అందాల భామలు తమ ప్రతిభను చాటటంతో పాటు, తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు.మిస్ వరల్డ్ పోటీల ప్రత్యక్ష ప్రసారం న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
తెలంగాణ జరూర్ ఆనా
తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచ సుందరీమణులు ప్రపంచవ్యాప్తం చేశారు. మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్ లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ మానవతావాది, నటుడు సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఆయన ఫైనల్స్ కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తారు. ఇతర జ్యూరీలుగా సుధా రెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఉన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా మానుషి ఛిల్లర్
మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మానుషి ఛిల్లర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం భారతదేశంలో సోనీ లివ్‌లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. కొన్ని దేశాల్లో జాతీయ టెలివిజన్‌లో ప్రసారం అవుతుంది.
అతిథులు ఎందరో...
గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ , పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులో ఖండాల వారీగా అద్భుతంగా డిజైన్ చేసిన స్టేజీపై అందాల భామలు ర్యాంపు వాక్ చేశారు. 108 దేశాల సుందరీమణులు ప్రపంచ వ్యాప్తంగా ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నారు.