ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. విచారణకు అనుమతి కోరిన ఏసీబీ
ప్రభుత్వానికి నివేదిక అందించిన అవినీతి నిరోధక శాఖ.;
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిందితులను విచారించడానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోరింది. ఈ మేరకు వారు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదికలో ఫార్ములా కేసుకు సంబంధించి తాము సేకరించిన పలు కీలక అంశాలను కూడా పొందుపరిచారు. ఇందులో ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్‌ను మూడు సార్లు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కాగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ రాగానే కేటీఆర్, అరవింద్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
అసలు కేసు ఏంటంటే..
2023లో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడం వల్ల ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. రేస్ నుంచి ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో) సంస్థ తప్పుకొన్న అనంతరమూ నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకోకపోవడం.. మంత్రివర్గం ఆమోదం పొందకపోవడం.. తదుపరి మూడేళ్లపాటు రేస్‌ల నిర్వహణకు రూ.600 కోట్ల మేర చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని అంతర్గత విచారణలో ప్రభుత్వం తప్పుపట్టింది. ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే రూ.54.88 కోట్ల మేర చెల్లించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది. దీనిపై ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.