కుప్పకూలిన గురుకుల పాఠశాల భవనం
విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం. కానీ ముగ్గురు మాత్రం..;
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో విద్యార్థులకు ప్రమాదం తృటిలో తప్పింది. కానీ ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్న భోజనం చేయడానికి విద్యార్థులు వెళ్తున్న సమయంలో భవనం కూలింది. అప్రమత్తమైన విద్యార్థులు కాస్తంత ముందే తరగతి గదుల నుంచి బయటకు వచ్చారు. దాంతో వారికి పెను ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులు భోజనశాలకు వెళ్తున్నప్పుడు, భవనంలో నుంచి శబ్దాలు రావడం గమనించారు. దీంతో వారు వెంటనే గదుల నుంచి బయటకు పరుగు తీశారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం
విద్యార్థులు బయటకు వచ్చేసిన క్షణాల్లోనే భవనం నేలమట్టమయింది. ఈ ఘటనలో ఇటుకలు ఎగిరి ముగ్గురు విద్యార్థులకు తగిలాయి. దాంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని పాఠశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒకవేళ ఈ ఘటన రాత్రిపూట జరిగి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనే భవనం శిథిలావస్థకు చేరిందని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు
తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కలుషిత ఆహారం, ఎలుక కాట్లు, కలుషిత నీరు ఇలా అనేక అంశాలు విద్యార్థులను బాధించాయి. అనేక మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. పలువురు విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు సంగారెడ్డిలో గురుకుల పాఠశాలల భవనం కూలడం వారిని మరింత ఆదోళనకు గురిచేస్తోంది. వారు ఉండే భవనాలకు కూడా గ్యారెంటీ లేకపోతే ఎలా అని వారు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదే గటన రాత్రి వేళలో జరిగి ఉంటే భారీ సంఖ్యలో విద్యార్థులు మరణించి ఉండేవారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికయనా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలల భవనాల నాణ్యత, దుస్తితిపై వెంటనే ప్రత్యేక దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాలం చెల్లిన, కూలే అవకాశాలు ఉన్న భవనాలకు వెంటనే ప్రత్యామ్నాయాలు చూడాలని కోరుతున్నారు.