ఫిరాయింపులపై చర్యకు స్పీకర్ మొహమాట పడుతున్నారా..?

బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారని హస్తం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఒప్పుకున్నారన్న కేటీఆర్.;

Update: 2025-09-09 13:03 GMT

ఫిరాయింపు నేతల అంశంపై కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. చాలా మంది ఇప్పుడు అతి తెలివి ప్రదర్శిస్తూ తాము ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్తున్నారని, కానీ పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. జడ్చర్లలో మంగళవారం పర్యటించిన కేటీఆర్.. ఫిరాయింపుల విషయంపై స్పందించారు. ఫిరాయింపులు జరిగాయని మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన తర్వాత కూడా వారిపై చర్యలు తీసుకోవడానికి స్పీకర్ ఎందుకు మొహమాట పడుతున్నార? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు స్టేట్‌మెంట్‌ను సుప్రీం కోర్టు ముందు ఉంచుతామని అన్నారు.

ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని స్థితి..

బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి ఆ తర్వాత పార్టీ మారిన నేతల దుస్థితి అగమ్యగోచారంగా ఉందని విమర్శించారు. వాళ్లు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేకున్నారని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే తాము ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నామంటూ మళ్ళీ తమ పార్టీ పేరును అడ్డుగా పెట్టుకునే బచావ్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు. పార్టీ మారిన నేతలు మారామని చెప్పుకునే ధైర్యం చేయలేకున్నారని, కానీ తాము ఈ విషయంలో చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపమని అన్నారు కేటీఆర్.

ఎమ్మెల్యేల ప్లాన్ ఇదే..

సుప్రీంకోర్టు ఆదేశాలతో పలువురు ఫిరాయింపు నేతలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. పదిమంది ఎంఎల్ఏల్లో ఎంతమందికి నోటీసులు అందాయన్న విషయంలో క్లారిటిలేదు. గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ కుమార్ కు నోటీసులు అందినట్లు వారే స్వయంగా చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాము బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని ఈ ఎంఎల్ఏలు అంటున్నారు. తాము పార్టీ ఫిరాయించామని జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని చెబుతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము రేవంత్ ను కలిసినట్లు చెబుతున్నారు. ఇదేవిషయాన్ని స్పీకర్ కు పంపిన సమాధానంలో బండ్ల స్పష్టంచేశారు.

Tags:    

Similar News