ఒకవైపు కౌంటింగ్.. మరోవైపు ఎలక్షన్ షెడ్యూల్
ఏపీ, తెలంగాణ మరోసారి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి.;
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. మూడు షిఫ్ట్‌లలో కౌంటింగ్‌ను పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచారు అధికారులు. ముందుగా బ్యాలెట్ పేపర్ల లెక్కింపు షురూ చేశారు. ఈ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి కానుంది. పూర్తిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను సాయంత్రం 5 గంటల లోపు వెల్లడించేలా అధికారులు కౌంటింగ్‌ను కొనసాగిస్తున్నారు. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రిజల్ట్స్ తెలియడానికి మాత్రం రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా.. ఇదే రోజు మరోసారి ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.
తెలంగాణలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి కరీంనగర్‌లో అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్‌హౌసింగ్ గోదాములో కేంటింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. చెల్లుబాటు అయిన ఓట్లలో 50శాతానికిపైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మొత్తం పది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ. ఏపీలో 5, తెలంగాణలో ఐదుగురి పదవీకాలం ముగియనున్న క్రమంలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఎలక్షన్ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. దాని ప్రకారం.. మార్చి 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ. మార్చి 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా జరగనుంది.